ఇంటర్మీడియెట్ తర్వాత చాలామంది విద్యార్థులు ఏయే కోర్సుల్లో ప్రవేశించాలనే దానిపై తర్జనభర్జనలు చేస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఏ ఉపాయం వారికి అందదు. పైగా సరైన గైడెన్స్ లభించక విద్యార్థులు ఏదో ఒక కోర్సులో చేరిపోతుంటారు. ముఖ్యంగా కొందరు తమకు నచ్చినా నచ్చకపోయినా వారి తల్లిదండ్రుల సూచన మేరకు మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసేస్తుంటారు.
ప్రస్తుతం మన సమాజంలో ఇతరులు ప్రవేశించే మార్గమే సరైన మార్గమని, పక్కింటివారు ఏ కోర్సులో చేరారో అదే కోర్సులో చేరేందుకు తమ పిల్లలను సదరు తల్లిదండ్రులు ప్రేరేపిస్తుంటారు. దీంతో వారు ఎంచుకునే కెరియర్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది ఆ వయసులో విద్యార్థులకు సరైన అవగాహన ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కోర్సు చేసినా దానికి తగ్గ అవకాశాలు చాలానే ఉన్నాయి. దీంతో మీకిష్టమైన కెరియర్‌ను ఎంచుకునే ముందు బాగా ఆలోచించి కెరియర్ ఎంచుకుని దానికి అవసరమైన సబ్జెక్ట్స్ అందిస్తున్న డిగ్రీ ఏది? ఆ డిగ్రీని ఏయే విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయో క్షుణ్ణంగా తెలుసుకోవాలి? అలాగే మీ భవిష్యత్తును దృష్టిలోవుంచుకుని ఏలాంటి చదువు చదివితే మీరు త్వరగా స్థిరపడతారో తెలుసుకుని నిర్ణయించుకోవడం మంచిది.
ఇంటర్మీడియెట్‌లో సైన్స్ కోర్సు చదివివుంటేః
సైన్స్ స్ట్రీమ్ చదివివుంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేయాలనుకుంటే ఏదైనా గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ లేదా బీఎస్సీ (ఆనర్స్) చేయొచ్చు. ఇందులో ప్రముఖంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయోలజీ, జువాలజీ తదితర సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఇవి వరుసక్రమంలో ప్రాధాన్యమనేది గుర్తుంచుకోవాలి. ఇవి కాక ఇప్పుడు బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఎలక్ట్రానిక్స్‌లాంటి సబ్జెక్టులలోను పలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలువురు విద్యార్థులు ఈ కోర్సులను ఎంచుకుంటున్నారు.
ఒకవేళ విద్యార్థులు సాంకేతిక రంగం (టెక్నికల్) లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకుంటే ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాన్ని ఎంచుకోవచ్చు. కాని ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకుంటే ( బీటెక్ లేదా బీఈ) లేదా మెడిసిన్ చేయాలనుకుంటే (ఎమ్‌బిబిఎస్, బిఎఎమ్ఎస్ తదితరాలు) అఖిల భారతీయ ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సివుంటుంది.
ఇంజనీరింగ్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులు పలు కాంపిటేటివ్ పరీక్షలు...ఉదా- ఏఐఈఈఈ, ఐఐటీజేఈఈ, గేట్ మొదలైన ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజనీరింగ్ రంగంలోనున్న మెకానికల్, ఏరోనాటికల్, కెమికల్, ఆర్కిటెక్చర్, బయోమెడికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ మొదలైన రంగాలను ఎంచుకునే అవకాశాలున్నాయి.
అదే మెడిసిన్ విభాగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఎమ్‌బిబిఎస్ కోర్సుతోపాటు కెరియర్‌ను మరింతగా తీర్చిదిద్దాలనుకుంటే మైక్రోబయాలజీ, ఫిజియోథెరపీ, వెటర్నరీ సైన్స్, హోమియోపతి, డెంటిస్ట్రీ మొదలైన కోర్సులు చేసే అవకాశాలున్నాయి. వీటికి జాతీయ లేదా స్టేట్ లెవల్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి.
కామర్స్ తీసుకున్న విద్యార్థులకుః
ఇంటర్మీడియెట్‌లో కామర్స్ కోర్సు తీసుకుని చదివిన విద్యార్థులు డిగ్రీలో బీకాం, బీకాం కంప్యూటర్స్, బీకాం(ఆనర్స్) చేయొచ్చు. వీటిద్వారా మీరు బిజినెస్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఆడిటింగ్, బిజినెస్ లా, బిజినెస్ మార్కెటింగ్, బపిజినెస్ కమ్యునికేషన్ తదితర అంశాలను చదివేందుకు అవకాశాలున్నాయి. కామర్స్ స్ట్రీమ్ ఎంచుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఎమ్‌బీఏ, ఛార్టెడ్ అకౌంటెంట్ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), ఫైనాన్షియల్ అనలిస్ట్ లాంటి అన్ని రకాల కెరియర్‌ల కోసం ఆప్షన్‌ను ఎంచుకునే సౌకర్యంవుంది.
ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్న విద్యార్థులుః
సాధారణంగా ఆర్ట్స్ స్ట్రీమ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో ఆశించిన విధంగా ఎదుగుదల ఉండదనే అపోహ చాలామందిలో ఉంది. దీంతోపాటు వారి కెరియర్‌లో ఆదాయం అంతగా ఉండదనేది పలువురి అభిప్రాయం. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముందుగానే చెప్పిన విధంగా ఏ సబ్జెక్టులు తీసుకున్నా అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్న విద్యార్థులు తమ చదువును కొనసాగిస్తూనే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలను చేజిక్కుంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్ట్స్ కోర్సుల్లో డిగ్రీలు చేసిన వారికి ఆర్థికశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం (ఫిలాసఫీ), సోషియాలజీ, ఆంగ్లం (ఇంగ్లీషు), హిందీ తదిర విషయాలను అధ్యయనం చేస్తే ఆయా రంగాలలో మంచి భవిష్యత్తు ఉంది.
ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి బీఏ, బీఏ (ఆనర్స్) డిగ్రీ చదవచ్చు. ఇందులో మీకు నచ్చిన కోర్సు మీ దగ్గరలోని విశ్వవిద్యాలయం అందించకపోతే మీరు వేరే విశ్వవిద్యాలయంలోనైనా మీకు నచ్చిన కోర్సును పూర్తి చేయొచ్చు. ఆర్ట్స్ సబ్జెక్ట్ చదివే విద్యార్థులు సివిల్ పరీక్షలకు తర్ఫీదు పొందే అవకాశాలున్నాయి. ఉదా-ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్‌లాంటి వాటికి ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటితోపాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఎమ్‌బీఏ, జర్నలిజం, మార్కెట్ అనాలసిస్, టీచింగ్, ఆంథ్రోపాలజీ, హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ఆర్), ఎమ్ఎస్‌డబ్ల్యూ మొదలైన రంగాల్లో రాణించేందుకు అవకాశాలున్నాయి.
ప్రొఫెషనల్ కోర్సులుః
ప్రస్తుతం ప్రపంచం గ్లోబలైజేషన్ అయిన కారణంగా ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థినీ-విద్యార్థులు బీఏ, బీకాం, బీఎస్సీలాంటి ట్రెడిషనల్ కోర్సులే కాకుండా మరిన్ని ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని తదివిన తర్వాత కార్పోరేట్ రంగంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు. వీటిలో ఐటీ, మేనేజ్‌మెంట్ రంగాలకు సంబంధించిన కోర్సులు ప్రముఖంగా చేయాల్సి వుంటుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన తర్వాత తరచూ పెద్ద-పెద్ద కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటాయి.
షార్ట్ టర్మ్ కోర్సులుః
డిగ్రీ కోర్సును చదువుతూనే షార్ట్ టర్మ్ కోర్సుగా యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, ఆస్ట్రానమీ, లింగ్విస్టిక్, ఏవియేషన్ తదితర రంగాల్లో షార్ట్ టర్మ్ కోర్సులు పూర్తి చేస్తే మీ కెరియర్ మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ షార్ట్ టర్మ్ కోర్సులను మీరు రెగ్యులర్ లేదా ఉద్యోగం లేదా డిగ్రీ చదువుతూనే పూర్తి చేయవచ్చు. దీంతో మీకు మరిన్ని ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలున్నాయి.