అమెరికాకు చెందిన మానవ వనరులు, సేవల కంపెనీ ఓపీ టన్నర్, తమతో కాంట్రాక్ట్‌ను పునఃప్రారంభించినట్లు మహీంద్ర సత్యం ఢిల్లీలో వెల్లడించింది. అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహీంద్రా సత్యం తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లుతున్న సమయంలో తమ కంపెనీకి ఇంతపెద్ద ఆర్డరు మళ్ళీ రావడం తమ అదృష్టమని, అలాగే గతంలో సత్యం కంపెనీపై వచ్చిన ఆరోపణలదృష్ట్యా తాము ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, మా సామర్థ్యాలపై నమ్మకం ఉంచి మమల్ని ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందని మహీంద్ర సత్యం సీఈఓ సీపీ గుర్నానీ అన్నారు.
తాము ఈ ఒప్పందాన్ని కొనసాగించడం వల్ల గత నాలుగు నెలల్లో వ్యాపారం వంద శాతం వృద్ధి చెందిందని ఆయన అన్నారు. మేనేజర్ ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్ తదితర సేవలను ఓసీ టన్నర్‌కు అందించామని ఆయన వెల్లడించారు.
తాము అందించిన సేవల కారణంగా గడిచిన నాలుగు నెలల్లో మహీంద్ర సత్యం వ్యాపారం వృద్ధిచెందిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఓసీ టన్నర్ ప్రాజెక్ట్ కోసం మహీంద్ర సత్యం ఉద్యోగులు 100 మంది పనిచేస్తున్నారు. టన్నర్ కంపెనీ రెండు సంవత్సరాల క్రితం మూడేళ్ల ప్రాజెక్టుకు మహీంద్ర సత్యంకు ఇచ్చింది.