మహాత్మా గాంధీ: పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న డిమాండే హత్యకు కారణమా?
శనివారం, 30 జనవరి 2021 (11:05 IST)
1949 ఫిబ్రవరి 10న దిల్లీలోని ఎర్రకోట చుట్టుపక్కల రాకపోకలు అడ్డుకున్నారు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఆరోజు మహాత్మాగాంధీ హత్య కేసులో కోర్టు తీర్పు రాబోతోంది. ఎర్రకోట లోపల ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. సరిగ్గా 11.20కి నాథూరామ్ గాడ్సే, మరో ఎనిమిది మంది నిందితులను కోర్టు రూంలోకి తీసుకొచ్చారు. వారిలో నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే, విష్ణు కర్కరే చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వస్తే, సావర్కర్ ముఖం మాత్రం గంభీరంగా ఉంది.
జడ్జి ఆత్మాచరణ్ 11.30కు కోర్టు రూంలోకి వచ్చారు. జడ్జి కూర్చోగానే నాథూరాం గాడ్సే పేరు పిలిచారు. దాంతో గాడ్సే లేచి నిలబడ్డారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా అందరి పేర్లూ పిలిచారు. గాంధీని హత్య చేసినందుకు నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు జడ్జి ఉరిశిక్ష విధించారు. విష్ణు కర్కరే, మదన్‌లాల్ పాహ్వా, శంకర్ కిస్టయ్య, గోపాల్ గాడ్సే, దత్తాత్రేయ్ పర్చూరేలకు జీవిత ఖైదు విధించారు. సావర్కర్‌ను నిర్దోషిగా ఖరారు చేసిన జడ్జి, ఆయనను తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు.
తీర్పు వినిపించిన తర్వాత, బోనులో నుంచి దిగుతున్న గాడ్సే సహా అందరూ "హిందూ ధర్మ్ కీ జయ్, తోడ్‌కే రహేంగే పాకిస్తాన్, హిందీ హిందూ హిందుస్తాన్" (హిందూ మతానికి జయం, పాకిస్తాన్‌ను ముక్కలు చేస్తాం. హిందీ హిందూ హిందుస్తాన్(భారతదేశం)) అని నినాదాలు చేశారు. కోర్టు రూంలో గాడ్సే అలా నినాదాలు చేయడం అది మొదటిసారి కాదు.
ఎర్రకోటలో విచారణ జరుగుతున్న సమయంలో 1948 నవంబర్ 8న సాక్షులను విచారించిన తర్వాత.. "మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?" అని నాథూరాం గాడ్సేను జడ్జి అడిగారు. దానికి గాడ్సే "నేను నా 93 పేజీల ప్రకటన చదవాలని అనుకుంటున్నా" అన్నారు.
గాడ్సే 10.15కు దాన్ని చదవడం ప్రారంభించారు. దానికి ముందు తను రాసిన ప్రకటన ఆరు భాగాలుగా ఉంటుందని చెప్పారు. మొదటి భాగంలో కుట్ర, దానికి సంబంధించిన విషయాలు. రెండో భాగంలో గాంధీ ప్రారంభ రాజకీయాలు, మూడో భాగంలో గాంధీ రాజకీయాల చివరి దశ, నాలుగో భాగంలో గాంధీజీ స్వతంత్ర పోరాటం, ఐదో భాగంలో స్వాతంత్రం కలలు ముక్కలు కావడం, చివరి భాగంలో 'దేశ విరోధిని బుజ్జగించే విధానం' ఉన్నాయని గాడ్సే చెప్పారు.
సందర్భం లేకుండా తన ప్రకటనను ప్రచురించవద్దని మీడియాను గాడ్సే కోరారు. 45 నిమిషాలు చదివిన తర్వాత ఆయన కోర్టు రూంలోనే కళ్లుతిరిగి పడిపోయారు. కాసేపటి తర్వాత మళ్లీ చదవడం ప్రారంభించారు. అది మొత్తం చదవడానికి ఐదు గంటలు పట్టింది. ఆ సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతూ ఉన్నారు. గాడ్సే తన ప్రకటన చివర్లో 'అఖండ భారత్ అమర్ రహే', 'వందే మాతరం' నినాదాలు చేశారు. గాడ్సే ప్రకటనను కోర్టు రికార్టుల నుంచి తొలగించాలని చీఫ్ ప్రాసిక్యూటర్ కోరారు. అది పూర్తిగా అప్రస్తుతం అన్నారు. దానిపై గాడ్సే... భారత ప్రస్తుత ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని, ఎందుకంటే, ఈ ప్రభుత్వం 'ముస్లిం అనుకూలం' అని చెప్పారు. అయితే గాడ్సే ప్రకటనను కోర్టు రికార్డుల నుంచి తొలగించడానికి జడ్జి ఆత్మాచరణ్ నిరాకరించారు. కోర్టులో లిఖిత ప్రకటనను ఆమోదిస్తారని చెప్పారు. ఆరోజు కూడా కోర్టు రూం కిక్కిరిసి కనిపించింది.
1948 నవంబర్ 9న నాథూరాం గాడ్సేను జడ్జి 28 ప్రశ్నలు అడిగారు. ఒక ప్రశ్నకు జవాబుగా గాడ్సే "అవును, గాంధీజీపై నేనే కాల్పులు జరిపాను. కాల్పులు జరిపిన తర్వాత నన్ను ఒక వ్యక్తి వెనక నుంచి తలపై కొట్టాడు. రక్తం కారుతోంది. నేను తనతో 'ఏది ప్లాన్ చేశానో, అదే చేశాను. నాకెలాంటి పశ్చాత్తాపం లేదు' అన్నా. తను నా చేతుల్లో పిస్టల్ లాక్కున్నాడు. ఆ పిస్టల్ ఆటోమేటిక్. అది పొరపాటున పేలి, ఎవరికైనా బుల్లెట్లు తగులుతాయేమో అని నేను భయపడ్డా. అతడు నాకు పిస్టల్ గురిపెట్టాడు. 'నిన్ను కాల్చేస్తా' అన్నాడు. నేను 'కాల్చెయ్, నేను చావడానికి సిద్ధం అన్నాను" అని చెప్పారు.
మహాత్మా గాంధీ ముని మనవడు, గాంధీ హత్యపై ప్రామాణిక పుస్తకం (లెట్స్ కిల్ గాంధీ) రాసిన తుషార్ గాంధీ దీనిపై స్పందించారు. "అదంతా కోర్టు రూంలో గాడ్సే డ్రామా. బాపూజీని హత్య చేశాక హీరో అయిపోతానని తను అనుకున్నాడు. తన పనిని హిందువులు సమర్థిస్తారని భావించాడు. అలా ఏదీ జరక్కపోవడంతో అతడు కోర్టు రూంలో నాటకీయత సృష్టించే ప్రయత్నం చేశాడు" అని చెప్పారు.
1948 జనవరి 30
చాలా దురదృష్టకరమైన రోజు. నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే, విష్ణు కర్కరే దిల్లీ రైల్వే స్టేషన్ రెస్టారెంట్‌లో టిఫిన్ చేసి బిర్లా మందిర్ వైపు బయల్దేరారు. గాడ్సే బిర్లా మందిర్ వెనక అడవిలో మూడు, నాలుగు రౌండ్లు ఫైర్ చేసి పిస్టల్‌ను చెక్ చేశారు. ఉదయం 11.30కు గాడ్సే పాత దిల్లీ రైల్వే స్టేషన్‌కు, కర్కరే మద్రాస్ హోటల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు కర్కరే పాత దిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. గాడ్సే, ఆప్టే అక్కడే కలిశారు. సాయంత్రం 4.30కు రైల్వే స్టేషన్ నుంచి ముగ్గురూ టాంగాలో బిర్లా మందిర్‌కు బయల్దేరారు. గాడ్సే బిర్లా మందిర్ వెనుక ఉన్న శివాజీ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆప్టే, కర్కరే అక్కడి నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బిర్లా భవన్‌కు వెళ్లిపోయారు. బిర్లా భవన్ అల్‌బుకర్కూ రోడ్‌లో ఉంది. దాన్ని ఇప్పుడు తీస్ జనవరి మార్గ్ అని పిలుస్తున్నారు.
ప్రస్తుతం 'గాంధీ స్మృతి' అని పిలుస్తున్న బిర్లా భవన్‌లో ప్రార్థనా స్థలం వైపు వెళ్తున్న మహాత్మా గాంధీపై సాయంత్రం 5.10కి గాడ్సే కాల్పులు జరిపారు. గాడ్సేను అక్కడే అరెస్ట్ చేశారు. కానీ ఆప్టే, కర్కరే దిల్లీ నుంచి పారిపోయారు. గాంధీ హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత విచారణ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న, దీనికి సమాధానం అంత కష్టమేం కాదు. గాంధీ హత్య హఠాత్తుగా జరిగింది కాదు. స్వతంత్ర భారతంలో పోలీసుల నిర్లక్ష్యం కథ గాంధీ హత్యతో మొదలైందని మనం చెప్పచ్చు. ఆ నిర్లక్ష్యమే గాంధీ హత్యకు గురయ్యేలా చేసిందని చాలామంది భావిస్తారు. బాపూజీ హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత 1965 మార్చి 22న దానిపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ జీవన్ లాల్ కపూర్ నేతృత్వం వహించారు. దానిని 'కపూర్ కమిటీ విచారణ' అని చెప్పుకుంటారు.
నాథూరాం గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సేతోపాటు విష్ణు కర్కరే, మదన్‌లాల్ పాహ్వా జీవితఖైదు అనుభవించిన తర్వాత 1964 అక్టోబర్ 12న విడుదలయ్యారు. గోపాల్ గాడ్సే, విష్ణు కర్కరే పుణె చేరుకున్నప్పుడు, అందరినీ హీరోల్లా ఘనంగా స్వాగతం పలకాలని వారి స్నేహితులు నిర్ణయించారు. దానికోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నారు. వారు చేసిన పనిని, అంటే గాంధీజీ హత్యలో వారి పాత్ర గురించి ప్రశంసించి, దానిని వేడుకగా నిర్వహించాలని అనుకున్నారు. 1964 నవంబర్ 12న సత్యవినాయక పూజ ఏర్పాటుచేసి, మరాఠీలో అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించారు. దానిపై "దేశభక్తులు విడుదలైన సంతోషంలో ఈ పూజ ఏర్పాటు చేశాం, మీరంతా వచ్చి వారిని అభినందించాలి" అని రాశారు. ఆ కార్యక్రమానికి దాదాపు 200 మంది హాజరయ్యారు. అక్కడ నాథూరాం గాడ్సేను కూడా దేశభక్తుడిగా వర్ణించారు.
ఆ కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మనవడు జీవీ కేత్కర్ అందరూ విస్తుపోయే ప్రకటన చేశారు. తిలక్ ప్రారంభించిన కేసరి, తరుణ్ భారత్ పత్రికలకు ఆయన సంపాదకులుగా ఉన్నారు. హిందూ మహాసభ ఆలోచనావేత్తగా కేత్కర్ ప్రముఖులు. కేత్కర్ ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. పూజ తర్వాత గోపాల్ గాడ్సే, కర్కరే తమ జైలు అనుభవాలను అక్కడ పంచుకున్నారు. ఆ సమయంలో గాంధీ హత్యకు వేసిన పథకం గురించి తనకు ముందే తెలుసని, గాడ్సే స్వయంగా దాని గురించి తనకు చెప్పారని కేత్కర్ అన్నారు.
"కొన్ని వారాల ముందే శివాజీ మందిర్‌లో ఏర్పాటు చేసిన ఒక సభలో గాడ్సే తన ఉద్దేశాన్ని చెప్పాడు. 'నేను 125 ఏళ్ల వరకూ జీవించి ఉంటాను అని గాంధీ అంటున్నారు. కానీ, ఆయన్ను 125 ఏళ్ల వరకూ ఎవరు బతకనిస్తారు?' అన్నాడు. అప్పుడు మాతో బాలుకాకా కనెట్కర్ కూడా ఉన్నారు. గాడ్సే మాటలు విని ఆయన కంగారు పడిపోయారు. మేం కనెట్కర్‌తో నాథ్యా(నాథూరాం)కు నచ్చజెప్పి, అలా చేయకుండా అడ్డుకుంటాం అని చెప్పాం. నేను నాథూరాంను 'నువ్వు గాంధీని చంపాలనుకుంటున్నావా' అని అడిగా. దానికి తను 'అవును, ఎందుకంటే, దేశంలో మరిన్ని సమస్యలకు గాంధీ కారణం కావడం నాకిష్టం లేదు అని చెప్పాడు" అని జీవీ కేత్కర్ అన్నారు. తిలక్ మనవడు కేత్కర్ చేసిన ఆ ప్రకటన పత్రికల ద్వారా దావానలంలా వ్యాపించింది.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దినపత్రిక జీవీ కేత్కర్ ఇంటర్వ్యూను వివరంగా ప్రచురించింది. అందులో నాథూరాం గాడ్సే చిత్రపటానికి మాల వేసి, ఆయన శ్రద్ధాంజలి ఘటించే ఫొటో కూడా ప్రచురించింది. గాడ్సేను దేశభక్తుడుగా వర్ణించారని చెప్పింది. "గాంధీ హత్య పథకం గురించి మూడు నెలల ముందే నాథూరాం గాడ్సే నాకు చెప్పాడు. మదన్‌లాల్ పాహ్వా 1948 జనవరి 20న గాంధీ ప్రార్థనా సభలో బాంబు వేసిన తర్వాత బడ్గే పుణెలో నా దగ్గరికి వచ్చాడు. వారి భవిష్యత్ పథకం గురించి నాకు చెప్పాడు. గాంధీజీ హత్య జరగబోతోందని నాకు తెలుసు. దాని గురించి ఎవరికీ చెప్పొద్దని గోపాల్ గాడ్సే నాతో అన్నాడు" అని 1964 నవంబర్ 14న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన జీవీ కేత్కర్ చెప్పారు.
ఆ తర్వాత కేత్కర్‌ను అరెస్ట్ చేశారు. గోపాల్ గాడ్సేను కూడా మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత గాంధీ హత్యపై కపూర్ కమిషన్ ఏర్పాటుచేశారు. గాంధీ హత్యకు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని, దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, అందులో ఇంకా ఎవరెవరు ఉన్నారో బయటపెట్టాలని చెప్పారు.
గాంధీ హత్యకు తక్షణ కారణం
1948 జనవరి 13న మధ్యాహ్నం సుమారు 12 గంటలకు గాంధీజీ రెండు డిమాండ్లతో నిరాహార దీక్షలో కూర్చున్నారు. మొదటి డిమాండ్ పాకిస్తాన్‌కు భారత్ రూ.55 కోట్లు ఇవ్వాలి. రెండోది దిల్లీలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆగాలి. గాంధీ నిరాహార దీక్ష మూడో రోజు అంటే జనవరి 15న భారత ప్రభుత్వం తక్షణం పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అతివాద హిందువులకు, ముఖ్యంగా హిందూ మహాసభకు గాంధీపై చాలా కోపం తెప్పించింది. మహాత్మా గాంధీ నిరాహార దీక్ష ముగించారు. ప్రార్థన తర్వాత ఆయన తన ప్రసంగంలో "ముస్లింలను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టకూడదు. ముస్లింలు బలవంతంగా తమ ఇల్లూవాకిలి వదిలి వెళ్లేలా, హిందూ శరణార్థులు ఎలాంటి హింసకూ పాల్పడకూడదు" అన్నారు.
అయితే, బాపూజీ నిరశన దీక్ష ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇప్పించడం కాదని, మతపరమైన అల్లర్లు ఆగేలా, సద్భావన నెలకొనేలా చేయడమేనని తుషార్ గాంధీ అంటారు. "అక్కడ పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారనేది స్పష్టం. కానీ, మత సామరస్యం నెలకొనాలని కూడా ఆయన కోరుకున్నారు" అని తుషార్ చెప్పారు.
"రెండు దేశాల మధ్య సమస్యలు సమసిపోయేవరకూ పాకిస్తాన్‌కు భారత్ రూ.55 కోట్లు ఇవ్వకూడదు అనేది క్యాబినెట్ నిర్ణయం. అయితే, భారత్ పాకిస్తాన్‌కు బేషరతుగా రూ.75 కోట్లు ఇవ్వాలని విభజన తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. వాటిలో, పాకిస్తాన్‌కు రూ.20 కోట్లు అందాయి. మిగతా రూ.55 కోట్లు బకాయి ఉంది. పాకిస్తాన్ ఆ డబ్బు అడగడం మొదలుపెట్టింది. భారత్ ఆ మాట తప్పకూడదు. అందుకే, బాపూజీ 'ఇచ్చిన మాటను తప్పకూడదు. అలా జరిగితే, అది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అన్నారు" అని తుషార్ గాంధీ చెప్పారు.
గాంధీ నిరాహార దీక్ష చేసిన రెండు రోజులకే పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆగ్రహంతో ఉన్న అతివాద హిందువుల దృష్టిలో గాంధీ విలన్ అయిపోయారు. సర్దార్ పటేల్ కూడా రూ.55 కోట్లు ఇవ్వాలన్న గాంధీ మాటతో ఏకీభవించలేదు. కపూర్ కమిషన్ విచారణలో సర్దార్ పటేల్ కుమార్తె మణిబెన్ పటేల్ 79వ సాక్షిగా హాజరయ్యారు. "పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న గాంధీ వాదనతో మా నాన్న ఏకీభవించలేదనే విషయం నాకు గుర్తుంది. పాకిస్తాన్‌కు ఆ మొత్తం ఇస్తే, ప్రజలు ఆగ్రహిస్తారని, పాకిస్తాన్‌తో జరిగిన చర్చల ప్రకారం, అన్ని సమస్యలూ పరిష్కరించిన తర్వాతే ఆ మొత్తం ఇవ్వాలని మా నాన్న భావించేవారు" అని కపూర్ కమిషన్‌తో మణిబెన్ చెప్పారు.
"పాకిస్తాన్‌కు ఆ మొత్తం ఇస్తే భారత ప్రజలు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారని, పాకిస్తాన్ ఆ డబ్బును మనకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని, అలా జరిగితే మన దేశ ప్రజల భావాలకు విఘాతం కలుగుతుందని మా నాన్న చెప్పేవారు". "ఈ నిరాహారదీక్షను ప్రజలు సరిగా అర్థం చేసుకోరని రూ.55 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీనిని మీరు ఆయుధంలా ఉపయోగించారని అనుకుంటారు అని మా నాన్న గాంధీతో చెప్పారు" అని కూడా ఆమె తెలిపారు. తుషార్ గాంధీ మాత్రం పటేల్ రూ.55 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదని, ఆయన ప్రజల సెంటిమెంటే ముఖ్యం అనుకున్నారని చెప్పారు.
"ఏది తప్పు, ఏది ఒప్పు అనే దాన్ని బట్టి బాపూ నిర్ణయాలు తీసుకునేవారు. ఆయనకు మానవత్వం అనేది అన్నిటికంటే ముఖ్యం. మాటతప్పడాన్ని ఆయన భరించలేరు. ప్రజల సెంటిమెంట్ అనే ఒత్తిడితో తప్పుడు నిర్ణయాలను సమర్థించరు. బాపూ భారత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే చెప్పారు. నెహ్రూ, పటేల్ ఎన్నికల రాజకీయాలు చేశారు. కానీ బాపూ స్వతంత్రం తర్వాత కూడా తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన ప్రజల సెంటిమెంటుకు, చావుకు భయపడేవారు కాదు" అంటారు తుషార్ గాంధీ. మహాత్మా గాంధీ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు బిర్లా భవన్‌లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. పాక్‌కు డబ్బు ఇచ్చేలా ప్రభుత్వంపై ఆయన ఒత్తిడి తెస్తున్నారని, దిల్లీలో ఉన్న ఇళ్లను హిందూ శరణార్థులు ఆక్రమించుకోకుండా అడ్డుకుంటున్నారని వారు కోపంతో ఉన్నారు.
దిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలతో ముస్లింలు తమ ఇళ్లు, ఆస్తులు వదిలి వెళ్లిపోయారు. వారిని పురానా ఖిలా, హుమయూన్ ఖిలాలో ఉంచారు. హిందూ శరణార్థులు ముస్లింల ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటుంటే, గాంధీ దానిని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. గాంధీ చేస్తున్న దీక్షను వ్యతిరేకించిన హిందూ శరణార్థులు కూడా "గాంధీ చస్తే, చావనివ్వండి" అని కోపంగా నినాదాలు చేస్తున్నారు. "ఈ నిరాహార దీక్ష దిల్లీలోని హిందూ, ముస్లింల మధ్య శత్రుత్వం తగ్గడానికి చాలా సాయం చేసింది" అని మహాత్మా గాంధీకి జీవితాంతం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ప్యారేలాల్ తన 'మహాత్మా గాంధీ ద లాస్ట్ ఫేజ్' పుస్తకంలో రాశారు.
1948 జనవరి 18న ఒక శాంతి కమిటీ ఏర్పాటైంది. మహరౌలీలో సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకీ ఉర్సును ప్రతి ఏటాలాగే నిర్వహిస్తామని, ముస్లింలు దిల్లీలోని తమ ఇళ్లలోకి వెళ్లవచ్చని, హిందువులు, సిక్కుల ఆక్రమణ నుంచి మసీదులను విడిపిస్తామని, అక్రమ కబ్జాల నుంచి ముస్లింల ప్రాంతాలను విడిపిస్తామని, ఇళ్ల నుంచి భయపడి వెళ్లిపోయిన ముస్లింలు తిరిగి రావడానికి హిందువుల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆ కమిటీ మహాత్మా గాంధీకి హామీ ఇచ్చింది. కమిటీ హామీలతో జనవరి 18న మధ్యాహ్నం 12.45కు మౌలానా ఆజాద్ ఇచ్చిన నారింజ రసం తాగిన మహాత్మా గాంధీ తన నిరాహార దీక్షను విరమించారు.
ఆ తర్వాత హిందూ మహాసభ వేదిక ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఇవ్వడం, హిందూ శరణార్థులను ముస్లింల ఇళ్లలోకి వెళ్లనివ్వకపోవడాన్ని విమర్శించారు. గాంధీని తిట్టారు. ఆయన్ను నియంతగా వర్ణించారు. హిట్లర్‌తో పోల్చారు. జనవరి 19న హిందూ మహాసభ కార్యదర్శి అశుతోష్ లాహిడి హిందువులను ఉద్దేశించి ఒక పత్రం విడుదల చేశారు. ముస్లింల హక్కుల రక్షణ గురించి మహాత్మా గాంధీ దీక్ష చేయడంపై సిక్కులకు కూడా కోపం వచ్చిందని పోలీసుల రిపోర్టులో ఉంది. హిందువులు, సిక్కుల కోసం గాంధీ ఏం చేయడం లేదని వారికి కూడా అనిపించింది అని అందులో చెప్పారు.
మరోవైపు, జనవరి 19న, 23న రెండు ప్రస్తావనల్లో గాంధీ తమకు నిస్వార్థ సేవలు అందించారని ముస్లింలు చెప్పినట్లు పోలీసుల రిపోర్టులో రాశారు. గాంధీ హత్యకు అప్పటికప్పుడు జరిగిన ఘటనలే కారణం అయ్యాయి. జనవరి 17- 19 మధ్య గాంధీ హత్యకు పథకం వేశారు, హత్య చేసేవారు రైళ్లు, విమానాలలో దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలోని హోటళ్లలో, హిందూ మహాసభలో బస చేశారు. కుట్రపన్నిన వారిలో కొందరు బిర్లా భవన్‌లో 1948 జనవరి 18న సాయంత్రం 5 గంటలకు మహాత్మా గాంధీ ప్రార్థనా సభలో పాల్గొన్నారు. అక్కడున్న జనం, ఆ ప్రాంతాన్ని గమనించడానికి వారక్కడికి వచ్చారు.
జనవరి 19న హిందూ మహాసభలో వారు సమావేశమయ్యారు. మహాత్మా గాంధీ హత్యకు పూర్తి పథకం సిద్ధమైంది. ఆరోజు మొత్తం ఏడుగురిలో ముగ్గురు.. నాథూరాం వినాయక్ గాడ్సే, విష్ణు కర్కరే, నారాయణ్ ఆప్టే.. బిర్లా హౌస్ వెళ్లారు. ప్రార్థన సభ ప్రాంతంలో రెక్కీ చేశారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మళ్లీ అక్కడకు వెళ్లారు. రాత్రి పది గంటలకు ఐదుగురూ హిందూ మహాసభలో కలిశారు. జనవరి 20న నాథూరాం గాడ్సే ఆరోగ్యం పాడైంది. కానీ నలుగురూ మళ్లీ బిర్లా భవన్‌కు వెళ్లి అక్కడ జరిగేవి చూశారు. తిరిగి ఉదయం 10.30కు హిందూ మహాసభ భవన్‌కు వచ్చారు. తర్వాత ఆ భవనం వెనుకున్న అడవిలో తమ రివాల్వర్లను పరీక్షించారు. తర్వాత ఫైనల్ ప్లాన్ సెట్ చేయడానికి అందరూ దిల్లీలోని కనాట్ ప్లేస్‌లో ఉన్న మరీనా హోటల్లో కలిశారు. సాయంత్రం 4.45కు బిర్లా భవన్ చేరుకున్నారు. అక్కడ గోడ వెనుక నుంచి మదన్‌లాల్ పాహ్వా ప్రార్థన సభపై బాంబు విసిరారు.
మదన్‌లాల్‌ను అప్పటికప్పుడే అరెస్టు చేశారు. ఆయన దగ్గరున్న హాండ్ గ్రెనేడ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు, మిగతా ముగ్గురూ ప్రార్థన సభలో ఉన్నారు. జనంలో కలిసిపోయి వారు పారిపోయారు. బాపూను చంపడానికి అసలు కుట్ర జనవరి 20నే జరిగిందని, కానీ ఆరోజు వారు విఫలం అయ్యారని, తర్వాత పది రోజులకు గాంధీ జీవితంలో చివరి రోజు వచ్చిందని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ చెప్పారు. "బాంబు పేలుడుతో జనంలో కలకలం రేగగానే దిగంబర్ బడ్గే గాంధీపై కాల్పులు జరపాలనేది వారి ప్లాన్. కానీ మదన్‌లాల్ పాహ్వా బాంబు వేసినా, గాంధీ అందరికీ నచ్చజెప్పి కూర్చోపెట్టేశారు. దాంతో అక్కడ కలకలం ఏర్పడలేదు. దాంతో, దిగంబర్ బడ్గేకు కాల్పులు జరిపే అవకాశం రాలేదు. ఆయన అక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది. జనవరి 20న వారి పథకం విజయవంతం అయ్యుంటే గాడ్సేకు బదులు దిగంబర్ బడ్గే గాంధీ హంతకుడు అయ్యుండేవారు" అని ఈ హత్య గురించి పరిశోధన చేసిన తుషార్ గాంధీ బీబీసీతో చెప్పారు.
హత్యలో ఇద్దరు ప్రధాన దోషులు నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే అదే రోజు దిల్లీ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి అలహాబాద్, కాన్పూర్ మీదుగా పారిపోయి జనవరి 23 సాయంత్రం బాంబే చేరుకున్నారు. నాథూరాం తమ్ముడు గోపాల్ గాడ్సే ఆ రాత్రి దిల్లీలోని ఫ్రంటియర్ హిందూ హోటల్లో ఉన్నారు. జనవరి 21న ఉదయం ఆయన ఫ్రంటియర్ మెయిల్లో బాంబే వెళ్లారు. విష్ణు కర్కరే జనవరి 23న మధ్యాహ్నం వరకూ దిల్లీలో ఉండి, తర్వాత రైళ్లు, బస్సులు మారుతూ జనవరి 26 ఉదయం కల్యాణ్ చేరారు. దిగంబర్ బడ్గే, శంకర్ కిస్టయ్య జనవరి 20న బాంబే ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి 22 ఉదయం కల్యాణ్ చేరారు. అదే రోజు పుణె వెళ్లిపోయారు. అలా హత్యలో ప్రమేయం ఉన్న వారందరూ దిల్లీ నుంచి పారిపోవడం ఎవరికీ అంతుపట్టలేదు.
పోలీసుల చారిత్రక నిర్లక్ష్యం
జనవరి 20న బాంబు విసిరిన వార్త తర్వాత రోజు పత్రికల్లో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, ద స్టేట్స్‌మన్, బాంబే క్రానికల్‌లలో ఆ వార్తను బ్యానరుగా ప్రచురించారు. "బాంబు చాలా శక్తిమంతమైనది, ఆ పేలుడులో చాలామంది చనిపోయుండేవారు. ఆ హాండ్ గ్రెనేడ్‌ను మహాత్మా గాంధీని చంపడానికి తెచ్చారు" అని అప్పుడు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. మదన్‌లాల్ పాహ్వా బాంబు వేసినట్లు తన నేరాన్ని ఒప్పుకున్నారని, మహాత్మా గాంధీ శాంతి ఉద్యమంతో తనకు కోపం వచ్చిందని, అందుకే దాడి చేశానని చెప్పినట్లు బాంబే క్రానికల్ రాసింది. మదన్‌లాల్ పాహ్వాను మొదట బిర్లా భవన్‌లోనే విచారించారు. తర్వాత పార్లమెంట్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. పాహ్వా వాంగ్మూలం ఆ తర్వాత వివాదమైంది. ఆయన కర్కరే పేరు, మిగతా సహచరులు దిల్లీలో ఎక్కడ బస చేశారో కూడా చెప్పారు. దాంతో, మరీనా హోటల్లో, హిందూ మహసభలో తనిఖీలు జరిగాయి. గాడ్సే, ఆప్టే పేర్లు మార్చుకుని అక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసింది.
పోలీసుల దాడుల్లో హిందూ మహాసభ నుంచి కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. జనవరి 21న పాహ్వాను 15 రోజుల రిమాండుకు పంపించారు. పార్లమెంట్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి పాహ్వాను సివిల్ లైన్స్‌కు తీసుకొచ్చి జనవరి 24 వరకూ విచారించారు. ఆయన తన వాంగ్మూలంలో 'హిందూ రాష్ట్ర' వార్తా పత్రిక యజమాని పేరు కూడా చెప్పారు. కానీ 'అగ్రణి' వార్తాపత్రిక సంపాదకుడైన నాథూరాం గాడ్సే, దాని యజమాని నారాయణ్ ఆప్టేల పేర్లు చెప్పలేదు. జనవరి 23న మరీనా హోటల్ ఉద్యోగి ఒకరు పోలీసులకు కొన్ని బట్టలు అప్పగించాడు. కానీ పోలీసులు వాటిని దర్యాప్తుకు ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారు. జనవరి 25న పాహ్వాను పోలీసులు బాంబే తీసుకొచ్చారు. జనవరి 29 వరకూ విచారించారు. కానీ దానివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లభించలేదు.
జనవరి 27న గాడ్సే, ఆప్టే మళ్లీ బాంబే నుంచి దిల్లీ బయల్దేరారు. ఇద్దరూ రైల్లో గ్వాలియర్ వచ్చారు. రాత్రి డాక్టర్ దత్తాత్రేయ పర్చురే ఇంట్లో ఉన్నారు. తర్వాత రోజు అక్కడే ఇటలీలో తయారైన నల్ల రంగు ఆటోమేటిక్ బరేటా మౌజర్ పిస్టల్ కొన్నారు. జనవరి 29న ఉదయం దిల్లీ వచ్చారు. ఇద్దరూ దిల్లీ ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఉన్న గదిలోనే ఉన్నారు. కర్కరేను అక్కడే కలిశారు. జనవరి 30న వారు బిర్లా భవన్ వెనుక అడవిలో పిస్టల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. సాయంత్రం 5 గంటలకు బాపూజీని కాల్చి చంపారు. నాథూరాం గాడ్సే అక్కడే అరెస్ట్ అయ్యారు. కానీ ఆప్టే, కర్కరే మరోసారి దిల్లీ నుంచి పారిపోయారు. ఆప్టే, కర్కరే ఫిబ్రవరి 14న అరెస్ట్ అయ్యారు.
హోం మంత్రి పటేల్‌పై ఆరోపణలు
పోలీసులు 1948లో జనవరి 20-30 మధ్య తీవ్ర నిర్లక్ష్యం చేశారని, మదన్‌లాల్ పాహ్వా అరెస్టు తర్వాత దిల్లీ పోలీసుల దగ్గర గాంధీ హత్య కుట్రకు సంబంధించి తగిన సమాచారం ఉందని జడ్జి ఆత్మాచరణ్ తన తీర్పు తర్వాత చెప్పారు. "మదన్‌లాల్ పాహ్వా కుట్ర గురించి చాలా వివరాలు చెప్పారు. రుయియా కాలేజ్ ప్రొఫెసర్ జీసీ జైన్ బాంబే ప్రెసిడెన్సీ హోం మంత్రి మొరార్జీ దేశాయ్‌కు ఈ కుట్ర గురించి చెప్పారు. ఆయన కూడా బాంబే పోలీసులకు మొత్తం సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. పోలీసులు తగిన చర్యలు తీసుకునుంటే, బహుశా గాంధీజీ హత్య జరిగుండేది కాదు" అని జడ్జి ఆత్మాచరణ్ అన్నారు. అయినా, ఏ పోలీసు అధికారుల పైనా దర్యాప్తు జరగలేదు.
"సావర్కర్ సాయం, భాగస్వామ్యం లేకుండా గాంధీ హత్య కుట్ర ఎప్పటికీ సఫలం అయ్యేది కాదు అనేదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను" అని మహాత్మా గాంధీ హత్య కేసు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జంషేద్ దొరాబ్ నాగర్‌వాలా రిటైరైన తర్వాత చెప్పారని తుషార్ గాంధీ తన పుస్తకం (లెట్స్ కిల్ గాంధీ, పేజీ-691)లో రాశారు. సర్దార్ పటేల్ దేశ హోంమంత్రిగా ఉన్నారు. దాంతో, ఆయన కూడా ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నారు. "ఒక హోంమంత్రిగా గాంధీ హత్యలో తన బాధ్యతల నుంచి సర్దార్ పటేల్ తప్పించుకోలేరు అని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు" అని మౌలానా ఆజాద్ రాశారు (ఇండియా విన్స్ ఫ్రీడం, పేజీ-223)
తన తండ్రిని ముస్లిం వ్యతిరేకిలా చూసేవారని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉండేదని, ఆయన్ను చంపుతామని ఇంటికి బెదిరింపులు కూడా వచ్చేవని కపూర్ కమిషన్ ముందు సాక్షిగా హాజరైన సర్దార్ పటేల్ కుమార్తె మణిబెన్ పటేల్ చెప్పారు. గాంధీ హత్యకు తన తండ్రే బాధ్యుడు అని జయప్రకాశ్ నారాయణ్ బహిరంగంగా చెప్పారని కమిషన్‌తో మణిబెన్ అన్నారు. గాంధీ హత్యకు తన తండ్రి బాధ్యుడని జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన ఆ సభలో, మౌలానా ఆజాద్ కూడా ఉన్నారని, కానీ ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అది తన తండ్రిని చాలా బాధించిందని ఆమె చెప్పారు.
"మా నాన్న పాకిస్తాన్‌కు డబ్బు ఇవ్వడం గురించి చాలా బాధపడ్డారు. అది ఇవ్వడం వల్లే బాపు హత్య జరిగిందని ఆయనకు అనిపించింది. నెహ్రూ కూడా ఆ మొత్తం ఇవ్వడానికి అనుకూలంగా లేరు. అప్పుడు, సర్దార్ పటేల్.. నెహ్రూను కలిసి, తనకు క్యాబినెట్ నుంచి సెలవిప్పించాలని, మౌలానాకు కూడా నేను ఉండడం ఇష్టం లేదు అని చెప్పారు" అని మణిబెన్ వివరించారు.
గాంధీ హత్య తర్వాత నెహ్రూ పటేల్‌కు ఒక లేఖ రాశారు.
ఆ లేఖలో వివరాలను మణిబెన్ వివరించారు. "మనం గతం మర్చిపోయి కలిసి పనిచేస్తే బాగుంటుంది అని నెహ్రూ లేఖ రాశారు. దానికి సర్దార్ అంగీకరించారు. కానీ, జయప్రకాశ్ నారాయణ్ పటేల్‌పై దాడి కొనసాగించారు. 1948 మార్చి 5న సర్దార్ పటేల్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పుడు ఆయన 'నేను చనిపోవాలి, గాంధీజీ దగ్గరకు వెళ్లాలి, కానీ ఆయన ఒంటరిగా వెళ్లిపోయారు' అన్నారు" అని చెప్పారు. గాంధీ హత్యకు వారం తర్వాత అంటే ఫిబ్రవరి 6న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. సర్దార్ పటేల్‌ను ఎంపీలు ఎన్నో కఠిన ప్రశ్నలు అడిగారు.
"అరెస్టైన తర్వాత మదన్‌లాల్ పాహ్వా తన నేరం ఒప్పుకున్నారు. తర్వాత తాము అమలు చేయబోయే పథకం గురించి, అందులో ఎవరెవరున్నారో కూడా చెప్పారు. అయినా, దిల్లీ సీఐడీ బాంబే నుంచి వారి ఫొటోలు సేకరించలేకపోయింది. వారి ఫొటోలను ప్రార్థన సభలో అందరికీ పంచి ఉంటే, జనం అప్రమత్తం అయ్యేవారు. అందులో నిర్లక్ష్యం జరగలేదంటారా?" అని తేజ్ పత్రిక వ్యవస్థాపకుడు, ఎంపీ దేశబంధు గుప్తా.. సర్దార్ పటేల్‌ను అడిగారు. జవాబుగా "దిల్లీ పోలీసులు వారిని పట్టుకోడానికి ప్రయత్నించారు. కానీ అందరూ వేరువేరు ప్రాంతాల్లో ఉన్నారు. వారి ఫొటోలు కూడా దొరకలేదు" అని పటేల్ చెప్పారు.
మహాత్మా గాంధీ కార్యదర్శిగా ఉన్న ప్యారేలాల్ విచారణలో 54వ సాక్షిగా ఉన్నారు. "విభజన తర్వాత పటేల్, గాంధీ మధ్య విభేదాలు వచ్చాయని, కానీ గాంధీ పట్ల ఆయన మనసులో గౌరవం ఏమాత్రం తగ్గలేదు" అని ఆయన చెప్పారు. "ముస్లింలు ఇక్కడే ఉండవచ్చు, వారికి రక్షణ కూడా కల్పిస్తాం, కానీ వారి దేశభక్తిని భారత్, పాకిస్తాన్ మధ్య విభజించలేం" అని పటేల్ అన్నట్లు ప్యారేలాల్ చెప్పారు. బాపూ భద్రత గురించి తన తండ్రి సర్దార్ పటేల్ చాలా ఆందోళన చెందేవారని, ఆయనపై అప్పటికే దాడులు జరగడం దానికి కారణం అని మణిబెన్ పటేల్ చెప్పారు. "ప్రార్థన సభకు వచ్చేవారిని, పూర్తిగా తనిఖీలు చేశాకే, లోపలికి అనుమతిస్తామని మా నాన్న గాంధీ దగ్గరకు వెళ్లి చెప్పారు. కానీ గాంధీ దానికి ఒప్పుకోలేదు" అని ఆమె చెప్పారు.
గాంధీ హత్య, ఆర్ఎస్ఎస్
గాంధీ హత్యలో తమకు ఎలాంటి పాత్రా లేదని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ చెబుతూనే వస్తోంది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కూడా వేసింది. కానీ అదంత సాదాసీదా విషయం కాదు. గాంధీ హత్య తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై నిషేధం విధించిన పటేల్.. "గాంధీ హత్యకు ఆ మతపరమైన విషమే కారణం. అది దానిని దేశమంతా వ్యాపించేలా చేసింది" అన్నారు. "శుభవార్త కోసం శుక్రవారం రేడియో వింటూ ఉండండి అని కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ సభ్యులకు ముందే సమాచారం అందింది. అంతే కాదు, చాలా ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ సభ్యులు స్వీట్లు కూడా పంచుకున్నారు" అని గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ తన పుస్తకం (గాంధీ ద లాస్ట్ ఫేజ్, పేజీ-70)లో రాశారు.
గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తర్వాత, 1970 జనవరి 11న ఆర్ఎస్ఎస్ తన పత్రిక 'ఆర్గనైజర్' సంపాదకీయంలో "నెహ్రూ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండడం, గాంధీజీ నిరాహార దీక్షకు దిగడం ప్రజలకు చాలా కోపం తెప్పించింది. అలాంటి పరిస్థితుల్లో నాథూరాం గాడ్సే ప్రజలకు ప్రాతినిథ్యం వహించారు. గాంధీ హత్య జనాక్రోశానికి నిదర్శనం" అని రాసింది.
"గాంధీ హత్యకు ఒక వ్యక్తి బాధ్యుడు కాడు, దాని వెనుక ఒక పెద్ద కుట్ర, సంస్థ ఉన్నాయి" అని సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా, కమలాదేవీ చటోపాధ్యాయ ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో అనడాన్ని కూడా కపూర్ కమిటీ తన రిపోర్టులో ప్రస్తావించింది. ఆ సంస్థల్లో వారు ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ పేర్లు కూడా చెప్పారు. గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించారు. అది 1948 ఫిబ్రవరి నుంచి 1949 జులై వరకూ ఉంది.
"నాథూరాం, దత్తాత్రేయ్, నేను, గోవింద్ అందరం ఆర్ఎస్ఎస్‌లో ఉండేవాళ్లం. మా ఇళ్లకు బదులు, మేమంతా ఆర్ఎస్ఎస్‌లోనే పెరిగామని మీరు అనచ్చు. మాకు ఆర్ఎస్ఎస్ ఒక కుటుంబం లాంటిది. నాథూరాం ఆర్ఎస్ఎస్‌లో బౌద్ధిక్ కార్యవాహ్ (మేధో సంరక్షకుడు). తాను ఆర్ఎస్ఎస్‌ను వదిలేశానని ఆయన చెప్పారు. అలా చెప్పకపోతే, గోల్వాల్కర్, ఆర్ఎస్ఎస్‌ను గాంధీ హత్య తర్వాత కష్టాలు చుట్టుముడతాయి. కానీ, నాథూరాం ఆర్ఎస్ఎస్‌ను వీడలేదు" అని నాథూరాం గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే 1994 జనవరి 28న ఫ్రంట్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నాథూరాం గాడ్సేకు ఆర్ఎస్ఎస్‌తో ఉన్న సంబంధాలను అడ్వాణీ తోసిపుచ్చారు కదా అని అదే ఇంటర్వ్యూలో గోపాల్ గాడ్సేను అడిగారు.
సమాధానంగా "ఆయన పిరికి మాటలు మాట్లాడుతున్నారు. 'వెళ్లండి, గాంధీని హత్య చేయండి' అని ఆర్ఎస్ఎస్ ఎలాంటి తీర్మానం చేయలేదని మీరు చెప్పవచ్చు. కానీ నాథూరాంకు ఆర్ఎస్ఎస్‌తో ఉన్న సంబంధాలను మీరు కొట్టిపారేయలేరు. హిందూ మహాసభ అలా చెప్పలేదు. బౌద్ధిక్ కార్యవాహ్‌గా ఉంటూనే నాథూరాం 1944లో హిందూ మహాసభ కోసం పనిచేయడం ప్రారంభించ