ఔరంగాబాద్: ఈ నగరం పేరుమార్చడంపై వివాదం ఎందుకు? హైదరాబాద్‌‌తో సంబంధమేమిటి?

శుక్రవారం, 8 జనవరి 2021 (18:52 IST)
"ఈ నేల చాలా వినాశనాన్ని చూసింది. లెక్కలేనన్ని గాయాలను భరించింది. కానీ, హైదరాబాద్ నగరానికి ఏదీ సాటి రాదు". -రాఘవేంద్ర ఆలంపురి హిందీలో రాసిన వాక్యం ఇది. ఇందులో హైదరాబాద్‌ స్థానంలో ఔరంగాబాద్‌ను కూడా పెట్టొచ్చు. ఈ రెండు నగరాలకు చాలా సారూప్యతలు ఉన్నాయి. రెండూ విభిన్న సాంస్కృతిక నేపథ్యాలకు నెలవుగా ఉన్నాయి.

 
దక్కన్ ప్రాంతానికి ఔరంగాబాద్ ఒకప్పుడు అధికార కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన చాలా రాజ్యాలు ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించాయి. నిజాం చక్రవర్తి అసఫ్‌ జాహి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఔరంగాబాద్‌కు ఆ రాజ్యంలో చాలా ముఖ్యమైన స్థానం ఉండేది. నిజాం పాలకుల రాజధాని హైదరాబాద్ అయినప్పటికీ, ఔరంగాబాద్‌ను ఎప్పుడూ ఉప రాజధానిగా భావించేవారు. రాజ్యం సరిహద్దుల్లో ఉన్న ఒక పెద్ద నగరంగా దీనికొక ప్రత్యేక స్థానం ఉండేది.

 
ఈ రెండు నగరాల విషయంలో ఇప్పుడు జరుగుతున్న ఓ చర్చ కూడా రెండింటికీ మరో సారూప్యతగా మారింది. అదే నగరం పేరు మార్పు అంశం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా, ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మార్చాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఔరంగాబాద్ జిల్లాకు, నగరానికి పేరు మార్చాలనే చర్చలు, వాదనలు అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో "లవ్ ఔరంగాబాద్" లేదా "సూపర్ శంభాజీనగర్" అంటూ కనిపిస్తున్న బోర్డులు వివాదానికి దారితీశాయి. ఈ గొడవలోకి చాలా రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేశాయి.

 
ఇన్నాళ్లూ ఈ నగరం పేరు మార్చాలని శివసేన పార్టీ డిమాండు చేసిందని, ఇప్పుడదే పార్టీ అధికారంలో ఉండటం వలన నగరం పేరును శంభాజీనగర్ అని మార్చే డిమాండును నెరవేర్చాలని బీజేపీ అంటోంది. అయితే, నగరం పేరు మార్పును తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కూడా ఔరంగాబాద్ పేరు మార్చేందుకు తమ మద్దతు తెలిపింది. శివసేన తన నిర్ణయాన్ని పార్టీ అధికార పత్రిక సామ్నా ద్వారా ఇదివరకు స్పష్టం చేసింది.

 
బాల్ ఠాక్రే ఈ నగరం పేరును శంభాజీనగర్ అని మార్చారని, దానిని ప్రజలు కూడా ఆమోదించారని సామ్నా సంపాదకీయంలో రాశారు. కానీ, స్థానిక రాజకీయాల వలన ఔరంగాబాద్ పేరు చాలాసార్లు వార్తల్లోకొచ్చింది. పేరు మార్చడానికి రాజకీయ పార్టీలు ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ నగరంలోని నియోజకవర్గాల కూర్పును పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఔరంగాబాద్‌లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. అందుకే ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.

 
రజతదాగ్ నుంచి ఔరంగాబాద్ వరకు
"చరిత్రలో ఔరంగాబాద్ ప్రస్తావన యాదవ రాజుల పాలనా కాలం నుంచి కనిపిస్తున్నప్పటికీ శాతవాహన కాలం నుంచి ఇక్కడ మనుషులు మనుగడ సాగించినట్లు తెలుస్తోంది" అని ఔరంగాబాద్‌కు చెందిన చరిత్రకారిణి, ప్రొఫెసర్ దులారి ఖురేషి చెప్పారు. శాతవాహనులు ఔరంగాబాద్‌ని రజతదాగ్ అని పిలిచే వారని ఆమె బీబీసీ మరాఠీకి చెప్పారు. ఈ విషయం కన్హేరి గుహల దగ్గర దొరికిన శాసనాలలో ఉందని చెప్పారు.

 
ఈ గుహలు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరాట్వాడా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాయి. వాణిజ్య మార్గంలో రజతదాగ్ కేంద్రంగా ఉండేది. ఈ మార్గం ఉజ్జయిని మాహిష్మతి , బుర్హాన్ పూర్, అజంతా, భొకార్దాన్ , రజత్ గడ్ , ప్రతిష్టన్ - తేర్ మీదుగా వెళ్తుంది. యాదవ రాజుల కాలంలో ఉన్నదేవ్‌గిరి నేటి దౌలతాబాద్ ఒక ప్రముఖ కేంద్రంగా ఉండేది. కాలక్రమేణా దౌలతాబాద్ కోటను అలావుద్దీన్ ఖిల్జీ కైవసం చేసుకున్నారు.

 
మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327లో రాజధానిని దిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీ ఏర్పాట్లు చాలా వరకు జరిగిన జరిగిన తర్వాత 1334లో ఆయన తిరిగి దిల్లీనే రాజధానిగా ఉంచాలని నిర్ణయించారు. కానీ, ఈ రాజధాని మార్పు నిర్ణయం దౌలతాబాద్ ప్రాముఖ్యాన్ని, దాని చుట్టు పక్కల ప్రాంతాలు దక్కన్ ప్రాంతంలో అధికార కేంద్రాలుగా ఉన్న విషయాన్ని తెలియచేస్తుంది. దౌలతాబాద్ 1499లో అహ్మద్ నగర్‌కు చెందిన నిజాంషాహి పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత 137 సంవత్సరాల వరకు ఆ కోట నిజాం పాలకుల చేతుల్లోనే ఉంది.

 
తుగ్లక్ పాలనలో నిర్మాణాలు
మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని దౌలతాబాద్‌కు తరలించే క్రమంలో ఆ నగరానికి వెళ్లే మార్గంలోని కొన్ని చోట్ల వసతి గృహాలు, బావులు, మసీదులు కట్టించారు. అలా నిర్మించిందే ఔరంగాబాద్ కూడా. తుగ్లక్ ఇక్కడ మసీదు, ఒక బావి, వసతి గృహం నిర్మించారని దీనినే జునా బజార్ అని అంటారని దులారి ఖురేషి చెప్పారు. మహమ్మద్ తుగ్లక్ మరో పేరు జౌనా ఖాన్ కావడంతో గతంలో దీనిని జౌనా బజార్ అని పిలిచే వారని ఆమె చెప్పారు. కాలక్రమేణా అది జునాగా స్థిరపడిపోయింది అని అన్నారు.

 
ఖడ్కి, చికాల్తానా
అహ్మద్ నగర్ పాలకుని సైన్యాధిపతి, ప్రధాన మంత్రి మలిక్ అంబర్ చికాల్తానా దగ్గర జరిగిన యుద్ధంలో మొఘలులను ఓడించారు. మలిక్ అంబర్‌కు ఈ ప్రాంతం బాగా నచ్చడంతో ఆయన ఖడ్కి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. దాంతో ఔరంగాబాద్ నగర నిర్మాణానికి తొలి పునాది పడింది. ఆయన రోడ్లు, వంతెనలను నిర్మించారు. నీటి పారుదల కోసం కాలువలను తవ్వించారు. నౌఖణ్డా లాంటి కోటలను కూడా నిర్మించారు. పోర్చుగీస్ వారి కోసం చర్చిలను కూడా కట్టారు.

 
1616లో చక్రవర్తి జహంగీర్... ఖడ్కిపై దాడి చేశారు. ఈ దాడిలో ఈ గ్రామం బాగా దెబ్బతింది. తిరిగి కోలుకోవడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టి ఉండవచ్చు. మలిక్ అంబర్ ఖడ్కిని పునర్నిర్మించారు. కానీ, ఆయన 1626లో మరణించారు.

 
ఫతే నగర్...ఖుజిస్తా బునియాద్...
కొన్నేళ్ల తర్వాత మలిక్ అంబర్ కొడుకు ఫతే ఖాన్ కొన్ని రోజులు ఖడ్కిలో ఉన్నారు. ఆయన నగరం పేరును ఫతే నగర్‌గా మార్చారని చరిత్రకారుడు పుష్కర్ సోహోని చెప్పారు. కానీ, 1636లో దక్కన్ ప్రాంతానికి సుబేదారుగా షాజహాన్ ఔరంగజేబును నియమించారు. దాంతో ఆ నగరం పేరును ఖుజిస్తా బునియాద్ అని మార్చారు. 1657 తర్వాత దీని పేరు ఔరంగాబాద్‌గా మారింది. మొఘల్ చరిత్రలో ఔరంగాబాద్‌కు కూడా లాహోర్, దిల్లీ, బుర్హన్‌పూర్‌లకు ఉన్నంత ప్రాముఖ్యం ఉంది.

 
ఔరంగజేబుకు ప్రియమైన నగరం
మొదట్లో కొన్ని రోజులు ఔరంగజేబు దౌలతాబాద్‌లోనే ఉన్నారు కానీ, కొన్నాళ్ళకు ఆయన తన కేంద్రాన్ని ఖుజిస్తా బునియాద్‌కు మార్చారు. ఆయనకు ఈ ప్రాంతం నచ్చి నగరంలో చాలా కాలనీలను నిర్మించారు. నగరంలో భవనాలను నిర్మించారు. కోటలు కట్టారు. దీంతో ఇది దక్కన్ రాజధాని హోదాను సంతరించుకుంది. మలిక్ అంబర్ లాగే ఆయన కూడా 11 నీటి కాలువలు నిర్మించారు.

 
"ఈ నగర సౌందర్యాన్ని పర్యటకులు ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇక్కడి గాలి సువాసన వెదజల్లుతుందని, నీరు తేనెలా ఉంటుందని వర్ణించారు’’ అని దులారి ఖురేషి అన్నారు. ఔరంగజేబు 1681లో ఔరంగాబాద్ చేరిన తర్వాత ఇక దక్కన్ వదిలి వెళ్ళలేదు. అక్కడ ఖుల్తాబాద్‌లో తనకు చిన్న సమాధి నిర్మించి దాని మీద తులసి మొక్క నాటాలని ఆయన కోరారు.

 
అసఫ్ జాహి పాత్ర
ఔరంగజేబు మరణం తర్వాత దక్కన్ ప్రాంతంలో మొఘల్ పాలన బలహీనపడింది. ఇక్కడికి సుబేదారుగా వచ్చిన నిజాం అసఫ్ జాహి ముఘల్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆయన ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకుని పాలించారు. మూడవ నిజాం చక్రవర్తి 1761లో హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకున్నారు. అప్పటి వరకు ఔరంగాబాద్‌ను చాలా మంది రాజులు ఉప రాజధానిగా వ్యవహరించారు. హైదరాబాద్ 1948లో భారతీయ రాష్ట్రాలతో విలీనం అయినప్పుడు ఔరంగాబాద్‌తో సహా మరాఠ్వాడా ప్రాంతం భారత సమాఖ్యలో భాగమయ్యాయి.

 
శంభాజీ నగర్ ఎప్పటి నుంచి ఒక పేరుగా మారింది?
గరంలో 1988లో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో శివసేన 27 స్థానాలను గెలుచుకుంది. ఎన్నికల తర్వాత బాల్ ఠాక్రే విజయోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తూ ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి శివసేన పార్టీ కార్యకర్తలు ఔరంగాబాద్‌ని శంభాజీనగర్ అనే పిలుస్తున్నారు. శివసేన పత్రిక సామ్నా వ్యాసాలలో కూడా ఈ నగరాన్ని శంభాజీనగర్ అని సంబోధిస్తారు. ఔరంగాబాద్‌లో జరిగిన ప్రతి మునిసిపల్ ఎన్నికల్లో ఈ విషయం ఒక ముఖ్యాంశంగా ఉంటూ వస్తోంది.

 
శివ సేన-బీజేపీ ప్రభుత్వ పాలనలో ఆమోదం
1995లో శివసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉండగా మాజీ పార్లమెంట్ సభ్యుడు చంద్రకాంత్ ఖరే ఔరంగాబాద్‌కు గార్డియన్ మంత్రిగా ఉండేవారు. మాజీ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ హరిభావ్ బగాడే జల్నా జిల్లాలో గార్డియన్ మంత్రిగా ఉండేవారు. ఆయన ఈ నగరం పేరును మార్చాలనే ప్రతిపాదనను క్యాబినెట్ సమావేశంలో ప్రతిపాదించగా దానికి ఆమోదం లభించింది.

 
"మా కూటమి 1995లో అధికారంలో ఉండగా ఈ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చారు. ఒకరు కోర్టులో కూడా అప్పీలు వేశారు. కానీ, హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తర్వాత సుప్రీం కోర్టు కూడా అదే తీర్పునిచ్చింది. కానీ, అంతలోనే మా కూటమి రాష్ట్రంలో అధికారం కోల్పోయింది" అని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఖరే చెప్పారు.

 
ఈ నగరం పేరును మార్చాల్సిన అవసరమేమిటని ప్రశ్నించినప్పుడు... "ఈ నగరం ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకుని పేరు మీద ఉండకూడదు" అని ఆయన అన్నారు. "ఈ నగరానికి ఒకప్పుడు ఖడ్కి అనే పేరుండేది. ఔరంగజేబు ఈ నగరం పేరును ఔరంగాబాద్ అని మార్చారు. ఆయన సోనేరి మహల్‌లో శంభాజీ మహారాజును నాలుగు నెలల పాటు బంధించి ఉంచారు. ఇక్కడే ఆయన్ను ఉరి తీశారు. ఆయన మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అందుకు మా నగరం పేరును శంభాజీనగర్ అని మార్చాలని అనుకుంటున్నాం" అని ఖరే చెప్పారు.

 
నగరం పేరు మార్పును 1996లోనే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమోదించారు. ఔరంగాబాద్ మునిసిపాలిటీ కార్పొరేటర్ ముష్తాఖ్ అహ్మద్ ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. ఆయన ఈ విషయం గురించి 2018లో బీబీసీతో మాట్లాడారు.

 
1996లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పేరు మార్పు గురించి ప్రజల అభిప్రాయాలు, సలహాలు తెలియచేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ, కోర్టు ఈ అంశం విచారణకు చేపట్టే దశలో లేదని అంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. "మేము సుప్రీం కోర్టును ఆశ్రయించాం. సుప్రీం కోర్టు మా అప్పీలును స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. నగరాల పేర్లు మార్చడం కంటే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టమని ఒక న్యాయమూర్తి కూడా మందలించారు. ఈ కేసుపై మరో విచారణ అయ్యే లోపే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచింది. అప్పటి ముఖ్య మంత్రి విలాస్ రావు దేశముఖ్ నగరం పేరును మార్చాలనే నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా రద్దు అయింది" అని అహ్మద్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు