ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి దశ పోలింగ్ ఈ నెల 7వ తేదీ సోమవారం ముగియనుంది. ఈ పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రోల్, డీజల్ ధర పెంపునకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వడ్డన కూడా ఏకంగా లీటరుకు రూ.15 నుంచి రూ.22 వరకు ఉండే అవకాశం లేకపోలేదని మార్కెట్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ స్థాయిలో చమురు ధరలు పెంచడానికి కారణం లేకపోలేదు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ యుద్ధం ప్రభావం చమురు ధరలతో పాటు అన్ని నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా పడింది. ఈ రెండు దేశాల మధ్య గొడవ కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి.
ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధర అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడంచింది. అదేగనుక జరిగితే దేశీయంగా పెట్రోల్, డీజల్ ధరలు లీటర్‌కు రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని పేర్కొంది. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కొనసాగుతోది. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరల పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.