ఆంధ్రప్రదేశ్: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా, కరెంటు కోతలు ఇంకా పెరుగుతాయా?

మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:07 IST)
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీలు వాడొద్దని ఏపీ ప్రభుత్వ ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఇటీవల సూచించారు. విద్యుత్ సరఫరాకి, డిమాండ్‌కి వైరుధ్యం ఉందని ఆయన తెలిపారు. పీక్ లోడింగ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని, కాబట్టి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారం తప్పదని కూడా శ్రీకాంత్ హెచ్చరించారు.
 
అయితే ఏసీలు ఆపినంత మాత్రాన విద్యుత్ సరఫరాలో సమస్యలు తగ్గిపోతాయా? అసలు సమస్య ఏంటి? ప్రభుత్వం ఎందుకిలా చెబుతోందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే సీఎం జగన్ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మాత్రం బొగ్గు కొరత తీర్చే ప్రయత్నంలో ఉన్నామని, ఆందోళన అవసరం లేదని చెబుతోంది. ఏపీ సీఎం లేఖలో చేసిన వినతులకు మాత్రం కేంద్రం నుంచి స్పందన రాలేదు.
 
ఈలోగా రాష్ట్రంలో డిమాండ్ పెరగడంతో కరెంటు కోతలు మొదలయ్యాయి. ఇవి మరింత విస్తృతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్టు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, ఇది కోవిడ్ సమయంలో ఆక్సీజన్ కొరతలాంటిదని, త్వరలోనే సర్ధుకుంటుందని ప్రభుత్వం అంటోంది. శీతాకాలం ముంగిట విద్యుత్ కోతలు పల్లెవాసులతో పాటు కొన్నిచోట్ల పట్టణ ప్రజలను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇవి మరింత పెరిగితే పరిస్థితి ఏమిటోననే ఆందోళన కనిపిస్తోంది. అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది?
 
బొగ్గు నిల్వలు నిండుకున్నాయి
ప్రపంచ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ ఉత్పాదనకు ప్రాధాన్యత తగ్గుతోంది. కానీ భారత్‌లో మాత్రం థర్మల్ పవర్‌దే పెద్దవాటా. ఏపీలో కూడా థర్మల్ పవర్ వాటా 45 శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు నిల్వల సమస్య ఏర్పడుతోంది. సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో 12 రోజుల ఉత్పత్తికి సరపడా బొగ్గు నిల్వలుంటే సేఫ్ అని భావిస్తారు. కానీ ప్రస్తుతం ఏపీలో అది రెండు మూడు రోజులు కూడా లేదు.
 
ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో రెండు థర్మల్ పపర్ స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒకటి విజయవాడలో నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కాగా, రెండోది కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. కృష్ణపట్నం వద్ద దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్‌ను ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ నడుపుతోంది. విశాఖ పరవాడలో సింహాద్రి పవర్ ప్లాంట్‌‌ను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నడుపుతున్నారు.
 
ప్రస్తుతం కేవలం 2 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉండడంతో తగిన మోతాదులో సరఫరా లేకపోతే విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంటులో 2 యూనిట్లు, రాయలసీమ పవర్ ప్లాంటులోని 3 యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. దానికి వివిధ కారణాలున్నట్టు ఏపీ జెన్‌కో వెల్లడించింది. వీటీపీఎస్‌లో కూడా బొగ్గు నిల్వలు కేవలం ఒక్క రోజుకి సరిపడా మాత్రమే ఉన్నాయి. ఆర్టీపీఎస్‌లో నిల్వలు 3 రోజులకు, కృష్ణపట్నం ప్లాంట్‌లో నిల్వలు 5 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు.
 
విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 185 మిలియన్‌ యూనిట్ల నుంచి 190 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటోంది. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో కేవలం 45 శాతం విద్యుత్‌ను మాత్రమే ఏపీ జెన్‌కో ద్వారా సమకూర్చగలుగుతున్నారు. అక్టోబర్ 10న ఆదివారం నాడు ఏపీ జెన్‌కో ద్వారా 75.2 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. అందులో థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి 38 మిలియన్ యూనిట్లు, ఏపీపీడీసీఎల్ ద్వారా 12.25 మిలియన్ యూనిట్లు, 1.865 మిలియన్ యూనిట్లు సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా వచ్చింది.
 
మరో 23.076 మిలియన్ యూనిట్లు హైడల్ పవర్ వచ్చింది. ఇక కేంద్రం వాటాగా వచ్చే విద్యుత్‌తో పాటు బహిరంగ మార్కెట్లో కూడా అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. కోవిడ్‌ తర్వాత గత ఆరు నెలల్లోనే విద్యుత్‌ డిమాండ్‌ 15శాతం పెరిగింది. ముఖ్యంగా రెండో వేవ్ నుంచి కోలుకుని వ్యాపార, వాణిజ్య సంస్థలు తిరిగి సాధారణ స్థితిలో నడుస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెరుగుతోంది. గడిచిన ఒక్క నెలలోనే 20 శాతానికి పైగా అదనపు విద్యుత్ అవసరం అవుతోందని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.
 
ప్రధానంగా థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఏపీ జెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 90 మిలియన్‌ యూనిట్లు. ప్రస్తుతం అందులో 50 శాతం కూడా ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఓవైపు డిమాండ్ పెరుగుతుండగా, రెండోవైపు ఉత్పత్తి తగ్గడం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.
 
పెరిగిన విద్యుత్ కోతలు
డిమాండ్ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో పాటుగా బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ అవసరమైన స్థాయిలో లభించడం లేదు. 15 రూపాయలకు ఒక్క యూనిట్ కొనుగోలు చేద్దామన్నా కూడా విద్యుత్ అందుబాటులో లేదంటే డిమాండ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా గ్రామాల్లో 3 గంటల పాటు విద్యుత్ కోత అమలవుతోంది. గ్రిడ్ ట్రిప్ కాకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అనేక చోట్ల పట్టణ ప్రాంతాల్లోనూ స్వల్పంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
 
ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీతో పాటుగా దేశంలోని అనేక చోట్ల ఈ విద్యుత్ కోతలు అమలవుతుండగా అందులో భాగంగానే ఏపీలోనూ సమస్య వస్తోందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌కు ముడి స‌రుకు సరిపడా స్థాయిలో అందుబాటులో లేదని, వ‌ర్షాల కార‌ణంగా బొగ్గు త‌వ్వ‌కం తగ్గిపోయిందని మంత్రి అన్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లోనూ బొగ్గు ధ‌ర‌లు పెరిగాయని, వీటితోపాటే వినియోగం కూడా పెరిగిందని ఆయన వెల్లడించారు. మ‌హారాష్ట్ర‌, పంజాబ్‌, దిల్లీ, కేర‌ళ రాష్ట్రాల్లో క‌రెంట్ కోత‌లున్నాయని, చైనా లాంటి దేశాలు కూడా విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయని మంత్రి వివరించారు.
 
''ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్రం సహాయం కోరాం. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్‌ను కేటాయించాలని బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలకు సూచించాలని కోరాం. రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లు ప్రస్తుతం పని చేయడం లేదు. వాటికి ఓఎన్జీసీ, రిలయన్స్‌ వద్ద అందుబాటులో ఉన్న గ్యాస్‌ను సరఫరా చేసి, పని చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్రం స్పందిస్తే సమస్య పరిష్కారమవుతుంది'' అని మంత్రి బాలినేని అన్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు విషయంలో సెప్టెంబర్‌ 15 వరకు సగటున యూనిట్‌ రూ.4.6 ఉండేదని, అక్టోబర్‌ 8 నాటికి అది రూ.15 దాటిందని, అత్యవసరాల్లో రూ.20 కూడా వెచ్చించాల్సి వస్తోందని జెన్‌కో అధికారి ఒకరు బీబీసీతో అన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరగకపోతే కొనుగోళ్లు పెద్ద భారంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
విభజన నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఉన్న ఏపీలో పరిస్థితి ఎందుకిలా మారింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభజన నాటికి ఏపీలో 16,817 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. అందులో 11,771 మెగావాట్లు థర్మల్ విద్యుత్ కాగా 3,737 హైడల్ పవర్ ఉత్పత్తి జరిగేది. 1,036 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి జరిగేది. ఏపీలో ప్రస్తుతం సుమారుగా 6వేల మెగావాట్ల విద్యుత్‌‌ను ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్నారు. అనంతపురంలోని సోలార్ ప్లాంట్ ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే వాటాతో కలుపుకుంటే ఏపీకి విద్యుత్ కొనుగోలు అవసరం తెలంగాణాతో పోలిస్తే కొంచెం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.
 
విభజన తర్వాత థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పాటుగా హైడల్ పవర్ ప్లాంట్లలో కూడా ఏపీకి ప్రధాన వాటా లభించింది. కేంద్రం నుంచి లభించే విద్యుత్ వాటాతో కలుపుకుంటే విద్యుత్ వాటా 18,930 మెగావాట్లు. దాంతో ఏపీ మిగులు రాష్ట్రంగా ఉండేది. కానీ, ప్రస్తుతం కేవలం కేంద్రం ప్రభుత్వ సంస్థలకు చెందిన థర్మల్ విద్యుత్ యూనిట్లు కొన్ని నిలిచిపోవడంతో ఏపీకి 500 మెగావాట్ల కొరత ఏర్పడింది. ఆయా యూనిట్లు వెంటనే పునరుద్దరించకపోతే ఈ కొరత మరింత పెరుగుతుందని జెన్‌కో అధికారులు అంటున్నారు.
 
