BBC Indian Sportswoman of the Year అవార్డ్ - 2019: నామినీల జాబితా ఇదే

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (17:08 IST)
ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - 2019
బీబీసీ మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్న "ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - 2019" కు నామినీల జాబితాను విడుదల చేసింది. బీబీసీ భారతీయ భాషలకు చెందిన ఏ వెబ్‌సైట్‌లోకైనా వెళ్లి అభిమానులు తమకు నచ్చిన క్రీడాకారిణికి ఓటు వేయవచ్చు. భారత కాలమానం ప్రకారం, 2020 ఫిబ్రవరి 17వ తేదీ 23.30 (18:00 గ్రీన్‌విచ్ మీన్ టైం) గంటల వరకు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు.

 
అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణి పేరును 2020 మార్చి 8న దిల్లీలో జరిగే కార్యక్రమంలో బీబీసీ ప్రకటిస్తుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, ప్రైవసీ నోటీసు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఓటింగ్ ఫలితాలను బీబీసీ భారతీయ భాషలు, స్పోర్ట్స్ వెబ్‌సైట్‌లలోనూ ప్రచురిస్తాం.

 
అత్యధిక ఓట్లు పొందిన క్రీడాకారిణిని 'ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్'గా బీబీసీ ప్రకటిస్తుంది. భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో కూడిన జ్యూరీ ఐదుగురు నామినీలను ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన టాప్ ఐదుగురు మహిళా క్రీడాకారులు బీబీసీ వెబ్‌సైట్లలో పబ్లిక్ ఓటింగ్ కోసం నామినేట్ అయ్యారు.
 
ఓటింగ్ కోసం ఎంపికైన వారు:
ద్యూతీ చంద్
ద్యుతీ చంద్
వయసు: 23 ఏళ్లు, క్రీడ: అథ్లెటిక్స్
 
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడవ వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియాన్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. ఇది 1998 తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అవార్డు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ద్యుతి... దేశంలో సమర్ధవంతమైన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.
మానసి జోషి
మానసి జోషి
వయసు: 30 ఏళ్లు, క్రీడ: పారా బ్యాడ్మింటన్
 
మానసి జోషి 2019లో స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు. ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ కలిగిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో మానసి ఒకరు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ పారా గేమ్స్‌లో కాంస్యం సాధించారు. 2011లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ కాలును కోల్పోయారు. అయితే, ప్రపంచంలోనే ఉత్తమ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యేందుకు ఆమెకు ఆ వైకల్యం అడ్డురాలేదు.
మేరీకోమ్
మేరీ కోమ్
వయసు: 36 ఏళ్లు, క్రీడ: బాక్సింగ్ (ఫ్లైవెయిట్ విభాగం)
 
ఎనిమిది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్ మేరీ కోమ్‌గా సుపరిచితమైన మాంగ్తే చుంగ్‌నీజంగ్. ఆమె పాల్గొన్న ఏడు ఛాంపియన్‌షిప్స్‌లోనూ వరసగా పతకాలను కైవసం చేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ అమెచూర్ బాక్సింగ్ ఛాంపియన్, బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక మహిళ కూడా ఈమే. మేరీ కోమ్ రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలు. ప్రపంచ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెను 'ఓలి' అనే బిరుదుతో సత్కరించింది.
వినేష్ ఫోగట్
వినేష్ ఫోగట్
వయసు: 25 ఏళ్లు, క్రీడ: ఫ్రీస్టైల్ రెస్లింగ్ (కుస్తీ)
 
వినేష్ ఫోగట్ 2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్. వినేష్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహిళా రెజ్లర్ల కుటుంబానికి చెందినవారు. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి కాంస్యం సాధించారు.
పి.వి. సింధు
పీవీ సింధు
వయసు 24 ఏళ్లు, క్రీడ: బ్యాడ్మింటన్
 
స్విట్జర్లాండ్‌లోని బాజెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెల్చుకున్న తొలి భారతీయురాలు పీవీ సింధు. ఆమె ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలను గెలుచుకుంది. రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
 
పదిహేడేళ్ల వయసుకే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (2012) టాప్ 20 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకుంది. గత నాలుగేళ్లలో టాప్ 10లో నిలిచింది. ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమె పతకం తెస్తారని భారత్ ఆశలు పెట్టుకుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు