రైలు రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేసే ప్రయాణికులు తమకు కేటాయించిన బెడ్‌పై ఇక నుంచి ఓ గంట తక్కువ సమయం పడుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రిజర్వేషన్ సౌకర్యం కలిగిన స్లీపర్ క్లాస్ ప్రయాణికులు.. రైలెక్కగానే పడకేస్తుంటారు. దీంతో లోయర్, మిడిల్ బెర్త్ ప్రయాణికులు తరచూ గొడవలు పడుతుండటం సహజమే. దీనికి రైల్వేశాఖ పరిష్కారం ఆలోచించింది.
ఇక నుంచి స్లీపర్ క్లాస్‌లలో ప్రయాణించే లోయర్, మిడిల్ క్లాస్ బెర్త్ వచ్చిన ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే పడుకోవాలని కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇక మిగతా సమయంలో కూర్చునే ఉండాలని స్పష్టంచేసింది. ఇప్పటివరకు ఈ సమయం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటలుగా ఉండేది.
కానీ, ఆగస్టు 31వ తేదీ నుంచి ఈ నిబంధనలో మార్పు తెచ్చింది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయితే అనారోగ్యంతో ఉన్నవాళ్లు, వికలాంగులు, గర్భవతుల విషయంలో సడలింపులు ఉన్నట్లు తెలిపింది. వీళ్లు అనుమతించిన సమయం కంటే ఎక్కువ కూడా పడుకునే అవకాశం ఉంటుంది.