''విద్యుత్ విషయంలో ఏపీకి కొరత లేదు. కానీ పీక్ సమయంలో ఉత్పత్తి నిలిచి పోయినప్పుడు సరఫరాకి సరిపడా ఉండడం లేదు. బొగ్గు కొరత మూలంగా థర్మల్ పవర్ ప్లాంట్‌లు నిలిచిపోతే సమస్య వస్తుంది. కేంద్రం నుంచి వచ్చే వాటా కూడా తగ్గిపోతే డిమాండ్‌ని చేరుకోవడం సమస్య అవుతుంది'' అని విద్యుత్ రంగ నిపుణుడు టీఎల్‌ఎన్ రావు అన్నారు. గడిచిన కొన్నేళ్లలో ఏపీలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఎక్కువైందని, సరఫరా సమయం పెరగడంతో రాష్ట్రంలో 17లక్షల పైబడిన పంపు సెట్లకు కేటాయింపు పెరిగిందని ఆయన వివరించారు.''గ్యాస్ ఆధారిత ప్లాంట్లు నిలిచిపోయాయి. సోలార్, విండ్ పవర్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. అందుకే సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి'' అని టీఎల్‌ఎన్ రావు అభిప్రాయపడ్డారు.
 
'ఛార్జీలు పెంచి, కోతలా'
ఏపీలో విద్యుత్ వినియోగదారులపై ఇటీవల ట్రూఅప్ ఛార్జీల భారం పడింది. సుమారు రూ. 3600 కోట్లు అదనంగా వసూలు జరుగుతోంది. 2014-19 కాలంలో వినియోగించిన విద్యుత్‌కి ఆయా పంపిణీ సంస్థలు నష్టాలను పూడ్చుకునే పేరుతో ప్రస్తుత బిల్లుల్లో వసూలు చేస్తున్నారు. ‘ఇది ప్రభుత్వ చేతగానితనం’ అని మాజీ మంత్రి, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంక్షోభానికి టీడీపీ, వైసీపీ రెండూ కారణమేనని ఆయన అన్నారు.
 
''విద్యుత్ కొనుగోళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. తెలుగుదేశంలో పాలనలో విద్యుత్ రంగంలో అప్పులు రెట్టింపు అయ్యాయి. ప్రైవేటు సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లను అవసరానికి మించి ప్రోత్సహించారు. ఇవన్నీ ప్రజలకు భారమయ్యాయి. కరెంటు కోతల కారణంగా సామాన్యులు సతమతమయ్యే పరిస్థితి వస్తోంది'' అన్నారాయన. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయకపోతే విపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఆందోళన చేపడుతుందని శైలజానాథ్ బీబీసీతో అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో 1.85 కోట్ల విద్యుత్ కనెక్షన్లున్నాయి. అందులో 1.48 లక్షలు గృహ విద్యుత్ కనెక్షన్లు కాగా, 14.65 లక్షల కమర్షియల్, 1.63లక్షల ఇండస్ట్రియల్, 17.37 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు వంటివి పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఏపీ జెన్‌కో అంచనా వేస్తోంది. కానీ, పోలవరం పవర్ ప్లాంట్ అంత త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
 
'ప్రభుత్వ ప్రకటనలు హాస్యాస్పదం'
సమస్యను వదిలేసి 'ఏసీలు ఆపండి, ఫ్యాన్లు వేసుకోకండి' అంటూ ప్రజలకు సూచనలు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు బీబీసీతో అన్నారు. జగన్ ప్రభుత్వం తన చేతకానితనంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆయన విమర్శించారు. ''మరో నెల ఆగితే వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది, రోజుకు ఒకపూటే భోజనం చేయండని అంటారేమో. ముందుకు కరెంటు ఉత్పత్తి పెంచండి. దానికి ఏం చేయాలో ఆలోచించండి. ఉచిత సలహాలు మాని పరిష్కారం చూడండి'' అని కళా వెంకట్రావు అన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో ఏపీని కరెంటు కోతలు లేని రాష్ట్రంగా చేశామని, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అన్నారు.
 
'కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత లాంటిదే..'
ప్రస్తుతం విద్యుత్ సంక్షోభంలో కేంద్రమే చొరవ తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతలానే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సమస్య వచ్చిందని తెలిపారు. 'బొగ్గు లభ్యత లేని రాష్ట్రాలకు వేగంగా సరఫరా జరగడం లేదు. విద్యుత్ సమస్య అంతటా ఉంది కాబట్టి కేంద్రమే బాధ్యత తీసుకోవాలి. పరిస్థితి చేయి దాటితే వేసవిలో ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని కొంతవరకు తగ్గించుకోవాలంటే గృహ వినియోగంలో జాగ్రత్తలు తప్పవు. ప్రజల్లో అవగాహన పెరగాలి'' అని సజ్జల అన్నారు.
 
విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే కేంద్రం నుంచి బొగ్గు కేటాయింపుల కోసం ప్రయత్నిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం 8 రైల్వే ర్యాక్‌ల ద్వారా రాష్ట్రానికి బొగ్గు సరఫరా జరుగుతోంది. దానిని 20 ర్యాక్‌‌లకు పెంచితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సమస్యలు తీరతాయని భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు