అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45 గంటల మధ్య 32 సెకెన్ల పాటు భూమిపూజ చేస్తారు. కాశీలోని చేనేత కార్మికుడు బచ్చాలాల్ మౌర్య రూపొందించిన అంగవస్త్రంతో మహాకృతువులో పాల్గొంటారు. భూమిపూజ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పారిజాత మొక్క నాటనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి మందిర్ పేరిట స్టాంపును విడుదల చేస్తారు.
కాగా, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భవ్యమైన రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరుకానున్నారు. కేవలం 175 మందికే శ్రీరామజన్మ భూమి క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపింది. ఇందులో 135 మంది వివిధ క్షేత్రాలకు చెందిన సాధువులు ఉన్నారు. వేర్వేరు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసీనులు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు.