ఇందులోభాగంగానే మినిమమ్ బ్యాలెన్స్ లేనివారిపైనా, నెలకు 4, 5 ఏటీఎం లావాదేవీలు, నగదు లావాదేవీలు జరిపే వారిపైనా ఛార్జెస్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. గతంలో ఎప్పుడో ఆపివేసిన మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్‌ను మళ్లీ అమలు చేసేందుకు ఎస్బీఐ సిద్ధమైంది. మిగిలిన బ్యాంకులు కూడా ఈ వైపుగా ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాయి.
ఎస్‌బీఐ విషయానికి వస్తే.. మినిమమ్ బ్యాలెన్స్ విధానాన్ని ఎస్‌బీఐ 2012లో ఆపేసింది. ఏప్రిల్ 1 నుంచి తిరిగి అమలు చేయాలని ఆ బ్యాంకు నిర్ణయించినట్లు బిజినెస్ స్టాండర్డ్‌లో వచ్చిన కథనం పేర్కొంది. పొదుపు ఖాతాల నిర్వహణకు అయ్యే వ్యయానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకుంటుంది. మెట్రోపాలిటిన్ ప్రాంతాల్లో పొదుపు ఖాతాల వినియోగదారులు నెలవారీ సగటు బ్యాలెన్సును రూ.5 వేలు ఉండేలా చూసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం రూ.1000 అని బ్యాంకు చెబుతోంది. జరిమానాగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తారు. సర్వీస్ ట్యాక్స్ దీనికి అదనంగా వసూలు చేయనున్నారట.