కరోనా వైరస్: చేతిలో డబ్బులు అయిపోతున్నాయి, ఏం చెయ్యాలో తెలియడం లేదు: బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల గోడు
మంగళవారం, 31 మార్చి 2020 (18:25 IST)
ఒకరు కాదు.. ఇద్దరు కాదు... మొత్తం సుమారు 250 మంది... కరోనావైరస్‌ను అరికట్టడంలో భాగంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో ప్రస్తుతం బ్రిటన్‌లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్న వారిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకొనసాగిస్తున్న వారు ఉన్నారు.
వారిలో కొందరు గడిచిన రెండు మూడేళ్లుగా అక్కడే ఉన్నవారైతే మరికొందరు 3-4 నెలల క్రితమే వెళ్లారు. కరోనావైరస్ దెబ్బకు బ్రిటన్ కూడా అల్లాడిపోతోంది. ఇప్పటికే అక్కడ సుమారు 1200 మందికిపైగా కోవిడ్ 19 బారిన పడిప్రాణాలు కోల్పోయారు. సుమారు19 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడి సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. పరిస్థితి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉండటం యావత్ బ్రిటన్ వాసుల్లో తీవ్ర భయాందోళనల్ని రేకెత్తిస్తోంది. రోజుకు కొత్తగా సుమారు 2500 కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి మొత్తం కుదుట పడేందుకు కనీసం 6 నెలలు పట్టవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళనలో తెలుగు విద్యార్థులు
ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లడమే అత్యంత ప్రమాదంగా మారుతోంది. స్థానికుల పరిస్థితే అలా ఉంటే.. ఇక విద్యనభ్యసించేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎంతో కొంత ముందు జాగ్రత్త పడి నిత్యావసరాలను నిలవ చేసుకున్నా... ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్‌లో ఎన్నాళ్లు లాక్ డౌన్ కొనసాగుతుందో తెలియని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఉన్నవాటినే సర్దుకుంటూ బిక్కు బిక్కు మంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. కనీసం పాలు, నీళ్లకు కూడా బయటకు వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు.
వచ్చి ఆరు నెలలైంది
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మట్టా రాకేశ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసేందుకు 2019 సెప్టెంబర్‌లో మాంచెస్టెర్ వచ్చారు. నిన్నమొన్నటి వరకు అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్‌షైర్ చదువు కొనసాగిస్తు వచ్చారు.
యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నెల 29న మాంచెస్టర్ వదిలి స్వస్థలానికి వచ్చేయాలని విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నామని ఆయన బీబీసీకి చెప్పారు. “చైనా నుంచి యూరోపియన్ దేశాలకు కూడా కరోనావైరస్ వ్యాపించడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లి పోవాలని నాతో పాటు కొంత మంది స్నేహితులం కలిసి ఈ నెల 29కి భారత్ వెళ్లిపోవాలని టిక్కెట్లు బుక్ చేసుకున్నాం.
లాక్ డౌన్ వార్తల నేపథ్యంలో వాటిని 20కి ప్రీపోన్ చేసుకున్నాం కూడా. కానీ ఎయిర్ పోర్ట్‌లోనే మమ్మల్ని అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు మార్చి 22 నుంచీ భారత్ అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. దీంతో మేం దిక్కు తోచని స్థితిలో పడిపోయాం.
లాక్‌డౌన్ ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీదు. యూనివర్శిటీ మూసేశారు. చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలు పోయాయి. నిత్యావసరాలకు కటకట ఏర్పడింది. బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు" అంటూ బీబీసీ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక విమానం ఎక్కడమే తరువాయి అనుకున్నాం
ఖమ్మం జిల్లాకు చెందిన వంశీ మందాడి మూడు నెలల క్రితమే మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేసేందుకు మాంచెస్టర్ వచ్చారు. ఇంకా ఇప్పుడిప్పుడే బ్రిటన్ వాతావరణానికి అలవాటు పడుతున్నారు. అంతలోనే కోవిడ్ 19 బ్రిటన్‌ను కమ్మేసింది. తమ పరిస్థితి దారుణంగా ఉందని బీబీసీ ఎదుట తమ బాధను వ్యక్తం చేశారు.
“వచ్చి మూడు నెలలయ్యింది. అంతలోనే పరిస్థితి ఇలా తయారయ్యింది. రోజుకు 2500మందిక కరోనావైరస్ సోకుతున్నప్పటికీ ముందు జాగ్రత్తల విషయంలో ఇక్కడ చాలా వెనకబడి ఉన్నారు. కనీసం భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ లేదు. రోజు రోజుకీ కోవిడ్19 మరణాల సంఖ్య పెరిగిపోతోంది. చేతులో ఉన్న డబ్బులు మరో పది పదిహేను రోజులకు మించి రావు.
ఇక్కడ మాలాగా చిక్కుకున్న వారందరితో కలిసి మేం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. సుమారు 150 మంది వరకు మా గ్రూపులో ఉన్నారు. అందరిదీ అదే పరిస్థితి. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. దీంతో చాలా మంది తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చెయ్యగలరా అని వాట్సాప్‌లో అడుగుతూ ఉంటే కన్నీళ్లు ఒక్కటే తక్కువ. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని భయమేస్తోంది” అంటూ వంశీ బీబీసీతో చెప్పారు.
ఎప్పుడు బయట పడతామో తెలియడం లేదు
అదే జిల్లాకు చెందిన ఏలూరి తేజస్వీ మాంచెస్టర్‌లోని సాల్ ఫోర్డ్ యూనివర్శిటీలో మూడు నెలల క్రితమే చేరారు. డేటా సైన్స్ విభాగంలో ఎంఎస్ చేస్తున్నారు. వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అక్కడ ఉండి చదువుకోవడం కన్నా తిరిగి ఇంటికి వచ్చేయడమే మంచిదని భావిస్తున్నారు.
“ఇక్కడ పరిస్థితి రోజు రోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. బయటకు వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం మమ్మల్ని వెంటాడుతోంది. నిజానికి ఈ పరిస్థితి వస్తుందని గ్రహించి ఈ నెల 29కి భారత్ వెళ్లిపోయేందుకు టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నాం. అంతలోనే కోవిడ్19 పై పోరాటంలో భాగంగా భారత్ వ్యవహరిస్తున్న తీరు చూసి ఎక్కడ బ్రిటన్లోనే చిక్కుకుపోతామోనని భయంతో టిక్కెట్లను 20వ తేదీకి ప్రీపోన్ చేసుకున్నాం.
లగేజ్ అంతా సర్దుకొని 20న విమానాశ్రయానికి కూడా చేరుకున్నాం. కానీ మమ్మల్ని ఎయిర్ పోర్ట్ లోనే నిలిపేసిన అధికారులు తిరిగి వెనక్కి పంపేశారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ జనం ఎప్పట్లాగే రోడ్లపై తిరుగుతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా రెట్టింపైపోయాయి.
మా దగ్గరున్న డబ్బులతో మరో పది రోజుల వరకు ఉండగలం. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ మా అమ్మ, నాన్న చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు ఇక్కడ నుంచి బయటపడతామో కూడా తెలియడం లేదు” అని తేజస్వీ బీబీసీతో తన ఆవేదనను వెలిబుచ్చారు.
తమ పరిస్థితిని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కి ట్విట్టర్ ద్వారా తెలియజేశామని వారు చెప్పారు. భారత్ వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండమన్నా ఉంటామని, ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని కొందరు చెబుతున్నారు.
తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సోయం బాపూరావులు తమతో మాట్లాడారని... విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడి తమను తిరిగి ఇండియాకి రప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
ఇదే విషయమై బీబీసీ కూడా తెలంగాణ ఎంపీ సోయం బాపూరావుతో మాట్లాడింది. తాము ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వశాఖతో మాట్లాడామని, వీలైనంత త్వరలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.