పునరుత్పాదక ఇంధన పరిష్కారాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ సంస్థ, జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, మే 21, 2025 సాయంత్రం జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో ప్రఖ్యాత జర్మన్ క్లీన్ ఎనర్జీ సంస్థ సెలెక్ట్ ఎనర్జీ GmbHతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్లు వెల్లడించింది. రోటర్‌డ్యామ్‌లో జరిగిన వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో జరిగిన ఈ ఒప్పందం ఇండో-జర్మన్ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి, ఎగుమతి-ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ మరియు అమ్మోనియా సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక చర్య ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండింటికీ గణనీయమైన పారిశ్రామిక , ఆర్థిక అవకాశాలను తీసుకురావటానికి సిద్ధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ములాపేట ఓడరేవులో అభివృద్ధి చేయబడుతున్న తమ ప్రతిష్టాత్మక గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్ట్‌ను జునో జౌల్ ఆవిష్కరించింది. ఇది యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లకు ధృవీకరించబడిన హరిత ఇంధనాల యొక్క కీలక ఎగుమతిదారుగా భారతదేశాన్ని ఉంచాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది.
నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌లో జరిగిన వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ సీఈఓ నాగశరత్ రాయపాటి, సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ GmbH మేనేజింగ్ డైరెక్టర్ ఫెలిక్స్ డేంజర్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ(MNRE)కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ అభయ్ బక్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతదేశం యొక్క క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌తో ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. జర్మనీకి ప్రాతినిధ్యం వహిస్తూ, జర్మన్ హైడ్రోజన్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి సిల్కే ఫ్రాంక్, గ్రీన్ టెక్నాలజీలలో ఇండో-జర్మన్ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీ శ్రీ సత్య పినిశెట్టి ఐఆర్ఎస్, జిహెచ్2 ఇండియా డైరెక్టర్ శ్రీ నిశాంత్ బాల షణ్ముగం కూడా పాల్గొన్నారు, వీరిద్దరూ అంతర్జాతీయ హైడ్రోజన్ సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వాలు, అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు మరియు కార్పొరేట్ సంస్థల సీనియర్ సలహాదారు డాక్టర్ పివి రమేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలోని ములాపేట ఓడరేవు సమీపంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయనున్న జునో జౌల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హరిత ఇంధన మౌలిక సదుపాయాల కార్యక్రమాలలో ఒకటి. మొత్తం 1.3 బిలియన్ యుఎస్డి (రూ. 10,000 కోట్లు) పెట్టుబడితో, ఈ ప్రాజెక్ట్ మూడు దశల్లో అభివృద్ధి చేయబడుతుంది, 2029 నాటికి సుమారు 180 KTPA గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2026లో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 5 నుంచి 6 వేల మంది కి ఉపాధి లభించనుంది.
“ప్రపంచవ్యాప్తంగా సరసమైన గ్రీన్ ఎనర్జీ కేంద్రాన్ని భారతదేశంలో నిర్మించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా కో -డెవలపర్‌గా సెలెక్ట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది” అని జునో జౌల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ నాగశరత్ రాయపాటి అన్నారు. “ఎనర్జీ ట్రేడింగ్ మరియు షిప్పింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా సమగ్రమైన లాజిస్టిక్స్‌లో వారి నైపుణ్యంతో ఈ భాగస్వామ్యం మా అమలు సామర్థ్యాన్ని పునరుద్ఘాటిస్తుంది, తక్కువ-కార్బన్ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచ పరివర్తనను వేగవంతం చేస్తుంది” అని శ్రీ రాయపాటి జోడించారు.