టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం (మార్చి 17,2021) జీవో 23 విడుదల చేసింది. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇక ఏడాదికి ఒక్కసారే టెట్ నిర్వహిస్తారు. అదీ కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇప్పటివరకు రెండు పర్యాయాలు టెట్ నిర్వహించాలని ఉన్న నిబంధనను ప్రభుత్వం సవరించింది.
కాగా, ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం నేపథ్యంలో టెట్‌లో ఇంగ్లిష్ ప్రొఫెషియన్సీ ప్రశ్నలను ఈసారి తప్పనిసరి చేస్తున్నారు. 1-5 తరగతులకు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు పేపర్-1ఏను, 6-8 తరగతులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు పేపర్-2ఏను నిర్వహించనున్నారు.
పేపర్-2ఏ రాసేవారు ఆసక్తి ఉంటే పేపర్-1ఏ కూడా రాయొచ్చు. కాగా, ప్రత్యేక స్కూళ్ల పోస్టులకు(ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు) సైతం టెట్ ఉండగా, వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.