అక్టోబరు నుంచి భారీగా పెరగనున్న టీవీ ధరలు.. కారణమిదే!

గురువారం, 24 సెప్టెంబరు 2020 (19:59 IST)
దేశంలో అక్టోబరు మొదటి వారం నుంచి ఎల్.ఈ.డి ధరలు విపరీతంగా పెరిగిపోనున్నాయి. దీనికి కారణంగా.. టీవీల తయారీ కోసం వినియోగించే ఓపెన్ సెల్ దిగుమతులపై కేంద్రం ఐదు శాతం సుంకాన్ని వసూలు చేయనుంది. దీంతో టీవీల ధరలు కూడా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో టీవీ ధర రూ.500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు టీవీ ఉత్పత్తిదారులు చెబుతున్నారు. 
 
2017 డిసెంబర్ నుంచి టీవీ విడిభాగాలపై 20 శాతం కస్టమ్స్ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. అయితే ఓపెన్ సెల్ తయారీ దేశీయంగా చేపట్టేవరకు, దిగుమతికి అంగీకరించాలని పరిశ్రమ కోరడంతో 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పరిశ్రమకు ఇచ్చిన గడువు ఈ నెలతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఓపెన్ సెల్ పైన గతంలో ప్రకటించినట్లుగా 5 శాతం కస్టమ్స్ సుంకం అమలవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.
 
సుంకం విధించకపోతే, విడిభాగాలు తయారు చేయకుండా, దిగుమతి చేసుకొని, టీవీల అసెంబ్లింగ్ మాత్రమే దేశీయంగా తయారు చేస్తున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గడువు తీరిపోవడంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సుంకం విధింపు నేపథ్యంలో టీవీల ధరలు పెరగనున్నాయి. ఓపెన్ సెల్స్ పైన ఐదు శాతం సుంకం విధిస్తే టీవీ ధరలు పెంచాల్సి వస్తుందని దేశీయ టీవీ తయారీదారులు అన్నారు. 
 
32 ఇంచుల నుండి 42 ఇంచుల టీవీల ధరలు రూ.600 నుంచి రూ.1500 వరకు పెరుగుతాయని, పెద్ద స్క్రీన్ టీవీల ధరలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా తయారు చేసిన ప్యానల్ ధర ఇప్పటికే 50 శాతం పెరిగిందని, ఓపెన్ సెల్ పైన ఇప్పుడు 5 శాతం కస్టమ్స్ విధించడం వల్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి అంటున్నారు. అయితే ఓపెన్ సెల్‌ను ప్రముఖ బ్రాండెడ్ సంస్థలు రూ.2700 నుంచి రూ.4500 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయని, ఓపెన్ సెల్ ప్రాథమిక ధరను బట్టి దిగుమతి సుంకం భారం రూ.150 నుంచి రూ.250కి మించదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు