పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

మంగళవారం, 24 డిశెంబరు 2019 (12:59 IST)
కర్టెసీ- దిలీపిన్ రామకృష్ణన్
స్వాతంత్ర్యానికి మునుపు, స్వాతంత్ర్యానంతర భారతదేశంలో తమిళనాడుపై చెరిగిపోని ముద్ర వేసిన పెరియార్ ఎవరు? ఒక బీజేపీ నేత త్రిపురలో కమ్యూనిస్టు పార్టీ పాలన అంతం కావడంతో అక్కడ లెనిన్ విగ్రహం పడగొట్టినట్లే తమిళనాట పెరియార్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తామని ఎందుకు అన్నారు?

 
తమిళనాడు రాజకీయాలు, సాంస్కృతిక జీవితంపై పెరియార్ (గొప్ప వ్యక్తి)గా సుపరిచితులైన ఈవీ రామస్వామి ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేం. కమ్యూనిస్టు నుంచి దళిత ఉద్యమం వరకు తమిళనాడులోని జాతీయవాదుల నుంచి హేతువాదుల వరకు అన్ని భావజాలాలకు సంబంధించిన వారు ఆయనను గౌరవిస్తారు. తమ ప్రసంగాలలో ఆయన మాటలను కోట్ చేస్తారు. ఆయన నుంచి స్ఫూర్తిని పొందుతారు.

 
హేతువాది, నాస్తికుడు, పీడిత ప్రజల తరపున పోరాటం చేసిన పెరియార్ సామాజిక, రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. ఆయన 1919లో గాంధేయవాదిగా, కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మద్యపాన నిషేధం, అంటరానితనం నిర్మూలన లాంటి గాంధీ విధానాల పట్ల ఆకర్షితులయ్యారు. తన భార్య నాగమ్మాయ్, సోదరి బాలాంబాల్ కూడా రాజకీయాల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. వారిద్దరూ కల్లు దుకాణాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాటం చేశారు. కల్లు-వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆయన తన సొంత కొబ్బరి తోటనే నాశనం చేశారు.

 
సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీ యూనిట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1924లో, కేరళలో దళితులు ఆలయాలకు దారి తీసే దారుల్లో నడవకూడదన్న ట్రావెంకోర్ మహరాజు ఆదేశాలకు నిరసనగా ఒక ప్రదర్శన జరిగింది. దానిని నిర్వహిస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు. దాంతో ఆ నిరసనలకు నేతృత్వం వహించేవారు లేకపోయారు.

 
ఆ పోరాటానికి నేతృత్వం వహించాలని కేరళ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. దీంతో ఆ పోరాటంలో పాల్గొనేందుకు పెరియార్ గాంధీజీ మాటను కాదని మద్రాస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కేరళకు బయలుదేరారు. రాజుగారు ఆయన స్నేహితుడు అవడం చేత ఆయన ట్రావెంకోర్ చేరగానే, ప్రభుత్వ మర్యాదలతో ఆహ్వానం పలికారు. కానీ తాను రాజుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడానికి రావడం వల్ల ఆయన వాటిని తిరస్కరించారు.

 
అయితే రాజాజ్ఞకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొనడంతో ఆయనను అరెస్ట్ చేసి, నెలల తరబడి జైలులో పెట్టారు. కాంగ్రెస్‌లో వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు కావాలంటూ ఆయన పెట్టాలనుకున్న తీర్మానం పలుమార్లు విఫలమైంది. ఈలోపు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయంతో, చెరన్మాదేవి పట్టణంలో వీవీ సుబ్రహ్మణియ అయ్యర్ నిర్వహిస్తున్న ఒక పాఠశాలలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులకు ఆహారం వడ్డించే విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయనకు సమాచారం అందింది. బ్రాహ్మణుడైన అయ్యర్ అందరినీ సమానంగా చూడాలని పెరియార్ కోరారు.

 
అయితే అయ్యర్ ఆయన మాట వినలేదు. దానికి తోడు కాంగ్రెస్ కూడా ఆ పాఠశాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఆపలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక ఆయన ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రాహ్మణేతరులలో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం ఈ ఉద్యమ లక్ష్యం.
 
బ్రాహ్మణులు ఆర్య జాతికి చెందిన వారన్న వాదనకు వ్యతిరేకంగా ఆయన బ్రాహ్మణేతరులకు ద్రవిడ జాతి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఆయన బ్రాహ్మణ వ్యతిరేక సంస్థ అయిన సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ (జస్టిస్ పార్టీ) అధ్యక్షుడయ్యారు. 1944లో ఆయన ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 'ద్రావిడర్ కళగం' ఏర్పాటు చేశారు. గత అర్ధ శతాబ్ధ కాలంగా తమిళనాడును పాలిస్తున్న పార్టీలన్నీ దాని నుంచి పుట్టినవే.

 
కమ్యూనిస్టు రష్యాలో పర్యటించిన ఆయన, కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులై, కమ్యూనిస్టు మేనిఫెస్టో మొదటి తమిళ అనువాదాన్ని ప్రచురించారు. మహిళల స్వేచ్ఛపై ఎంత ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉండేవంటే, నేటికి కూడా అవి అత్యంత విప్లవాత్మకమైనవి. ఆయన బాల్య వివాహాలను నిరసించారు. వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు.

 
భాగస్వాములను ఎంచుకోవడానికి, విడిచిపెట్టడానికి మహిళలకు స్వేచ్ఛ ఉండాలన్నారు. పిల్లలను కనడమే మహిళల బాధ్యత కాకూడదన్నారు. దానికి అతీతంగా పురోమించాలన్నారు. ఆయన అనుచరులు పెళ్లి కట్టుబాట్లను, మంగళసూత్రం ధరించడాన్ని వ్యతిరేకించేవారు. ఒక మహిళా సదస్సులోనే ఆయనకు 'పెరియార్' అన్న బిరుదు ఇచ్చారు.
 
వైదిక హిందూమతమే నేటి సమాజంలోని మూఢనమ్మకాలకు, వివక్షకు కారణమని ఆయన విశ్వసించారు. వైదిక మతాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంతం చేసేందుకు ఆయన తీవ్రంగా పోరాడారు. దక్షిణాది రాష్ట్రాలు స్వతంత్ర భారతదేశంలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ప్రత్యేక ద్రవిడనాడు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ఇతర రాష్ట్రాలు దీనికి అంగీకరించలేదు.

 
సమాజంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కావాలని ఆయన తీవ్రంగా పోరాడారు. 1937లో తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడాన్ని పెరియార్ వ్యతిరేకించారు. పెరియార్ ఎప్పుడూ ఇలా అనేవారు -''కేవలం నేను చెప్పానని దేనినీ అంగీకరించవద్దు. మీకై మీరు స్వయంగా ఆలోచించండి. అది నిజమని అనిపిస్తేనే దాన్ని అంగీకరించండి.''
 
(డిసెంబర్ 24 పెరియార్ వర్థంతి)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు