బడ్టెట్ 2017 పేద - మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించనుందా...?

సోమవారం, 23 జనవరి 2017 (19:14 IST)
పెద్ద నోట్ల రద్దుతో కొంత అసౌకర్యానికి గురై ఆగ్రహంతో ఉన్న ప్రజలకు తీపి కబురు అందించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ సమర్పణకు మార్గం సుగమమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అవి పూర్తయ్యేంతవరకూ బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది. వచ్చేనెల 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సామాన్యులు ఊహించని విధంగా ఊరట కలిగించే అంశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యక్ష పన్నుల విషయంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
వ్యక్తిగత ఆదాయపు పన్ను, సెక్షన్ 80సీ పరిమితులు పెంచడంతో పాటు గృహ రుణాలను బడ్జెట్‌లో మరింత చౌక చేసే అవకాశం ఉందని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక ఎకోరాప్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. 
 
దీనిని ఈ బడ్జెట్‌లో రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే గృహ రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ. మూడు లక్షలకు పెంచనున్నారు. దీంతోపాటు సెక్షన్ 80 సీ కింద ఉన్న పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే పన్ను మినహాయింపు కోసం ఫిక్సిడ్ డిపాజిట్ల లాకిన్ వ్యవధిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి