Keerthi Jalli: అస్సాం వరద ప్రాంతాల్లో బురదలో నడిచి వెళ్తున్న ఈ తెలుగు ఐఏఎస్ అధికారిణి ఎవరో తెలుసా?

సోమవారం, 30 మే 2022 (14:01 IST)
చీరలో ఉన్న ఒక మహిళ వరద నీటిలో, బురదలో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలలో ఉన్నది ఒక ఐఏఎస్ అధికారిణి కావడం, వరదలతో అతలాకుతలం అయిన అస్సాంలో స్థానికుల సమస్యలు తెలుసుకోడానికి, సహాయ చర్యలు పర్యవేక్షించడానికి ఆ అధికారిణి కాలినడకన బురదలో వెళ్తుండడంతో ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ప్రజలు ఆమెను ప్రశంసిస్తున్నారు.

 
ఈ ఫొటోలు అస్సాంలోని కాచార్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న కీర్తి జల్లికి సంబంధించినవి. మే 25న చెస్రీ పంచాయతీలోని చుత్రసంగం గ్రామంలో ఆమె వరద ప్రాంతాల్లో బురదలో పర్యటించిన సమయంలో తీసినవి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తక్షణం వారికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి తన కుక్కతో కలిసి ఈవెనింగ్ వాక్‌కు వెళ్లేటప్పుడు ఏకంగా స్టేడియాన్నే ఖాళీ చేయించి విమర్శలు ఎదుర్కొన్న తరుణంలో ఇలా ఓ మహిళా ఐఏఎస్ అధికారి వరదలో, బురదలో పడవల్లో, కాలినడక తిరుగుతుండడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారులు అంటే ఇలాగే ఉండాలంటూ సోషల్ మీడియాలో అందరూ కీర్తి జల్లిని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో అందరిలో ఆమె ఎవరు అనే ఆసక్తి కూడా మొదలైంది.

 
ఐఏఎస్ అధికారిణి కీర్తి జల్లిది తెలంగాణ. వరంగల్ జిల్లాకు చెందిన ఈమె 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఆమె తండ్రి జల్లి కనకయ్య న్యాయవాది కాగా, తల్లి వసంత గృహిణి. 2011లో బీటెక్ పూర్తి చేసి, దిల్లీలో ఐఏఎస్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న కీర్తి రెండేళ్లు కష్టపడి చదివాక 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ పూర్తి చేసిన తర్వాత అస్సాంలో వివిధ బాధ్యతల్లో పనిచేసిన కీర్తి.. మహిళలు, శిశు మరణాలను తగ్గించడానికి, వారి ఆరోగ్యం కోసం, మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు. గ్రామీణ మహిళల్లో మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అస్సాం ప్రజల మనసు గెలుచుకున్నారు.

 
జోర్‌హట్‌ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటింగ్‌ శాతం పెంచినందుకు, ముఖ్యంగా మహిళలు భారీగా ముందుకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించినందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా కీర్తి 'బెస్ట్‌ ఎలక్టొరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్‌' కూడా అందుకున్నారు. మహిళలు ఎప్పుడూ భర్తల చాటునే ఉండిపోతుంటారని, కానీ.. మీరు ముందుకు వచ్చి మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి, మంచి నేతలను ఎన్నుకోండి అనే నినాదంతో తాను మహిళల దగ్గరకు వెళ్లానని, మహిళల ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నించానని కీర్తి చెప్పారు.

 
కీర్తి హైలాకండిలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో స్థానిక మహిళల్లో రక్తహీనత సమస్యను నివారించడానికి లోకల్‌గా పరిష్కారం కూడా అందించారు. ఆ ప్రాంతంలో విస్తృతంగా దొరికే ఉసిరికాయలతో ఉసిరి మురబ్బా తయారు చేయించిన కీర్తి వాటిని స్థానికులకు పంచడం ద్వారా వారి రక్తహీనత సమస్యను పోగొట్టారు. తను ఉసిరి మురబ్బా ఆలోచన చెప్పగానే స్థానికులు తన దగ్గరకు దాదాపు వంద రకాల ఉసిరి మురబ్బా వెరైటీలు తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారని ఆమె ‘బీబీసీ’తో చెప్పారు. ఇక పిల్లల్లో పౌష్ఠికాహార లోపాన్ని నివారించడానికి డిబ్బీ ఆదాన్ ప్రదాన్ అనే మరో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు కీర్తి. అంటే అంగన్ వాడీలకు వచ్చే పిల్లల లంచ్ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరే పిల్లల బాక్స్ వారికి ఇవ్వడం అలా రకరకాల ఆహారం తినడం ద్వారా పిల్లలు పౌష్ఠికాహార లోపం నుంచి బయటపడగలిగారు.

 
పెళ్లయిన మరుసటి రోజే విధుల్లోకి
ఇప్పుడు వరద ప్రాంతాల్లో బురదలో తిరుగుతున్న ఈ ఫొటోలతోనే కాదు, ఇంతకు ముందు కోవిడ్ సమయంలో తన వివాహంతో కూడా వార్తల్లో నిలిచారు కీర్తి జల్లి. ఆ సమయంలో నిరాడంబరంగా జరిగిన తన పెళ్లికి బంధుమిత్రులందరినీ ఆహ్వానించకుండా వారందరికీ ఆన్‌లైన్లోనే తన వివాహాన్ని చూపించారు. తన పెళ్లి కంటే కరోనా జాగ్రత్తలు ముఖ్యం అని భావించారు. పెళ్లైన తర్వాత రోజే విధుల్లోకి వెళ్లారు. "పెళ్లి అనేది 30- 40 ఏళ్ల జర్నీ. అది మూడు నాలుగు నెలలు మిస్సయినా ఫర్వాలేదు. పనిచేసే చోటే ఉంటూ కరోనా సమయంలో నేను ఒక ప్రాణాన్ని కాపాడగలిగినా చాలు అనుకున్నా. ప్రజలకు అండగా ఉంటూ, వారికి అందుబాటులో ఉంటే చాలు అనుకున్నాను. పెళ్లి కంటే ముందు పనే ముఖ్యం అనుకున్నా" అని బీబీసీతో చెప్పారు.

 

You are an inspiration for our next generations madam
- Kirti Jalli,IAS, DC Cachar Assam

@dccachar @himantabiswa @narendramodi @PMOIndia pic.twitter.com/4etz76IvKm

— SANDIPAN DUTTA P (@sandianu) May 25, 2022
తను పనిచేసే ప్రాంతాల్లో స్థానికుల సంక్షేమానికి ఎన్నో విజయవంతమైన పథకాలను అమలు చేసిన కీర్తి, ప్రతి ఒక్కరూ ఇతరులపై ఆధారపడి జీవించకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ఇండిపెండెంట్‌గా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మా నాన్నకు నాకు కొడుకు ఉంటే బావుణ్ణే అనే ఆలోచన రాకూడదని నేను అనుకున్నాను. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నాను. ఎంత రాత్రైనా నా పని నేను చేసుకునేదాన్ని, అన్నయ్యో, తమ్ముడో ఉంటే బావుణ్ణు అని అనుకోకుండా పూర్తిగా ఇండిపెండెంట్‌గా ఉండేదాన్ని. నేను మా చెల్లెల్ని కూడా నాలాగే ఉండేలా చేశాను" అని ఇంతకుముందు బీబీసీతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పారు. 2020 నుంచి కాచార్‌ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా పనిచేస్తున్న కీర్తి జల్లి కోవిడ్‌ నియంత్రణ పోరాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు