ఏటీఎంకి వెళ్తున్నారా...? జర జాగ్రత్త!

గురువారం, 14 మార్చి 2019 (13:49 IST)
భారతీయ రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని బ్యాంకులూ ఈఎంవీ చిప్ కలిగి ఉండే డెబిట్ కార్డులను జారీ చేసేసాయి. ఇప్పటికీ ఈఎంవీ చిప్ కార్డు తీసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే... బ్యాంకుకు వెళ్లి కొత్త కార్డు తీసుకోవచ్చు. మెరుగైన భద్రత, కార్డు మోసాలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఈ కొత్త తరహా కార్డ్‌లను తీసుకువచ్చింది. 
 
ఈ మేరకు ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలన్నింటినీ ఈఎంవీ కార్డులకు అనుగుణంగా కొత్త సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేసాయి. ఇందులో భాగంగా కార్డు లావాదేవీ పూర్తయ్యేంత వరకు కార్డు మెషీన్‌లోనే లాక్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం లేదా బ్యాలన్స్‌లు చూసుకోవడం చేసేవారు కార్డులను జాగ్రత్తగా వాడాలనీ, సరిగ్గా ఉపయోగించని పక్షంలో కార్డులు డ్యామేజ్ అయ్యే అవకాశముందని బ్యాంకులు తమ కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. 
 
దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కస్టమర్లను ఈ విషయమై హెచ్చరించింది. డబ్బులు డ్రా చేసే సమయంలో ఏటీఎం మెషీన్లలో డెబిట్ కార్డు లాక్ అవుతుందని, ఈ విషయం చాలా మందికి తెలియక కార్డును బలవంతంగా బయటకు తీస్తున్నారని తెలిపిన ఐసీఐసీఐ బ్యాంక్, ఇలా చేయడం వల్ల కార్డులోని చిప్ డ్యామేజ్ అయ్యే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే పలు కస్టమర్ల కార్డులు పనిచేయలేదని ఫిర్యాదులు అందినట్లు పేర్కొంది.
 
ఏటీఎంలో లావాదేవీ చేస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఏటీఎం మెషీన్ నుంచి కార్డును బలవంతంగా బయటకు లాగకూడదు. లావాదేవీ పూర్తయిన వెంటనే ఏటీఎం మెషీన్ మీ కార్డును రిలీజ్ చేస్తుంది. అప్పుడే తీసుకోవాలి. ఏటీఎం మెషీన్‌లో కార్డు స్లాట్‌లో గ్రీన్ కలర్ ఎల్‌ఈడీ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉంటే లావాదేవీ పూర్తయ్యిందని ఏటీఎం మెషీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు అర్థం చేసుకొని కార్డును వెనక్కు తీసుకోవాలి. ఒకవేళ లెడ్ లైట్ పనిచేయకపోతే ఏటీఎం స్క్రీన్‌లో లావాదేవీ పూర్తియినట్లు మెసేజ్ వచ్చేంత వరకు ఆగి... ఆ తర్వాతనే కార్డుని తీసుకోండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు