ఆలయాల్లో మోగే గుడిగంటలే మంగళ వాయిద్యాలు : స్వరూపానందేంద్ర స్వామి

మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:20 IST)
కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం బుధవారం సాకారంకానుంది. రామజన్మస్థానంగా భావించే అయోధ్యలో శ్రీరాముడికి గుడి నిర్మించనున్నారు. ఈ రామమందిరానికి బుధవారం భూమిపూజ జరుగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, అయోధ్యకు పూర్వవైభవం తీసుకొచ్చే కృషి అభినందనీయమన్నారు. భారతీయ చరిత్రలో ఆగస్టు 5 ఓ సుదినం అని వ్యాఖ్యానించారు. 
 
రామ మందిరం నిర్మాణాన్ని భారతీయులంతా ఆస్వాదించాలని, అయోధ్యలో భూమి పూజ సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో గంటలు మోగించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ మోగే గుడిగంటలే అయోధ్యలో మంగళవాయిద్యాలు కావాలని స్వరూపానందేంద్ర ఆకాంక్షించారు. 
 
ప్రస్తుతం స్వరూపానందేంద్ర ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్ లో చాతుర్మాస్య దీక్ష ఆచరిస్తున్నారు. రామ మందిరం భూమి పూజకు రావాలంటూ తనకు ఆహ్వానం అందినా, దీక్ష కారణంగా రాలేకపోతున్నానని, తర్వాత మరోసారి అయోధ్య వెళతానని తెలిపారు.
 
5న మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ 
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో ఆలయ నిర్మాణం కోసం బుధవారం శంకుస్థాపన జరుగనుంది. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. దీంతో అయోధ్య నగరమంతా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 
 
మరోవైపు, అయోధ్యలో వివిధ రకాల పూజలు మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఉదయం రామ‌జ‌న్మ‌భూమి ప్రాంతంలో రామార్చ‌న పూజ నిర్వ‌హించారు. భూమిపూజ వేడుక‌కు దేవ‌త‌ల‌ను ఆహ్వానిస్తూ రామార్చ‌న పూజ నిర్వ‌హించారు. 
 
హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద కూడా మంగళవారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో హ‌నుమాన్‌గ‌ర్హి వ‌ద్ద నిషాన్ పూజ చేప‌ట్టారు. హ‌నుమాన్ గ‌ర్హి వ‌ద్ద నిషాన్ పూజ‌ను దాదాపు 1700 ఏళ్ల నుంచి నిర్వ‌హిస్తున్న సంప్ర‌దాయం ఉన్న‌ది. కాగా, రామాల‌య నిర్మాణం సంద‌ర్భంగా అయోధ్య‌లో వ‌రుస‌గా మూడు రోజుల పూజ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇవాళ రెండ‌వ రోజు. 
 
రామ‌జ‌న్మ‌భూమిలో ఇవాళ వైదిక ప‌ద్ధ‌తిలో వాస్తు శాంతి, శిలాసంస్కృతి, న‌వ‌గ్ర‌హ పూజ‌లు కూడా నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు భూమిపూజ ప్రారంభంకానున్న‌ది. ఆ కార్య‌క్ర‌మం దాదాపు 10 నిమిషాలు ఉంటుంద‌ని పూజారులు చెప్పారు. 
 
భూమిపూజ కోసం అయోధ్య వ‌స్తున్న ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఆ న‌గ‌రంలో సుమారు 3 గంట‌లపాటు గ‌డ‌ప‌నున్నారు. ప్ర‌ధాని మోడీ అయోధ్య‌లో పారిజాత మొక్క‌ను నాట‌నున్నారు. 48 హైటెక్ కెమెరాల‌తో భూమిపూజ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేయనున్నారు. ఇందులో డీడీ, ఏఎన్ఐ కెమెరాలు కూడా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు