తమిళనాడు ప్రజలపై సర్కారు భారీ వడ్డన.. అమాంతం పెరిగిన పెట్రోల్ ధరలు

ఆదివారం, 5 మార్చి 2017 (15:31 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు భారం మోపింది. పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను భారీగా పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ.3 మేరకు పెరిగాయి. 
 
తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను 27 శాతం వసూలు చేస్తుండగా దీన్ని 34 శాతానికి పెంచింది. అలాగే, డీజిల్‌పై 21.4 శాతంగా ఉన్న వ్యాట్‌ను 25 శాతానికి పెంచింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.3.78కి, డీజిల్ ధర రూ.1.70కు పెరిగింది. అంటే చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.75కు, లీటరు డీజిల్ ధర రూ.63.96కు చేరింది.
 
ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖండించింది. అన్ని వర్గాల ప్రజలపైనా తీవ్రమైన భారం పడుతుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. పెట్రోలు ధర పెరుగుదల వల్ల వాహనదారులపై ప్రభావం పడుతుందని, డీజిలు ధర పెరగడం వల్ల కూరగాయలు, సరకులు, వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి