1959లో నెహ్రూను ఎదిరించిన దక్షిణాది నేతల నుంచి ఇప్పుడు మోదీని ఢీకొడతానంటున్న కేసీఆర్ ఏం నేర్చుకోవాలి?

శుక్రవారం, 17 జూన్ 2022 (15:53 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అత్యంత శక్తిమంతుడైన ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించాలనుకుంటున్నారు. దక్షిణాదికి చెందిన నేత ఒకరు దిల్లీని ఎదిరించాలనుకోవడం చాలా సాహసోపేత నిర్ణయం. కేసీఆర్ ప్రయత్నం ఎంతవరకు వెళ్తుందో తెలియదు గానీ ప్రధాని మీద దక్షిణాది నేత ఒకరు తిరుగుబాటు జెండా ఎగరేయడమనే విషయానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అయితే, ఇలా దిల్లీ కోట మీద దక్షిణాది నేత తిరుగుబాటు చేయడం ఇది రెండోసారి. మొదటి ప్రయత్నం 1959లో జరిగింది. అప్పటి తిరుగుబాటుకు బీజం మద్రాసు(ఇపుడు చెన్నై)లో పడింది.

 
అప్పటి ప్రధాని ఎవరో కాదు... పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. తిరుగుబాటుకు పిలుపు ఇచ్చింది రాజాజీగా పేరుపొందిన చక్రవర్తి రాజగోపాలాచారి. ఈ తిరుగుబాటు కోసం ఆయన ఏర్పాటు చేసిన పార్టీ పేరు 'స్వతంత్ర పార్టీ'. నెహ్రూ సోషలిజాన్ని, పెత్తందారీ విధానాలను, కాంగ్రెస్ రాజకీయాలను, వేళ్లూనుతున్న అవినీతిని నిర్మూలించేందుకు ఒక పార్టీ అవసరమని రాజాజీ భావించారు. నెహ్రూ పాలనకు 'పర్మిట్-లైసెన్స్-కోటా రాజ్' అని పేరు పెట్టారు. దీనికి వ్యతిరేకంగా ఆయన కొత్త పార్టీ ప్రతిపాదన చేయగానే న్యాయవాదులు, ఆర్థిక వేత్తలు, రైతునాయకులు, జర్నలిస్టులు, జమిందారులు, మాజీ రాజాలు అంతా రాజాజీ చుట్టూ చేరారు.

 
కొన్ని ప్రాంతీయ పార్టీలు కొత్త పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చాయి. జాతీయోద్యమ ప్రభావం, నెహ్రూ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పెత్తనం సాగుతున్న రోజుల్లో ఒక జాతీయపార్టీగా 'స్వతంత్ర పార్టీ' పుట్టుక ఒక సంచలనం. 81 సంవత్సరాల వయసులో సుడిగాలిలా దూసుకువచ్చిన రాజాజీ పిలుపునకు స్పందించని రాష్ట్రం లేదు. ప్రాంతం లేదు. సామాజిక వర్గం లేదు. అయితే, ఏడుగురు ప్రముఖలు ఈ తిరుగుబాటుకు రూపకల్పన చేశారు. వారు రాజాజీ, ఫ్రొఫెసర్ ఎన్.జి రంగా, ఖాసా సుబ్బారావు, మినూ మసాని, బీఆర్ షెనాయ్, పిలూ మోదీ, ఏడీ ష్రాఫ్. ఇందులో ఎన్‌జీ రంగా, ఖాసా సుబ్బారావు తెలుగువారు.

 
'అధికారం కోసం మనం అర్రులు చాచరాదు. అధికారమే మన వెంటపడాలి' అనే నైతిక సూత్రంతో మొదలైన పార్టీ అది. అందుకే పార్టీ నిర్మాత రాజాజీ ఏ పదవీ తీసుకోలేదు. కేవలం కౌన్సిల్ సభ్యుడిగా ఉంటూ వచ్చారు. తెలుగు వ్యక్తి, జమిందారీ వ్యతిరేక రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఫ్రొఫెసర్ రంగాని పార్టీ అధ్యకుడిగా ఎన్నుకున్నారు. ఆయనే పదేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా ఒక రాజకీయ బలాఢ్యుడైన ప్రధాన మంత్రిని గద్దె దించేందుకు జరిగిన తొలి తిరుగుబాటు దక్షిణ భారతదేశం నుంచే మొదలవడమే కాదు... తిరుగుబాటు చేసిన స్వతంత్ర పార్టీకి నాయకత్వం వహించింది తెలుగువాడు కావడం గమనించాల్సిన అంశం.

 
నాటి స్వతంత్ర పార్టీ అన్ని రంగాల ప్రముఖులను ఆకట్టుకుంది. రాజా గోపాలాచారి విషయానికి వస్తే రెండు సార్లు మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఆయన భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్‌గా ఉన్నారు. ఇంకా ముందుకెళితే స్వాతంత్య్ర సమరంలో కూడా పాల్గొన్నారు. ఫ్రొఫెసర్ రంగా రైతు నాయకుడే కాదు ఆక్స్‌ఫర్డ్‌లో ఆర్థిక శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. ఇక ఖాసా సుబ్బారావు... స్వతంత్ర, స్వరాజ్య అనే రెండు పత్రిలకను నడుపుతూ భారతీయ జర్నలిజానికి బాటవేసిన మేధావి. మేధావులనే కాదు, కార్మికనేతలను, మాజీ రాజాలను, రైతు నేతలను ఆకట్టుకుంది. 'అదొక భూస్వాముల పార్టీ' అని ప్రధాని నెహ్రూ పిలిచారు.

 
అప్పటిలాగే ఇప్పుడు మరొక రాజకీయ బలాఢ్యుడైన ప్రధాని నరేంద్ర మోదీ మీద తిరుగుబాటు చేసేందుకు జాతీయ పార్టీని స్థాపించాలని మరొక తెలుగు నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయంగా మోదీ ప్రతిష్ట ఇపుడు పతాక స్థాయిలో ఉంది. ఇలాంటి ప్రధానిని ఎదిరించాలనుకోవడం సాహసోపేత నిర్ణయమే. గత కొన్ని నెలలుగా ప్రధాని మోదీ విధానాలను కేసీఆర్ వ్యతిరేకిస్తున్న తీరు చూస్తే, ఆయనేదో పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అర్థమవుతుంది. మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ అనుకున్నారు. తీరాచూస్తే ఆయన ఏకంగా జాతీయపార్టీ ప్రారంభించాలని ..అది కూడా జూన్‌లోనే జరుగుతుందని చెబుతున్నారు.

 
స్వతంత్ర పార్టీ ఏం సాధించింది?
పెట్టుబడిదారీ విధానాలను సమర్థిస్తూ కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక భావజాలంతో వ్యక్తి స్వేచ్ఛ, హిందూమత విలువలతో ఉదారవాద తాత్విక పునాది మీద వచ్చిన స్వతంత్ర పార్టీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించి దేశంలో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. 1962 లోక్‌సభ ఎన్నికల్లో 192 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి 22 మందిని గెలిపించుకుంది. పార్టీకి 8.5 శాతం ఓట్లు పోలయ్యాయి. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో 207 మంది శాసన సభ్యులు గెలిచారు. నాటికే వేళ్లూని ఉన్న సీపీఐ (153), జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీ (149), జనసంఘ్ (115) కంటే ఇది చాలా పెద్ద బలగం.

 
1967 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ బలగం ఇంకా పెరిగింది. లోక్ సభలో పార్టీ బలగం 44కి పెరిగింది. ఓట్ల శాతం 9.6 శాతానికి చేరింది. ప్రతిపక్ష పార్టీ హోదాకు కేవలం 7 సీట్లే తక్కువ. అయితే, నాటి ప్రభుత్వం హోదా ఇవ్వలేదు. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేల సంఖ్య 256కు పెరిగింది. నెహ్రూను సవాల్ చేసి ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలను, ఎమ్మెల్యేలను గెల్చుకోవడానికి కారణం... స్వతంత్ర పార్టీ స్థాపించిన వాళ్లంతా గాంధేయ విలువలకోసం కట్టుబడిన వాళ్లు. పదవుల మీద ఆశలేని వాళ్లు.

 
సోషలిజం, కమ్యూనిజాలను ద్వేషించినా దారిద్ర్య నిర్మూలనకు కట్టుబడినట్లు వాళ్ల స్టేచర్‌ను బట్టి ప్రజలు విశ్వసించారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్ధిల్లుతున్న రాజకీయనేతలు-అధికారులు-వ్యాపార వేత్తల అవినీతి త్రికోణ బంధం గురించి ఈ నేతలు బాగా ప్రచారం చేశారు. ప్రజలు క్రమంగా నమ్మడం మొదలుపెట్టారు. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ (ఒ)నేత కామరాజ్ నాడార్ ' గ్రాండ్ అలయెన్స్' లో చేరారు. ఇందిరాగాంధీని ఓడించేందుకు ఏర్పాటైన గ్రాండ్ అలయెన్స్‌లో చేరడం మీద పార్టీలో విబేధాలొచ్చాయి. ఎన్నికల్లో ఇందిరాగాంధీ విజయం సాధించారు. గ్రాండ్ అలయెన్స్ ఓడిపోయింది. స్వతంత్ర పార్టీ బలగం 8 సీట్లకు (3 శాతం ఓట్లు) పడిపోయింది. ఇది పార్టీ పతనానికి దారి తీసింది. 1972 డిసెంబర్‌లో రాజాజీ చనిపోయారు. పార్టీ బలహీనపడింది. 1974లో పార్టీని రద్దు చేసి భారతీయ లోక్ దళ్‌లో విలీనం చేశారు.

 
అయితే, నెహ్రూను ఎదిరించి నిలిచిన పార్టీగా తాము చెప్పుకొన్న విలువలకోసం నిలబడిన పార్టీగా స్వతంత్ర పార్టీ చరిత్రలో నిలిచిపోయింది. సభల్లో వాకౌట్‌లకు ఈ పార్టీ వ్యతిరేకం. అందుకే 15 ఏళ్ల కాలంలో లోక్‌సభ నుంచి ఒకసారే వాకౌట్ చేసింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సభ్యులు వాకౌట్ చేస్తే నాయకత్వం వారిని తీవ్రంగా మందలించింది. ఇటీవల, ప్రముఖ రైతు నాయకుడు, షేట్కారి సంఘటన్ నేత శరద్ జోషి స్వతంత్ర పార్టీని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. అయితే, అది కార్యరూపం దాల్చేలోగానే 2018‌లో ఆయన చనిపోయారు.

 
కేసీఆర్ జాతీయ పార్టీ ముందున్న సవాళ్లు
ప్రధాని మోదీ విధానాలకు, బీజేపీ హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కేసీఆర్... జాతీయ పార్టీ పెడుతున్నారనే వార్త రాగానే టీఆర్‌ఎస్, కేసీఆర్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. అప్పుడే ఆయన్ని ప్రధానిగా చూస్తున్నారు. దేశాన్ని నడిపించే సత్తా ఉన్నవాడని ప్రశంసించారు. 'దేశ్ కి నేత కేసీఆర్' అని నినాదాలు చేశారు. కేసీఆర్ తప్ప దేశానికి మరొక దిక్కు లేదని మంత్రులు అన్నారు. అంతేకాదు తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు వంటి పథకాలను దేశమంతా అమలు చేయాలని కోరారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించాలని, దేశాన్ని తెలంగాణాలాగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నారు. ఆస్ట్రేలియా-అమెరికా, సౌతాఫ్రికా-జర్మనీ వరకు ఉన్న కేసీఆర్ అభిమాన ఎన్నారైలు ఆయనకు మద్దతు ప్రకటించారు.

 
ఈ హంగామా అభిమానుల్లో ఉంది తప్ప బయట విస్తరించలేదు. ఈ సంబరాలలో కేసీఆర్‌ను ప్రధానిని చేసే అజెండా ఉంది తప్పా నలుగురిని కలుపుకొని పోదామన్న సందేశం లేదు. స్వతంత్ర పార్టీ ఏర్పాటుకి, ఇప్పుడు కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచనకు మధ్య ఉన్న తేడా ఇదే. స్వత్రంత్ర పార్టీ పుట్టుకే సమష్టి నాయకత్వంతో మొదలైంది. సంస్థాపకుడు రాజాజీ కొత్త పార్టీలో హోదా తీసుకోలేదు. కేసీఆర్, జూన్ నెలలోనే కొత్త పార్టీ ప్రకటిస్తారని తెలుగు మీడియా చెబుతోంది. ఎందుకంటే, జూన్ ఏడాదిలో ఆరో నెల. కేసీఆర్‌కు 6 అనేది లక్కీ నంబర్. అన్నట్లు స్వతంత్ర పార్టీ తొలి ప్రకటన కూడా 1959 జూన్ 19న వెలువడింది.

 
టీఆర్‌ఎస్ బయట నిశ్శబ్ధం
బీజేపీ మత రాజకీయాలను, మోదీ ఆర్థిక విధానాలను వ్యతిరేకించే మహత్తర లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కొత్త జాతీయ పార్టీ పెడుతున్నారన్న వార్తతో దేశంలో ఒక సుడిగాలి వ్యాపించి ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడున్న రాజకీయాలను ద్వేషిస్తూ ఎందరో మేధావులు, రచయితలు, కవులు, మాజీ సివిల్ సర్వెంట్లు, మాజీ న్యాయమూర్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట అనేక మంది మాజీ న్యాయమూర్తులు ఉత్తర ప్రదేశ్‌లో అమలవుతున్న 'బుల్డోజర్ అణిచి వేత' మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిరసన లేఖ రాశారు.

 
విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మాజీ బ్యురోక్రాట్స్, ప్రధానికి ఎన్నోసార్లు లేఖలు రాశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫెడరల్ ఫ్రంటు ఏర్పడాలని వారం రోజుల కిందట మాజీ ఐఎఎస్ ఆఫీసర్ డా. ఈఏఎస్ శర్మ... కేసీఆర్‌తో పాటు అనేక ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆమధ్య కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రైతులు ఏడాది పాటు వీరోచితంగా పోరాడి తన డిమాండ్ నెరవేర్చుకున్నారు. ఒక దేశవ్యాప్త ఉద్యమం లాగా ఉవ్వెత్తున ఎగరకపోయినప్పటికీ... ప్రధాని మోదీ, బీజేపీ రాజకీయాలకు వ్యతిరేక నిరసన సర్వత్రా కనిపిస్తుంది.

 
ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్, జాతీయ పార్టీ వార్త మీద ఈ వర్గాల నుంచి మంచి స్పందన వచ్చి ఉండాల్సింది. కానీ, ఎవరి నుంచీ స్పందన కనిపించలేదు. చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్టు సంధ్యా రవిశంకర్, బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయ వర్గాల్లో కేసీఆర్ కొత్త పార్టీ చర్చనీయాంశమే కాలేదని అన్నారు. ఇదే విధంగా రాజ్యసభ టీవీ మాజీ ఎడిటర్, ఉత్తర రాజకీయ విశ్లేషకుడు ఊర్మిలేశ్ కూడా ఉత్తర భారత రాజకీయవర్గాల్లో కేసీఆర్ ప్రతిపాదన ఎలాంటి కదలిక తీసుకురాలేదని అన్నారు.

 
ప్రాంతీయ పార్టీల యుగంలో మరో జాతీయ పార్టీ సాధ్యమా?
కేసీఆర్ జాతీయపార్టీ ప్రతిపాదన మీద రాజనీతి వేత్తలు, రాజకీయ వ్యాఖ్యాతలు, రాజకీయ పార్టీల వ్యాఖ్యలు వివిధ రకాలుగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు, బలమైన జాతీయ పార్టీ అనే వాదాల మధ్య పొత్తు కుదరడం ఎలా సాధ్యమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఫ్రొపెసర్ కె. శ్రీనివాసులు అన్నారు. ''దేశంలో కొత్త రాజకీయ దశ నడుస్తోంది. ఇది 1990 దశకంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మొదలైంది. అదే సమయంలో రకరకాల గుర్తింపుతో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. బలపడ్దాయి.

 
అంతేకాదు, ఈ పార్టీలు జాతీయ స్థాయిలో కీలక పాత్ర కావాలంటున్నాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్‌లు ఏంటి? చివరకు ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం గుర్తించే జాతీయ పార్టీలు కూడా యూపీఏ, ఎన్డీఏ అంటూ ఫ్రంటు కడుతున్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో ఏర్పడిన ఖాళీని బీజేపీ ఆక్రమిస్తోంది. బీజేపీ ఒకే దేశం-ఒకే భాష, ఒకే మతం, వంటి వాదాలతో అలజడి సృష్టిస్తోంది. ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటప్పుడు ప్రాంతీయ పార్టీల గుర్తింపును కాపాడుకుంటూ బలమైన రాష్ట్రాల కోసం కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించే ఫ్రంటు అవసరం చాలా ఉంది. జాతీయ పార్టీకంటే ఇపుడు ఫెడరల్ ఫ్రంటు మంచి ఫలితాలు ఇస్తుంది'' అని ఫ్రొఫెసర్ శ్రీనివాసులు అన్నారు.

 
అయితే, కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదన సీరియస్ వ్యవహారం కాదని కేవలం ప్రచారం కోసమే అని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత తెలకపల్లి రవి అన్నారు. ''కేసీఆర్ ఎప్పుడూ ప్రచార కేంద్రంగా మారాలనుకుంటారు. గత ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్, కేసీఆర్ పీఎం అనే నినాదాన్ని వాడుకున్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ ఆమాటే లేదు. ఇప్పుడు కొత్త జాతీయ పార్టీ అని లీకులిస్తున్నారు. ఇందులో మన తెలంగాణ నేత ప్రధాని అవుతారనే సెంటిమెంట్ తీసుకువచ్చి లబ్ది పొందాలనే దురాశే తప్పా గొప్ప ఆశయం కనిపించదు'' అని రవి వ్యాఖ్యానించారు.

 
కేసీఆర్ ఇమేజ్‌ని ఎదురించి దుబ్బాక నియోజకర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఇందులో రెండు కోణాలు చూస్తున్నారు. "జూన్‌లోనే కొత్త పార్టీ అనడం వెనక రెండు లక్ష్యాలున్నాయి. 1. జూలై 2, 3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గం హైదరాబాద్‌లో సమావేశం అవుతుంది. దీనికి ప్రధాని మోదీ వస్తున్నారు. అక్కడ తెలంగాణ మీద కీలక చర్చ జరుగుతుంది. దీన్నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ అనే ప్రచారం లేవనెత్తారు. 2. ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు ఎవరూ స్పందించడం లేదు. ఈ ఎదురుదెబ్బ కప్పిపుచ్చుకునేందుకు ఆయన జాతీయ పార్టీ అని ప్రచారం మొదలుపెట్టారు" అని రఘునందన్ రావు అన్నారు.

 
అయితే, కేసీఆర్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ఆయనతో సమావేశమై రాజకీయాలు చర్చించి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన తెచ్చే రాజకీయాలు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అందువల్ల కేసీఆర్‌తో ఆయన సమావేశం బాగా చర్చనీయాంశమైంది. ''సీఎం కేసీఆర్ సరైన పంథాలోనే ముందుకు పోతున్నారు. సమగ్రమైన అధ్యయనం తర్వాతే ఆయన బీజేపీ, మోదీ విధానాలను ఎదిరించాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని ఎదురించగల సత్తా నేత ఆయన'' అని ఉండవల్లి ప్రశంసించారు.

 
ఏ పేరుతో జాతీయ పార్టీ పెట్టినా దాన్ని నడిపించగల వనరులన్నీ ఉన్న నాయకుడు కేసీఆర్. ఆయన నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీకి నిధుల కొరత ఉండదు. టీఆర్‌ఎస్ వేయి కోట్ల పార్టీ అని ఆయన ఆ మధ్య స్వయంగా ప్రకటించారు. ఆయన ఇంగ్లిష్, ఉర్దూలో ధారాళంగా మాట్లాడగలరు. తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న నాయకుడు. వీటికి తోడు ఏ జాతీయ నేతకు తీసిపోని పేరు ప్రతిష్ట ఉన్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిశోర్ ఆయన సలహాదారు అని చెబుతున్నారు. ఇద్దరూ స్వతహాగా ప్రజల నాడి తెలుసుకుని వ్యూహరచన చేయగల నేర్పరులు అనేది టీఆర్‌ఎస్ నేతల ధీమా. పార్టీ ప్రకటన అధికారికంగా వెలువడిన తర్వాత సంచలనం మొదలవుతుందని చాలామంది టీఆర్‌ఎస్ అభిమానులు నమ్ముతున్నారు. అయితే జాతీయ స్థాయిలో తనకున్న వనరులు వినియోగించుకొని గత 'స్వతంత్ర పార్టీ' కంటే గొప్ప సంచలనం కేసీఆర్ సృష్టిస్తారేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు