పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా, ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా?

సోమవారం, 16 డిశెంబరు 2019 (22:16 IST)
పౌరసత్వ సవరణ బిల్లు రాష్ట్రపతి భవన్ తలుపు తట్టకముందే, ఈశాన్య రాష్ట్రాల నుంచి దానిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. డిసెంబర్ 12 రాత్రి రాష్ట్రపతి సంతకం చేయడంతో ఆ బిల్లు చట్టంగా మారింది. అంతకుముందు, డిసెంబర్ 10న సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభ దాన్ని ఆమోధించింది. ఆ రోజు నుంచి అస్సాంలో విద్యార్థులు, సామాన్య జనం వీధుల్లోకి రావడం మొదలుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం భారీగా భద్రత దళాలను మోహరించింది. అయినా, నిరసనలు తగ్గలేదు.

 
ఆ మరుసటి రోజు సాయంత్రానికి బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది. అస్సాం, మణిపుర్, త్రిపురలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువహాటిలో కర్ఫ్యూ విధించారు. పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ జరగదని పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన మాటల ప్రభావం ఎక్కడా కనిపించలేదు.

 
డిసెంబర్ 9న బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో 'ఇన్నర్ లైన్ పర్మిట్' జాబితాలో మణిపుర్‌ను చేర్చడం గురించి ప్రస్తావించారు. కానీ, హింసాత్మక ఆందోళనలు పెరిగిన తర్వాతే ఈ పత్రాలు రూపొందాయి. డిసెంబర్ 11న అకస్మాత్తుగా మణిపుర్‌ను కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ వ్యవస్థను వర్తింపజేసే ఆదేశాలపై రాష్ట్రపతి సంతకం చేశారు.

 
‘రక్షిత ప్రాంతాల్లో’ నిర్ణీత వ్యవధి వరకూ ప్రయాణించేందుకు పౌరులకు జారీ చేసే పత్రం ఇన్నర్ లైన్ పర్మిట్. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మణిపుర్‌లో ఈ వ్యవస్థ అమల్లో ఉంది. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, ఈశాన్య రాష్ష్ట్రాలను విడదీసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గోగోయి ఆరోపించారు.

 
అయితే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లోనే కాదు.. దిల్లీ, ముంబయి, ఔరంగాబాద్, కేరళ, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్‌ల్లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోదీ కలిసి గువహాటిలో భేటీ కావాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి 17 వరకు షింజో అబే పర్యటన ఉంటుందని ముందుగా ప్రకటించారు. అయితే, చివరి నిమిషంలో దీన్ని రద్దు చేశారు. ఈ పరిణామమే, అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టానికి ఈ స్థాయి వ్యతిరేకత వస్తుందని బీజేపీ ఊహించలేదా అన్న ప్రశ్నను రేకెత్తిస్తోంది.

 
ఒకవేళ ఊహించి ఉంటే, ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో షింజే అబే-మోదీ భేటీకి గువహాటిని ఎందుకు వేదికగా ఎంచుకున్నారు? పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఈశాన్య రాష్ట్రాల్లో వికటించిందా?

 
ఈశాన్యంలో బీజేపీ ఫార్ములా పనిచేయలేదా?
దిల్లీ నేతల్లో ఈశాన్య రాష్ట్రాలను సరిగ్గా అర్థం చేసుకున్నవారు చాలా తక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకురాలు రాధికా రామశేషన్ అన్నారు. ''ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో వర్గాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వారికి ఒక జన్మ పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం అస్సాంలాగే ఉంటాయని బీజేపీ అనుకుంటోంది. అసలు అస్సాం కూడా ఆ పార్టీకి పూర్తిగా అర్థమై ఉండదు'' అని చెప్పారు.

 
''ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీకి అంతగా అవగాహన లేదు. ఎందుకంటే, ఆ పార్టీ నాయకులు అన్ని విషయాలనూ మతం కోణంలో చూస్తారు. ఇలా చేస్తే, హిందువులు తమవైపు వస్తారని వాళ్లు అనుకున్నారు. బెంగాలీ హిందువులు, బెంగాలీ ముస్లింలను అస్సాంలోనివారు, మిగతా ఈశాన్య రాష్ట్రాలవారు ఒకేలా చూస్తారన్న విషయం బీజేపీ గుర్తించలేకపోయింది. ఎవరు వచ్చినా తమ జనాభా సమీకరణాలు మారిపోతాయన్న ఆందోళన అక్కడి జనాలది'' అని సీనియర్ పాత్రికేయుడు సుబీర్ భౌమిక్ అన్నారు.

 
''బీజేపీ వేసిన 'అస్సామీ హిందువులు, బెంగాలీ హిందువులు భాయి భాయి' అనే మంత్రం ఇక్కడ పారలేదు. అస్సాంలో తమకు మెజార్టీ వచ్చింది కాబట్టి, ఇక్కడ హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి తమకు వ్యతికేత ఉండదని ఆ పార్టీ అనుకుంది. కానీ, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్‌ను పెంచింది. దీంతో మిగతా ప్రాంతాల్లోకి బెంగాలీ హిందువులు వస్తారని అస్సాం, త్రిపురలోని జనాలు భావించడం మొదలుపెట్టారు'' అని చెప్పారు.

 
ఆర్థిక వ్యవహారాల్లో వెనుకబడిన కారణంగా, హిందూ ఎంజెడాను ముందుకు తీసుకువెళ్లాలని బీజేపీ అనుకుంటోందని సుబీర్ భౌమిక్ అభిప్రాయపడ్డారు. ''కశ్మీర్, ఎన్ఆర్‌సీ, రామమందిరం, పౌరసత్వ సవరణ చట్టం.. ఇలా చేస్తూ పోతే హిందువుల ఓట్లు తమతోనే ఉంటాయని బీజేపీ అనుకుంటోంది. ఆ పార్టీ చాలా తొందరపడుతోంది'' అని అన్నారు.

 
''ఇది కేవలం ఉత్తర భారతానికి సంబంధించిన విషయం కాదు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలపైనా బీజేపీ దృష్టి పెట్టింది. పౌరసత్వ సవరణ బిల్లును సరిగ్గా అమలు చేస్తే, బెంగాలీ హిందువులు (ఇప్పటివరకూ పౌరసత్వం పొందనివారు) తమ ఓటు బ్యాంకుగా మారతారని ఆ పార్టీ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా అస్సాంలో ముస్లిం ఓటు బ్యాంకును ఇలాగే సృష్టించుకుంది. తూర్పు పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులను తమ ఓటు బ్యాంకుగా మలుచుకుంది'' అని రాధికా రామశేషన్ అభిప్రాయపడ్డారు.

 
ఆర్టికల్ 370ని సవరించి కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత దాదాపు అక్కడి ప్రముఖ నాయకులందరినీ, కొందరు కార్యకర్తలను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది. అక్కడ బలగాలను కూడా పెద్ద సంఖ్యలో మోహరించింది. కమ్యునికేషన్ సేవలను నిలిపివేసింది. జమ్మూలో ఇంటర్నెట్ సేవలు నడుస్తున్నా, కశ్మీర్‌లో ఇప్పటికీ మొదలవ్వలేదు.

 
''కశ్మీర్‌లో జీహాదీ దాడులు జరగొచ్చని ప్రభుత్వానికి ముందే సమాచారం ఉంది. దీంతో ముందుగానే అక్కడ చాలా చర్యలు తీసుకున్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలు కూడా అంతే సున్నితమైన ప్రాంతాలు'' అని సుభీర్ భౌమిక్ అన్నారు. కశ్మీర్‌ లాగే అస్సాం ఉంటుందని భావిస్తే పొరపాటు అవుతుందని, అస్సాంలోని అంశం పూర్తిగా భిన్నమైందని రాధికా రామశేషన్ అభిప్రాయపడ్డారు.

 
''పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీ ముడిపడి ఉన్న అంశాలు. అస్సాంలో ఎన్ఆర్‌సీ విడుదల చేసినప్పుడు ఆ రాష్ట్రంలో, బెంగాల్‌లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ చూశాక కూడా ఈ చట్టాన్ని తేవాలని ఎలా ప్రయత్నించారో అర్థం చేసుకోలేకపోతున్నా. ఎన్ఆర్‌సీ వల్ల జరిగినదాన్ని సరిదిద్దేందుకు పౌరసత్వ సవరణ చట్టం తెస్తున్నామని బీజేపీ అంటోంది'' అని రాధికా రామశేషన్ అన్నారు.

 
''పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఎన్ఆర్‌సీని వేర్వేరుగా చూడలేం. పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇక రాబోయేది ఎన్‌ఆర్‌సీనే. ఈ చట్టంతో ఎన్‌ఆర్‌సీని కలుపుతామని స్వయంగా అమిత్ షానే చాలా సార్లు చెప్పారు'' అని అన్నారు. ''అస్సాంలో ఇటీవల ఎన్‌ఆర్‌సీ విడుదల చేయడంతో 20 లక్షల మందికి పౌరసత్వం లేకుండా పోయింది. వీరిలో 4-5 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. 11-15 లక్షలకుపైగా హిందువులు ఉన్నారు. అందుకే బీజేపీ ఫార్ములా పనిచేయలేదు'' అని సుబీర్ భౌమిక్ చెప్పారు.

 
''అస్సాంతోపాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఇంతకుముందు ప్రభుత్వ వ్యతిరేక సంస్థలు పనిచేశాయి. కాలం గడిచిన కొద్దీ అవి బలహీనపడ్డాయి. ఇప్పుడు అవి మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అవి బలపడే అవకాశం కూడా ఉంది. ఇటీవలే ఆల్ఫా కూడా ఓ ప్రకటన చేసింది'' అని సుభీర్ అన్నారు. 1991లో అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు 'లుక్ ఈస్ట్' విధానాన్ని ప్రారంభించారు. 2014లో ప్రధాని మోదీ దాన్ని 'యాక్ట్ ఈస్ట్'గా మార్చారు.

 
2018 ఫిబ్రవరిలో గువహాటిలో జరిగిన ఓ సదస్సులో యాక్ట్ ఈస్ట్ విధానం గురించి మోదీ మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలది ఇందులో ముఖ్య పాత్రని, వాటి గుండా తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్య కార్యకలాపాలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితి 'యాక్ట్ ఈస్ట్'కు పెద్ద అవరోధంగా మారిందని సుబీర్ భౌమిక్ అభిప్రాయపడ్డారు.

 
''ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక కారిడార్ ఎలా ఏర్పాటు చేస్తారు? హింస నెలకొన్న ఈ రాష్ట్రాల గుండా తమ ఉత్పత్తులను తూర్పు ఆసియా దేశాలకు పంపాలని వాణిజ్యవేత్తలు అనుకుంటారా? ఏ ఇబ్బందీ లేని సముద్ర మార్గం మేలని భావిస్తారు కదా! లుక్ ఈస్ట్-యాక్ట్ ఈస్ట్ విజయవంతం కావాలంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి కుదుటపడాలి. కానీ, ఇప్పుడు కొత్త గందరగోళం ఏర్పడింది'' అని అన్నారు.

 
''ప్రతి అంశాన్నీ హిందూత్వ కోణంలో చూడటం బీజేపీ చేస్తున్న పెద్ద తప్పు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలని ఆ పార్టీ అనుకుంటోంది. కానీ, బంగ్లాదేశ్ బెంగాలీ దేశం. మతం కోణంలో దాన్ని చూడకూడదు'' అని చెప్పారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు ఎప్పుడూ బాగానే ఉన్నాయని.. కానీ, ప్రస్తుత పరిణామాల ప్రభావం వాటిపై పడొచ్చని రాధికా రామశేషన్ అభిప్రాయపడ్డారు. ఒక్క పౌరుడిని కూడా తాము వెనక్కితీసుకోబోమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసినా పదేపదే చెబుతున్నారని అన్నారు.

 
''ఇది భారత్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదు. పొరుగుదేశాలతో సంబంధాలపైనా చెడు ప్రభావం పడొచ్చు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళులు తమిళనాడులో ఉంటున్నారు. వారి గురించి చట్టంలో ఏమీ లేదు. చట్టంలో పేర్కొన్న దేశాల్లో అఫ్గానిస్తాన్ ఉంది. అది భారత్‌కు మిత్ర దేశం. అక్కడ హిందువులు, సిక్కులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వారిని వెనక్కితీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ఈ చట్టంతో సూటిగా అంటోంది'' అని రాధికా అన్నారు.

 
''బెంగాల్ ఎన్నికల కోసం అస్సాంను త్యాగం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇలాంటి రాజకీయాలు చాలా ప్రమాదకరం. త్రిపుర, మేఘాలయా ఇన్నర్ లైన్ పర్మిట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. అలాంటప్పుడు అస్సాంను దీనికి దూరంగా ఎందుకు ఉంచాలన్న ప్రశ్న వస్తుంది. అస్సాంలో కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ తేవొచ్చు. కానీ, దాని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది'' అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు