తెలుగుదేశం గుండెల్లో గులాబీ "ముళ్లు"

PTI
ఎటువంటి చర్చకు ఆస్కారం లేకుండా కమలంతో గులాబీ జతకట్టింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కమలం తమకు బాసటగా నిలుస్తుందని గులాబీలు చెపుతున్నాయి. ఏమిటీ ఈ గులాబీ, కమలాల గోల అనుకుంటున్నారా...? అదేనండీ ప్రత్యేక రాష్ట్రంకోసం అహరహం తపిస్తున్నామని చెపుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి, కేంద్రంలో కమలనాథులకు బాసటగా నిలుస్తామని ఆదివారం ఒకే వేదికమీద నుంచి భరోసా ఇచ్చింది కదా. ఆ సంగతి. భరోసా ఇవ్వటమే కాదు, తమతోపాటు మరికొందరు మిత్రులను ఎన్డీఏకు మద్దతు పలికేటట్లు చేస్తాననీ కేసీఆర్ ప్రకటించారు.

కేసీఆర్ ప్రకటనతో తెలుగుదేశం పార్టీలో గుబులు పట్టుకున్నట్లు సమాచారం. ఒకవైపు హంగ్ అసెంబ్లీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో తెరాస ఇలా ప్రవర్తించడం వెనుక ఆంతర్యం ఏమై ఉండవచ్చని తేదేపా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణా రాష్ట్ర సమితి తమ ఏకైక లక్ష్యం తెలంగాణా సాధన కనుక తమ మిత్ర పక్షాలు ఆ దిశగా యోచించాల్సిన అవసరం ఉందని ఫలితాలకు ముందే బాంబు పేల్చింది.

తెలంగాణా రాష్ట్ర సమితి అనుసరిస్తున్న విధానాన్ని ఒకసారి పరికించి చూస్తే ఫలితాల అనంతరం మహాకూటమి చిత్రం ఎలా ఉంటుందో ఊహామాత్రంగా ద్యోతమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వారు చెప్పేదానిని బట్టి చూస్తే.... అసెంబ్లీ ఫలితాలు తర్వాత తెరాస మద్దతు లేనిదే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనేది నిర్వివాదాంశం. గులాబీ మద్దతు తెదేపాకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో తాము మద్దతు ఇవ్వాలంటే కేంద్రంలో తమకు అనుకూలంగా ఉన్న ఎన్డీఏకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని గులాబీ నేతలు తెదేపాను పట్టుబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

ఇదిలా ఉంటే తెరాస నిర్ణయంతో సీపీఐ, సీపీఎంలు కుతకుతలాడుతున్నట్లు సమచారం. ఈ రెండు పార్టీలను బుజ్జిగిస్తూ, తెరాసాను దారిలోకి ఎలా తీసుకురావాలా...? అని తెలుగుదేశం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు భోగట్టా.

ఒకవేళ తెరాస తమ మాట వినకపోతే ఏం చేయాలీ...? అనే ప్రశ్న తెలుగుదేశాన్ని పట్టి పీడిస్తున్నట్లు సమాచారం. తెరాసాతో సమస్య తలెత్తితే ప్రజారాజ్యం అండదండలు తీసుకోవాలని తెలుగుదేశం నిర్ణయించినట్లు ఊహాగానాలు సైతం వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్ర సమితి పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలుపు సాధిస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో చక్రం తిప్పటం ఖాయం అని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి