దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఫలితంగా వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. శనివారం కూడా పెరిగిన పెట్రో ధరలతో హైదరాబాద్‌లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.
ఈ స్థాయిలో ధరలు ఎన్నడూ పెరగలేదని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అంటున్నారు. గత 22 రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.1.83 పెరిగింది. ఈ నెల 1వ తేదీన నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా, 22 నాటికి రూ.88.89కు చేరింది. ఇక డీజిల్ ధర జనవరి ఒకటో తేదీన రూ.80.60 ఉండగా.. 22న రూ.82.53కు చేరుకుంది. పెరుగుదల రూ.1.93గా ఉంది. చమురు ధరల పెంపుపై ఉన్న నియంత్రణను కేంద్రం ఎత్తివేసింది. దీంతో ధరల పెరుగుదల వల్ల వాహనదారులపై భారం భారీగా పడుతోంది.
కాగా పెట్రో ఉత్పత్తులకు సంబంధించి పాత బకాయిల చెల్లింపు ఇంకా పూర్తికాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మూడు నెలల వరకు ఉండే అవకాశాలున్నాయని పెట్రోలియం డీలర్ల సమాఖ్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం అప్పుతో పెట్రోలు కొనుగోలు చేసి ధర పెంచకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు. ప్రస్తుత ధర కంటే లీటర్‌కు రూ.4వరకు తగ్గే అవకాశాలున్నాయన్నారు.