నల్లధనాన్ని అరికట్టేందుకు 2.1 లక్షల నకిలీ కంపెనీలను ఒక్కకలం పోటుతో రద్దు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశామని గుర్తు చేశారు. ఢిల్లీలో బుధవారం కంపెనీ సెక్రెటరీల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిపై కొందరు నిరాశను వ్యాపింపజేయడం ద్వారా ఆనందపడుతున్నారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. నోట్ల రద్దు తమ ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయమన్నారు.
నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇపుడు 'నిజాయితీ' శకం ఆరంభమైందని... బ్లాక్‌మనీతో లావాదేవీలు జరిపేందుకు ప్రజలు ఒకటికి 50 సార్లు ఆలోచిస్తున్నారన్నారు. జీడీపీ తగ్గడం ఇపుడు కొత్తేమి కాదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించామని ప్రధాని పేర్కొన్నారు.
జాతీయ స్థూల ఉత్పత్తి మందగమనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, సంస్కరణలు కొనసాగిస్తామన్నారు. వర్తమాన ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే పని తాను ఎప్పుడూ చేయబోనని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మండిపడ్డారు.
వారు కేవలం గత రెండు త్రైమాసికాలను మాత్రమే చూస్తున్నారని, తాము సాధించిన విజయాలను చూడలేకపోతున్నారని అన్నారు. తాము ద్రవ్యోల్బణాన్ని 10 శాతం నుంచి 2.5 శాతానికి, కరెంటు ఖాతా లోటును 4 నుంచి 1 శాతానికి, ద్రవ్యలోటును 4.5 నుంచి 3.5 శాతానికి తెచ్చామని చెప్పారు. ఏప్రిల్-జూన్‌లో వృద్ధిరేటు 5.7 శాతానికి పడిపోతే నిరాశావాదులు కొంపలు మునిగినట్టు గగ్గోలు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.