పాకిస్తాన్‌, భారత్ మధ్య ఆగిన వాణిజ్యం.. ఎవరికి నష్టం?

సోమవారం, 12 ఆగస్టు 2019 (20:37 IST)
భారత్-పాకిస్తాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు ఏర్పడడానికి ముందువరకు రెండు దేశాల మధ్య వాణిజ్యం సాధారణ స్థాయిలోనే జరిగేది. వాఘా సరిహద్దు, పాక్ పాలిత కశ్మీర్‌లోని మార్గాల ద్వారా ఇరుదేశాల మధ్య వివిధ వస్తువుల ఎగుమతులు-దిగుమతులు జరిగేవి. గత సోమవారం, ఆగస్టు 5న భారత్ తీసుకున్న ఆర్టికల్ 370 సవరణ నిర్ణయానికి స్పందనగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో దౌత్య సంబంధాలను పరిమితం చేసింది. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలనూ నిలిపివేయాలని నిర్ణయించింది.

 
అయితే, రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న వాణిజ్య సంబంధాలను పాక్ తెంచుకోవడం వల్ల ఇప్పుడు ఎక్కువ నష్టం ఎవరికి అనే ప్రశ్న వస్తోంది. ఇరుదేశాల మధ్య వ్యాపారం గురించి బాగా తెలిసిన పాక్ వ్యాపారవేత్తలు, అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ రెండు దేశాల వాణిజ్య సంబంధాలు పరిమితంగానే ఉన్నాయని చెబుతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే వాణిజ్య ఎగుమతులు-దిగుమతులు ఆయా దేశాల మొత్తం వాణిజ్యంతో పోలిస్తే చాలా తక్కువని అంటున్నారు.

 
భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్యం విలువెంత?
ప్రపంచ వాణిజ్యాభివృద్ధికి తోడ్పడే అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం(ఐటీసీ) ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఐటీసీ ఒక స్పెషల్ ట్రేడ్ మ్యాప్ తయారు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల మధ్య జరిగే 5,300 వస్తువుల లావాదేవీల నెలవారీ, త్రైమాసిక, వార్షిక వివరాలు ప్రకటిస్తుంది. ఏవైనా రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలకు సంబంధించిన గణాంకాలు కూడా ఇక్కడ పొందవచ్చు.

 
ఐటీసీ గణాంకాల ప్రకారం 2018లో పాకిస్తాన్ నుంచి భారత్ ఎగుమతి అయిన వస్తువుల విలువ 38.3 కోట్ల అమెరికన్ డాలర్లు(అంటే సుమారు రూ. 2,730 కోట్లు). కానీ, అది పాకిస్తాన్ మొత్తం వాణిజ్యంలో రెండు శాతం మాత్రమే. అదే సమయంలో భారత్ నుంచి పాకిస్తాన్ జరిగిన ఎగుమతుల విలువ 2.06 బిలియన్ అమెరికా డాలర్లు ( అంటే సుమారు రూ. 14500 కోట్లు) ఇది భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 0.1 శాతమే.

 
అయితే, రెండు దేశాల మధ్య వాణిజ్యంపై ఆంక్షలు విధించడం వల్ల కొన్ని వస్తువుల కొరత కచ్చితంగా ఏర్పడుతుందని, దానివల్ల కొన్ని పరిశ్రమలకు, వినియోగదారులకు నష్టం కూడా జరుగుతుందని పాకిస్తాన్‌లో వాణిజ్య, ట్రేడ్-కామర్స్ రంగానికి సంబంధించిన అధికారులు చెబుతున్నారు.

 
పత్తి ఎగుమతులు కీలకం
పాకిస్తాన్, భారత్ నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటుంది. కానీ వాటిలో అన్నిటికంటే కీలకమైనది పత్తి. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం గణాంకాల ప్రకారం, 2018లో పాకిస్తాన్ సుమారు 46.6 కోట్ల డాలర్ల(రూ. 3322 కోట్ల) విలువైన పత్తిని భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. 2014 నుంచి 2018 మధ్యలో ఇది 4 శాతం నుంచి పెరిగి పాకిస్తాన్ మొత్తం పత్తి దిగుమతుల్లో 37 శాతానికి చేరుకుంది.

 
దీనిపై బీబీసీతో మాట్లాడిన పాకిస్తాన్-భారత్ బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ నూర్ మహమ్మద్ కసూరి భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి(వస్త్ర పరిశ్రమ)కు చాలా నష్టం జరుగుతుంది" అన్నారు. "పత్తి, వస్త్ర పరిశ్రమకు అవసరమైన చాలా వస్తువులు భారత్‌ నుంచి చాలా సులభంగా, చౌకగా దొరికేవి. భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో ఎక్కువ భాగం టెక్స్ టైల్ ఇండస్ట్రీకి చెందినవే ఉంటాయి" అని చెప్పారు.

 
సిమెంట్, జిప్సమ్, ఖనిజాలు
ఇక పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల విషయానికి వద్దాం. వీటిలో సున్నపురాయి, సిమెంట్, ఉప్పు, సల్ఫర్ ఇతర ఖనిజాలు ఉన్నాయి. వీటికి భారత్ ఒక పెద్ద కొనుగోలుదారు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం గణాంకాల ప్రకారం 2018లో పాకిస్తాన్ నుంచి భారత్‌కు సుమారు 9.6 కోట్ల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 700 కోట్లు) విలువైన ఎగుమతులు జరిగాయి. వీటికి భారత్ ఒక పెద్ద కొనుగోలుదారు.

 
"పాకిస్తాన్‌ పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ ఖనిజాలు అధికంగా దొరుకుతాయి. వీటిని భారత్‌లోని పంజాబ్‌లో ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు" అని పాక్ పంజాబ్ పరిశ్రమల శాఖ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు. భారత్‌కు ఈ ఖనిజాల ఎగుమతి వల్ల పాకిస్తాన్‌లో స్థానిక పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందింది. దీనికి అక్కడ ఒక మార్కెట్ కూడా ఉంది.

 
2014 నుంచి 2018 మధ్యలో పాకిస్తాన్ నుంచి భారత్‌కు ఖనిజాల ఎగుమతులు 17 శాతం పెరిగాయి. అయితే, చైనా పెట్టుబడులతో పాకిస్తాన్ ఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చని పాక్ అధికారులు చెబుతున్నారు.

 
ఆర్గానిక్ కెమికల్ పదార్థాలు
అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం గణాంకాల ప్రకారం పాకిస్తాన్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే ముఖ్యమైన వస్తువుల్లో పత్తి తర్వాత ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి. వీటి విలువ 40.2(సుమారు 3000 కోట్లు) కోట్ల అమెరికన్ డాలర్లకు పైనే. ఇది ఏటా 15 శాతం పెరుగుతోంది. పాకిస్తాన్ ఆర్గానిక్ కెమికల్ అవసరాల్లో 15 శాతం భారత్ ఎగుమతుల వల్లే తీరుతుంది.

 
నూర్ మహమ్మద్ కసూరి వివరాల ప్రకారం "పాకిస్తాన్ భారత్ నుంచి చర్మ పరిశ్రమ, రంగుల పరిశ్రమల కోసం ఇతర రసాయనాలు కూడా దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం ప్రకారం 2018లో పాక్ భారత్ నుంచి 10.8 కోట్ల అమెరికా డాలర్ల(సుమారు 770 కోట్ల విలువచేసే) వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇది పాకిస్తాన్ మొత్తం వస్తువుల దిగుమతుల్లో 21 శాతం. ఇది ఏటా 5 శాతం రేటుతో పెరుగుతూ వస్తోంది".

 
పండ్లు, డ్రై ఫ్రూట్స్
పాకిస్తాన్, భారత్ నుంచి దిగుమతి చేసుకునే వాటిలో సిమెంట్, మినరల్స్ తర్వాత స్థానం పండ్లు, డ్రై ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, పుచ్చకాయలది. 2018లో పాక్ దిగుమతి చేసుకున్న ఈ వస్తువుల విలువ సుమారు 9.3 కోట్ల అమెరికా డాలర్లు( సుమారు 663 కోట్లు). అలాగే పాకిస్తాన్, భారత్‌కు సుమారు 170 కోట్ల విలువచేసే చక్కెర, స్వీట్లు ఎగుమతి చేస్తుంది. 2018లో ఈ ఎగుమతులు 368 శాతం వృద్ధి చెందాయి. కానీ ఇది పాకిస్తాన్ మొత్తం ఎగుమతిలో ఐదు శాతమే ఉంటుంది.

 
కూరగాయలు
వ్యవసాయ దేశం అయిన పాకిస్తాన్ కూరగాయలు, పండ్ల సాగులో స్వయం సమృద్ధి చెందింది. "కానీ ఏడాదిలో కొన్ని నెలలు స్థానిక మార్కెట్ల డిమాండ్, సప్లై ప్రకారం భారత్‌ నుంచి కాలానుగుణంగా పండేవి, ఇతర కూరగాయలను పాక్ దిగుమతి చేసుకుంటుంది" అని అక్కడి నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం గణాంకాల ప్రకారం 2018లో పాక్ భారత్ నుంచి 2.1 కోట్ల అమెరికన్ డాలర్ల(సుమారు 150 కోట్ల) విలువ చేసే కూరగాయలు దిగుమతి చేసుకుంది. అయితే దిగుమతి రేటు 3 శాతం మాత్రమే.

 
పైన ప్రస్తావించిన ఐదు వస్తువులే కాకుండా పాక్-భారత్ మధ్య రబ్బర్, మెడికల్ సామగ్రి, టీ, కాఫీ, రకరకాల నూనెలు, స్టీల్ లాంటి ఎన్నో వస్తువుల వాణిజ్యం జరుగుతుంది. అయినప్పటికీ రెండు దేశాల మధ్య జరిగే మొత్తం వాణిజ్య శాతం తక్కువే.

 
అసలు వాణిజ్యం పెరిగే అవకాశం ఉందా?
"ఒకవేళ ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్ పాక్ మధ్య వాణిజ్యం ఇలాగే కొనసాగి ఉంటే, రాబోవు సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య వ్యాపార విలువ సుమారు 10 నుంచి 20 బిలియన్ డాలర్లకు( 70,000 నుంచి 1,50,000 కోట్ల)కు చేరేది" అని నూర్ మహమ్మద్ కసూరి అన్నారు. "భారత్ శక్తి, వైద్య, విద్య, మౌలిక సదుపాయాల విషయంలో పాకిస్తాన్‌కు సహాయపడవచ్చు. మరోవైపు ఆర్థిక క్షేత్రాల్లో, వాణిజ్యం కోసం పాకిస్తాన్ రవాణా సౌకర్యం కల్పిస్తే, భారత్ ఆసియా దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించవచ్చు" అని ఆయన అన్నారు.

 
పాకిస్తాన్, భారత్ మధ్య వాణిజ్యం ఆగిపోవడం ప్రతీకాత్మకం, రాజకీయం అని మహమ్మద్ కసూరి భావిస్తున్నారు. "అయితే, ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్యం ఎంత తక్కువగా ఉందంటే, దానివల్ల రానున్న మూడు నాలుగు నెలల్లో రెండు దేశాలపైనా పెద్దగా ప్రభావం ఉండదు" అంటారు కసూరి. అయితే, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందేలా తాము, తమ సంస్థల ప్రణాళికలు కొన్ని చర్యలు చేపడుతామని ఆయన కచ్చితంగా చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు