రూ.500కు పెట్రోల్ కొట్టించుకోండి... చిల్లర మాత్రం అడగొద్దు: బంకుల అసోసియేషన్

బుధవారం, 9 నవంబరు 2016 (11:38 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 వెయ్యి నోట్లను రద్దు చేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అయితే, ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఈ నోట్లు మరో 72 గంటల పాటు పెట్రోల్ బంకులు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, బస్టాండ్లలో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీంతో అనేక మంది వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల అసోసియేషన్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 
 
పెద్ద నోట్లను పెట్రోలు బంకుల్లోని సిబ్బంది స్వీకరిస్తున్నప్పటికీ, వారి వద్ద వంద నోట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో పలు బంకులను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకుల్లోకి వస్తున్న వారు రూ.1000 నోటిచ్చి వంద లేదా రెండొందలకు పెట్రోలు కొట్టమని అడుగుతుంటే, మిగతా చిల్లర ఇచ్చుకోలేక బంకుల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు రూ.500కు పెట్రోలు కొట్టించుకోవాలని సలహా ఇచ్చారు. బంకులకు వచ్చి చిల్లర మాత్రం అడగవద్దని కోరింది. బంకుల సిబ్బంది సైతం తమ సమస్య చెప్పి కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి