దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 20 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. దీంతో కరోనా లాక్డౌన్ ఆంక్షలను గణనీయంగా సడలిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో రైల్వేశాఖ కూడా కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులను పునరుద్ధరించాలన్న భావనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా, గతంలోని పలు నిబంధనలను సడలిస్తూ, మరిన్ని రైళ్లు నడిపే దిశగా యోచిస్తోంది. దీనికితోడు ప్రస్తుతం రైలు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ పలు నిర్ణయాలు తీసుకోనుంది. కొన్నిమార్గాల్లో కొత్త రైళ్లను నడపడంతోపాటు, ప్రయాణికుల సంఖ్యను పెంచాలని భావిస్తోంది.
కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,375 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,40,470కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 214 మంది కన్నుమూశారు. దేశంలో కరోనా రికవరి రేటు అత్యధిక స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు.