రాయపూర్ వన్డే: న్యూజీలాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం

శనివారం, 21 జనవరి 2023 (23:16 IST)
అత్యంత సులభ సాధ్యమైన విజయ లక్ష్యాన్ని రెండు వికెట్ల నష్టపోయి చేరుకున్న భారత్ జట్టు రెండో వన్డేలో న్యూజీలాండ్ పై విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 20.1 ఓవర్లలో 111 పరుగులు చేసింది. 7 ఫోర్లు, 2 సిక్సులతో అర్ధ సెంచరి చేసిన రోహిత్ శర్మ...50 బంతులలో 51 పరుగుల చేసి అవుటయ్యాడు.
 
రోహిత్ శర్మతోపాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. విరాట్ కోహ్లీ 11 పరుగులకు అవుటయ్యాడు. మూడు వన్డేల ఈ సిరీస్‌లో భారతజట్టు 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డే ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది.
 
పరుగులు చేయలేక తడబడ్డ న్యూజీలాండ్
అంతకు ముందు న్యూజీలాండ్ జట్టు 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి ఆలౌటయింది. భారత బౌలర్ల ధాటికి ఆరంభంలో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయిన న్యూజీలాండ్ జట్టు ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. వికెట్లు కాపాడుకునే క్రమంలో న్యూజీలాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడినా భారత బౌలర్లు వరస స్పెల్స్ లో వికెట్లు తీస్తూ పోయారు. దీంతో న్యూజీలాండ్ జట్టుకు వంద పరుగులు చేయడమే గగమన్నట్లుగా మారింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, వాషింగ్టన్ సుందర్, హార్ధిక్ ప్యాండ్యాలు చెరో 2 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లు తలా ఒక వికెట్ తీసి న్యూజీలాండ్‌ను 108 పరుగులకే కట్టడి చేశారు. న్యూజీలాండ్ బ్యాట్స్‌మన్లలో గ్లెన్ ఫిలిప్(36), మిషెల్ శాంట్నర్ (27), మైఖేల్ బ్రేస్‌వెల్ (22) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు