ఉచిత వాగ్దానాలకు ఎక్కువ-అభివృద్ధి హామీలకు తక్కువ

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లెక్కలేనన్ని హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. 115 కోట్ల భారత ప్రజలలో దాదాపు 40 శాతం మంది కడు నిరుపేదలు. వీరందరికీ కిలో మూడు రూపాయల చొప్పున బియ్యాన్ని అందజేస్తానంటోంది కాంగ్రెస్ పార్టీ.

భాజపా అయితే దేశ వ్యాప్తంగా లాడ్లీ లక్ష్మీ యోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద ఆడపిల్ల పుట్టిన వెంటనే బ్యాంకులో ఆమె పేరు మీద నగదును డిపాజిట్ చేస్తారు. అదేవిధంగా మూడు లక్షల రూపాయల ఆదాయం కలిగిన వారికి ఆదాయపన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇస్తామని తెలిపింది.

దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపింది. ఇటువంటి ప్రజాకర్షక పథకాలు మిగిలిన ప్రాంతీయ పార్టీలలో కోకొల్లలుగా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని ఉచిత నగదు బదిలీ పథకాన్ని మన రాష్ట్ర మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించి ఉచిత ప్యాకేజీల్లో తానే ముందున్నాననిపించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉచితాలను కొనసాగిస్తున్నానంటే, ప్రజారాజ్యం కొత్తగా పసుపు కుంకుమ పథకం, వంద రూపాయలకే గ్యాస్ కనెక్షన్ వంటి పథకాలను ప్రకటించింది.

ఇలా ఏ రాజకీయ పార్టీ ఏ చెప్పినా, దాని ఉద్దేశ్యం మాత్రం ఓటర్లను ఎలా ఆకర్షించాలన్నదానిపైనే. గత ఎన్నికలలో అభివృద్ధి మంత్రం జపించిన పార్టీలు, ఇప్పుడు ఉచిత ప్యాకేజీల వాగ్దానాలను ఒకదాన్ని మించి మరొకటి చేస్తున్నాయి. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఉచిత వాగ్దానాల వరద ఏరులై పారుతోంది. ఎలాగైనా ఓటర్లను ఒడిసిపట్టి తమ ఖాతాలో జమ చేసుకోవాలనేది అన్ని పార్టీల లక్ష్యంగా కనబడుతున్నది.

అధికార దాహం ఒక్కటే ఈ వాగ్దానాల వెనుక అసలు రహస్యం అని ఇప్పటికే దేశంలోని ప్రజలు అక్కడక్కడా చర్చించుకోవడం కనబడుతున్నది. ఇదిలా సాగుతుంటే, లాలూ- పాశ్వాన్- ములాయంలతో కూడిన త్రిసభ్యు బృందం కలిసి ఉత్తరాదిన వేరు కుంపటి పెట్టలేదని చెపుతున్నా, దాదాపు పెట్టినట్లే తెలుస్తోంది. పైకి యూపీఎకు వ్యతిరేకంగా కాదని చెపుతున్నా, అధిక సంఖ్యలో పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుని ప్రధాని కుర్చీపై కుర్చునేందుకు పాశ్వాన్, లాలూ ఉవ్విళ్లూరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ ముగ్గురూ అనుకున్నట్లే జరిగితే ఖచ్చితంగా త్రిసభ్య కూటమి హస్తానికి చేయిచ్చి, తమకు మద్దతు తెలుపమని అడిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్, భాజపాలు రెండూ మిస్టరీలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండింటినీ మిత్రులు ఒకరొకరుగా జారిపోతూ భయపెడుతున్నారు. ఎన్నికలైన తర్వాత తిరిగి మీ గూటికే వస్తామని చెపుతున్నా, లోలోపల మాత్రం ప్రధాన పార్టీలకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.

మొత్తంమీద ఈసారి దేశ, రాష్ట్ర రాజకీయాలు ఉచిత వాగ్దానాలకు ఎక్కువ, అభివృద్ధి హామీలకు తక్కువ అన్నట్లుగా సాగుతోంది. సగటు ఓటరు నేతల రాజకీయ విన్యాసాలన్నిటినీ గమనిస్తూనే ఉన్నాడు. మరి చివరికి ఏం చేస్తాడో... ఏమో...

వెబ్దునియా పై చదవండి