తిండి తినే పద్ధతుల గురించి ఓ పాత సామెత ఇలా చెబుతుంది. ఉదయం రాజులా తినాలి. మధ్యాహ్నం రాజకుమారుడిలా తినాలి. రాత్రి బికారిలా తినాలి అన్నది ఈ సామెత సారాంశం. అంటే పొద్దుటిపూట ఎక్కువగా తిని, మధ్యాహ్నం కాస్త తిని, రాత్రిపూట తక్కువగా తినాలని దీనర్ధం.
రాజకుమారిలా తింటే మంచిది...
ఎప్పుడు ఏది ఎంత తినాలో, ఏది ఎప్పుడు తినకూడదో తెలియని సంస్కృతి వచ్చేసింది కాబట్టే ప్రపంచం ఊబకాయం మహమ్మారి బారిన పడి విలవిలలాడుతోంది. అందుకే పనిచేసే కాలంలో ఎక్కువగా తిని, విశ్రాంతి తీసుకునే సమయంలో తక్కువగా తింటే ఒంటికి చాలా మంచిదని ఆహార నిపుణుల మాట.
అయితే శరవేగంగా మార్పులు జరుగుతున్న ఆధునిక జీవితపు ఒరవడిలో కొట్టుకుపోతున్న నేటి యువతీ యువకులు సరిగ్గా దీనికి రివర్స్ గేర్‌లో పయనిస్తుండటంతో తమకు తెలియకుండానే, తమకు తాముగా ఊబకాయం బారిన పడుతున్నారు.
ముఖ్యంగా నేటియువతకు ఉపాహారం మానివేయడం దాదాపుగా అలవాటయిపోయింది. దాని పరిణామాలు ఎంత అనర్థ దాయకంగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. 'పొద్దున్నే టిఫిన్ కూడా మానేశాను.... అయినా లావు తగ్గడం లేదు' అనే డైలాగులు మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. అసలు సమస్య ఇక్కడే ఉందని యువత గ్రహించడం మర్చిపోయింది.
కడుపు మాడ్చుకుంటే ఒళ్లు తగ్గుతుందనేది ఆధునిక మూఢనమ్మకంగా మారింది. ఈ ప్రచారాల బారిన పడి టిఫిన్ కూడా తీసుకుండా కడుపును మాడ్చివేస్తే లావు తగ్గడం అటుంచి విపరీతంగా లావెక్కిపోతారని వైద్యులు మరోవైపున మొత్తుకుంటున్నారు.
ఇలా కడుపు మాడ్చుకునే అలవాటు యువకులతో పోలిస్తే యువతులలోనే కాస్త ఎక్కువగా ఉంటోంది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే ఒళ్లు తగ్గుతుందనే భావనలోనూ నిజం లేదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి డైటీషియన్ల అభిప్రాయం మేరకు మనం పూట పూటా పాటించవలసిన ఆహార సూచనలను తెలుసుకుందామా...
కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలనేది ప్రస్తుతం మంత్రజపమై కూర్చుంది. అయితే ఉదయం పూట తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేలా కనీసం 610 కాలరీల ఆహారం తీసుకోవాలి. నేటి యువతీ యువకుల్లో ఎక్కువమంది 290 కాలరీలకంటే తక్కువ ఆహారం మాత్రమే తీసుకుంటూండటంతో మధ్యాహ్నమయ్యేసరికి ఆకలేసి మరీ ఎక్కువగా తినేస్తున్నారు.
ఒకవేళ మధ్యాహ్నం సరిగ్గా తినకపోతే ఆ వెలితిని శుభ్రంగా రాత్రిపూట నింపేస్తున్నారు. ఇలా రాత్రిపూట కడుపునిండా భోజనం చేసి అలా పడుకున్నారంటే తిన్న ఆహారం అరిగే దారి లేదు కాబట్టి ఒంట్లో కొవ్వు అమాంతంగా పెరిగిపోతుంది.
పోతే... మధ్యాహ్నం 395 కాలరీల ఆహారం, రాత్రిపూట 235 కాలరీల ఆహారం తీసుకుంటే సరిపోతుందని డైటీషియన్లు సెలవిస్తున్నారు. పొద్దుటినుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటారు కాబట్టి మధ్యాహ్న భోజనం మాత్రం కాసింత ఎక్కువ మోతాదులోనే ఉండాలని వీరి సూచన. అదే రాత్రి పూట వీలైనంత తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకుని పడుకుంటే పొద్దున లేవగానే ఆకలి కూడా బాగా వేస్తుందని వీరంటున్నారు.
మరి కొందరు ఒళ్లు తగ్గించుకోవాలని ఒంటి పూట భోజనం మాత్రమే చేస్తుండటం కద్దు. అది కూడా మధ్యాహ్నం మానేసి, రాత్రి తిని పడుకుంటుంటారు. దీంతో వారికి తెలియకుండానే ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. ఫలితం మళ్లీ కొవ్వు పేరుకుపోతుంది.
అందుకని మొదట్లో చెప్పిన సామెతను కాస్త మార్చి చెప్పుకుందామా... ఉదయం పూట రాణీలా భోంచేయండి. మధ్యాహ్నం రాజకుమార్తెలా భోంచేయండి. రాత్రి యాచకురాలిలా తినండి. ఇదే మన దేహారోగ్యానికి కనీస ప్రాధమిక సూత్రం మరి.. పాటిస్తారు కదూ....