షేర్ మార్కెట్‌లోకి ఎంట్రీతోనే భారీ లాభాలతో అడుగుపెట్టింది ఫుడ్ డెలివర్ కంపెనీ జొమోటో. జులై 14 నుంచి16 మధ్య పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఆఫర్ చేసిన జొమోటో ఇష్యూ ధర కంటే 50 శాతం పైగా లాభంతో షేర్ ధర లిస్ట్ అయ్యింది. షేర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ షేర్లు ఆఫర్ చేసిన ధర రూ.76 కాగా, ఇవాళ ఉదయం 10 గంటలకు షేర్ మార్కెట్ ఓపెన్ కాగానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో రూ.116తో లిస్ట్ కావడం విశేషం.
వాస్తవానికి ఈ నెల 27న లిస్ట్ అవ్వాల్సిన జొమోటో ముందుగానే ఎంట్రీ ఇచ్చి, షేర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నెల 14న పబ్లిక్ ఇష్యూకు ఓపెన్ అయిన జొమోటో రూ.9,375 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఏకంగా 38 రెట్లు ఎక్కువగా కస్టమర్లు సబ్‌స్క్రైబ్ చేశారు. రూ.5 వేల కోట్ల కంటే అధికంగా ఉన్న షేర్లలో ఇది గడిచిన 13 ఏండ్లలోనే ఒక రికార్డ్.