సాధారణంగా ఓ వ్యక్తి లేదా ఓ రైతు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది తిరిగి చెల్లించేంత వరకు బ్యాంకులు ఊరుకోవు. తమ రుణాన్ని రాబట్టుకునేందుకు ఏకంగా ఆ వ్యక్తి లేదా రైతు ఇంట్లోని వస్తువులను వేలం వేసేందుకు సైతం ఏమాత్రం వెనుకాడవు. అంతేనా.. తీసుకున్న మొత్తానికి వడ్డీ.. ఆ వడ్డీకి చక్రవడ్డీని వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేసేస్తాయి.
అయితే, దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు మాత్రం బడా బాబుల పట్ల కరుణ, జాలి చూపింది. దేశంలో 63 మంది బడాబాబులు తీసుకున్న ఏడు వేల కోట్ల రూపాయలను ఒక్క సంతకంతో రద్దు చేసింది. వీరంతా ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టారని పేర్కొంది. వీరిలో లిక్కర్ డాన్ విజయ్ మాల్యా వంటి ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం.
మొత్తం 63 మంది డిఫాల్టర్లకు చెందిన రూ.7 వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. అంతేగాక, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన బకాయిలను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఊరట పొందిన డిఫాల్టర్ల లిస్టులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విక్టరీ ఎలక్ట్రికల్, కేఆర్ఆర్ ఇన్ఫ్రా, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ సంస్థల అధినేతలు ఉన్నారు. తెలంగాణలో తోతమ్ ఇన్ఫ్రా, ఎస్ఎస్.వీజీ ఇంజినీరింగ్ కాలేజీ అధినేతలు ఉన్నారు.