ఔషధం దష్ర్పభావంతో యువకుడిలో రొమ్ముల పెరుగుదల, అమెరికా కంపెనీకి రూ.57 వేల కోట్ల భారీ జరిమానా

గురువారం, 10 అక్టోబరు 2019 (12:50 IST)
ఒక ఔషధం ప్రతికూల ప్రభావాలకు సంబంధించిన కేసులో అమెరికా ఔషధ సంస్థ 'జాన్సన్ అండ్ జాన్సన్‌'కు ఒక జ్యూరీ 800 కోట్ల డాలర్లు అంటే దాదాపు 57 వేల కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. 'రిస్పర్‌డల్' అనే యాంటీసైకోటిక్ ఔషధం వాడకం ప్రతికూల ప్రభావం వల్ల రొమ్ము పెరుగుదల ఉండొచ్చని జాన్సన్ అండ్ జాన్సన్ తనను హెచ్చరించలేదంటూ నికోలస్ ముర్రే అనే యువకుడు వేసిన కేసులో జ్యూరీ ఈ తీర్పు ఇచ్చింది. ఫిలడెల్ఫియా రాష్ట్రంలోని ఈ జ్యూరీ, ఆయనకు 800 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న వేల కేసుల్లో ఆయన కేసు ఒకటి.

 
జాన్సన్ అండ్ జాన్సన్ సబ్సిడియరీ అయిన 'జాన్సెన్' ఈ ఔషధం మార్కెటింగ్‌లో రోగుల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇచ్చిందని నికోలస్ ముర్రే తరపు న్యాయవాదులు వాదించారు. నికోలస్ ముర్రే వయసు 26 ఏళ్లు. తనకు 'ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్' అనే సమస్య ఉన్నట్లు గుర్తించిన తర్వాత 2003లో వైద్యులు రిస్పర్‌డల్ ఔషధాన్ని రాశారని నికోలస్ ముర్రే తెలిపారు. ఈ ఔషధం వాడినందుకు తనలో రొమ్ములు పెరిగాయని చెప్పారు.

 
స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్ చికిత్సకు రిస్పర్‌డల్ వాడేందుకు అనుమతి ఉంది. ఇతర సమస్యలకు కూడా ఈ మందు సరిపోతుందని వైద్యులు భావిస్తే రోగులకు దీనిని సూంచించొచ్చు.

 
అప్పీలు చేస్తామన్న జాన్సన్ అండ్ జాన్సన్
జ్యూరీ రూలింగ్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ తప్పుబట్టింది. జరిమానా చాలా అనుచితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ రూలింగ్‌కు వ్యతిరేకంగా సంస్థ అప్పీలు చేయనుంది. అప్పీలుపై విచారణలో ఈ భారీ జరిమానా తగ్గే అవకాశముందని 'యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మండ్ స్కూల్ ఆఫ్ లా'కు చెందిన ప్రొఫెసర్ కార్ల్ టోబియస్ చెప్పారు.

 
రిస్పర్‌డల్ ఔషధానికి సంబంధించిన ఇతర కేసుల్లో జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరిన్ని భారీ జరిమానాలు పడే ఆస్కారాన్ని తాజా తీర్పు సూచిస్తోందని ప్రొఫెసర్ టోబియస్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులోని ఆధారాల ప్రాతిపదికగా మరో జ్యూరీ లేదా న్యాయమూర్తి ఇదే తరహాలో తీర్పు ఇచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. రిస్పర్‌డల్ ప్రతికూల ప్రభావాల గురించి సరిగా హెచ్చరించలేదనే ఆరోపణలతో అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్‌పై అనేక ఫిర్యాదులు దాఖలయ్యాయి.

 
చిన్నపిల్లల పౌడర్ ఆస్‌బెస్టాస్‌తో కలుషితమైందనే ఆరోపణలు, 'వజైనల్ మెష్ ఇంప్లాంట్స్'కు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్ కోర్టు కేసులను ఎదుర్కొంటోంది. అమెరికాలో 'ఓపియోడ్' దుర్వినియోగం-వ్యసనం సంక్షోభంలో తన పాత్రకు సంబంధించి కూడా జాన్సన్ అండ్ జాన్సన్ న్యాయపోరాటం చేస్తోంది.

 
ఓక్లహామా రాష్ట్రంలో ఓపియోడ్‌ దుర్వినియోగానికి సంబంధించిన ఓ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఈ ఏడాది ఆగస్టులో 57.2 కోట్ల డాలర్ల జరిమానా పడింది. ఓపియోడ్ విషయంలో ఈ సంస్థ తప్పుడు, ప్రమాదకరమైన ప్రచారానికి పాల్పడిందని, ఓపియోడ్ దుర్వినియోగంలో దీని పాత్ర ఉందని న్యాయమూర్తి తేల్చారు. ఈ జరిమానాపై అప్పీలు చేస్తామని సంస్థ చెప్పింది.

 
ఓపియోడ్ సంక్షోభం విషయంలో 2.04 కోట్ల డాలర్లు చెల్లించేందుకు ఓహియో రాష్ట్రంలోని రెండు కౌంటీలతో జాన్సన్ అండ్ జాన్సన్ అంగీకారానికి వచ్చింది. ఈ సంక్షోభానికి సంబంధించిన ఓ కేసు ఈ నెల్లో విచారణకు రానుండగా, ఇంతలో ఈ పరిణామం చోటుచేసుకొంది.

 
'రూలింగ్‌ను తోసిపుచ్చుతారనే నమ్మకం ఉంది'
800 కోట్ల డాలర్ల (రూ. 57 వేల కోట్ల) తాజా జరిమానా రూలింగ్‌ను దీనిపై అప్పీలు విచారణలో తోసిపుచ్చుతారనే నమ్మకం తమకుందని జాన్సన్ అండ్ జాన్సన్ చెప్పింది. రిస్పర్‌డల్ లేబ్లింగ్‌కు సంబంధించిన కీలకమైన ఆధారాలు సమర్పించేందుకు తమ బృందం ప్రయత్నించగా, జ్యూరీ అడ్డుకుందని సంస్థ ఆరోపించింది.

 
రిస్పర్‌డల్ వాడితే ఎదురుకాగల ప్రతికూల ప్రభావాల గురించి హెచ్చరించడంలో జాన్సన్ అండ్ జాన్సన్ విఫలమైందని 2015లో ఒక జ్యూరీ గుర్తించి, నికోలస్ ముర్రేకు 17.5 లక్షల డాలర్లు చెల్లించాలని సంస్థను ఆదేశించింది. ఒక రాష్ట్ర అప్పీళ్ల కోర్టు గత సంవత్సరం ఈ తీర్పును సమర్థించింది. అయితే జరిమానాను 17.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 6.8 లక్షల కోట్ల డాలర్లకు తగ్గించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు