ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకొనే పోలవరం ప్రాజెక్ట్ సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. ప్రభుత్వాలు గడువులు పొడిగించుకుంటూ వస్తున్నాయి. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే స్పష్టత మాత్రం రావడం లేదు. 2021 నాటికి పూర్తిచేస్తామని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో పోలవరం పనుల తీరును తెలుసుకొనేందుకు ప్రాజెక్ట్ ప్రాంతంలో బీబీసీ పర్యటించి అందిస్తున్న సవివర కథనం ఇది.
జగన్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచిపోయింది. వివిధ కారణాలతో తొలి ఐదు నెలలు పోలవరం పనులు నిలిచిపోయాయి. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు మూడుసార్లు గోదావరి వరద జలాలతో నిండిపోయింది. నవంబరు 2న పనులు తిరిగి మొదలయ్యాక గత మూడు నెలల్లో ఏ మేరకు జరిగాయన్నది ప్రభుత్వం ఈ నెల 4న సుప్రీంకోర్టుకు సమర్పించిన స్థాయీ నివేదిక చెబుతోంది.
స్థాయీ నివేదిక ప్రకారం- స్పిల్ వే, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ పనులు 1,013.39 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయ్యాయి. అవే పనులు 2019 ఏప్రిల్ నాటికి 989.16 లక్షల క్యూబిక్ మీటర్లు జరిగాయి. ఏప్రిల్ తర్వాత అదనంగా 24 లక్షల క్యూబిక్ మీటర్ల పనులే జరిగాయి.
ఈ గణాంకాలు ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయనే విపక్షాల వాదనను బలపరుస్తున్నాయి. స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో ఎన్నికల నాటికి 30.43 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయ్యింది. స్థాయీ నివేదిక ప్రకారం- ఈ పనులు 30.75 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు జరిగాయి. కాంక్రీట్ పనులూ అదే తీరున సాగుతున్నట్టు కనిపిస్తోంది.