కరోనా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో బ్యాంకు పనివేళల సమయం కుదించారు. ఈ కుదించిన పనివేళలు శుక్రవారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు అమల్లో వుండనున్నాయి. ఏపీలోని అన్నీ బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్ఎల్బీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ కె. బ్రహ్మానందరెడ్డి ఈ మేరకు వెల్లడించారు.
కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజులో పని గంటలు, వారంలో పనిదినాలు తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల వరకు భౌతిక బ్యాంకింగ్‌ను పరిమితం చేయాలని, ఐదు రోజుల పని వారాన్ని అమల్లోకి తీసుకురావాలని ఫోరం డిమాండ్ చేస్తోంది.
ఇంటి నుండి పని చేయడం, కనీస సిబ్బందితో బ్యాంకింగ్ వ్యవహారాలు రాబోయే నాలుగైదు నెలల్లో నిర్వహించాలని ఫోరం కోరుతోంది. అంతేకాదు, అన్ని బ్యాంక్ శాఖలను తెరవకుండా ఉండటం ద్వారా కస్టమర్లు, ఉద్యోగులు మహమ్మారికి గురికాకుండా హబ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాలని ఫోరం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకు వేళలను కుదించారు.