భారత్‌కు షాకిచ్చిన మూడీస్ : ఈ యేడాది వృద్ధి రేటు '0'

శుక్రవారం, 8 మే 2020 (20:28 IST)
ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్‌కు తేరుకోలేని షాకిచ్చింది. కరోనా కోరల్లో చిక్కుకునివున్న భారత్ ఈ యేడాది అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కేవలం సున్నాకే పరిమితంకానున్నట్టు తెలిపింది. అయితే, వచ్చే యేడాది అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ వృద్ధిరేటు కాస్త మెరుగ్గానే ఉంటుందని అంచనా వేసింది. 
 
ఇదే అంశంపై మూడీస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్దిరేటు సున్నాగా నమోదవుతుందని తెలిపింది. దీనికి కారణం కరోనా లాక్డౌన్ అని తేల్చి చెప్పింది. 
 
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎలాంటి ఆర్థిక వృద్ధిరేటును నమోదు చేయనప్పటికీ... వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధిరేటు ఒక్కసారిగా 6.6 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. ఈ ఏడాది ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని... జీడీపీలో అది 5.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
 
అయితే, భారత్‌లో వృద్ధిరేటు తగ్గడానికి గల కారణాలను కూడా మూడీస్ విశ్లేషించింది. గ్రామీణ కుటుంబాల్లో సుదీర్ఘంగా ఉన్న ఆర్థిక ఒత్తిడి, బలహీనమైన ఉద్యోగ కల్పన, ఆర్థిక సంస్థల్లో నగదు కొరత వంటివాటితోపాటు.. కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. 
 
కాగా, గత యేడాది నవంబరు నెలలో భారత్‌కు మూడీస్ బీఏఏ2 రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్థిక వృద్ధి తగ్గడంతో ఆ రేటింగ్‌ను నెగెటివ్‌కు సవరించింది. ఏది ఏమైనా కరోనా వైరస్, తద్వారా అమలవుతున్న లాక్డౌన్ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు.. ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు