నేడు దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్షలు - పరీక్షా సమయం పెంపు

ఆదివారం, 17 జులై 2022 (10:28 IST)
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. ఆదివారం మధాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు సమయం కేటాయించారు. ఇందుకోసం ఈ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి పరీక్షా సమయం 3 గంటలు మాత్రమే. కానీ, ఈ దఫా 20 నిమిషాలు అదనంగా కల్పించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 
 
ఈ పరీక్ష కోసం ఇచ్చే ప్రశ్నపత్రంలో మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయాన్ని ఇవ్వగా.. ఇందులో 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వాలి. గతేడాది 200 ప్రశ్నలిచ్చి 180 నిమిషాల్లోనే 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వచ్చేది. దీంతో ఆ అదనపు 20 ప్రశ్నలను చదువుకొని, అర్థం చేసుకొని, సమాధానం ఇవ్వడానికి సమయం సరిపోయేది కాదు. ఇప్పుడా విషయంలో ఆందోళన తప్పింది. 
 
ప్రశ్నపత్రం తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఉంటుంది. అందువల్ల అభ్యర్థి తనకు అనుకూలమైన భాషలో ఈ పరీక్షకు రాయొచ్చు. తెలంగాణలో సుమారు 60 వేల మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందు అంటే మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. 
 
ఈ పరీక్షకు వచ్చే అభ్యర్థులు రిపోర్టింగ్‌ సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయానికంటే కనీసం అరగంట ముందుగా కేంద్రానికి చేరుకుంటే మేలు. విద్యార్థులు నిబంధనలను పాటించకపోయినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారిని మూడేళ్లు డిబార్‌ చేస్తారు. 
 
ఇది పెన్‌, పేపర్‌ ఆధారిత పరీక్ష. విద్యార్థులు ఏ కారణంతోనైనా జవాబుపత్రం నుంచి ఏపేజీని కూడా చించకూడదు. అభ్యర్థులు నీట్‌ అడ్మిట్‌ కార్డు వంటి డాక్యుమెంట్లపై ఎలాంటి ట్యాంపరింగ్‌ చేయకూడదు. దరఖాస్తు ఫారం నింపేటప్పుడు, అడ్మిట్‌ కార్డుపై అతికించే ఫొటోలో ఎలాంటి మార్పులు చేయొద్దు.
 
విద్యార్థులు అడ్మిట్‌ కార్డ్‌, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఉదాహరణకు పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, రేషన్‌కార్డు వంటివి ఏవైనా తీసుకెళ్లవచ్చు.
 
కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు తప్పనిసరి. అభ్యర్థులు అనారోగ్యంతో బాధపడుతుంటే.. సంబంధిత వైద్యుడి సూచనల చీటీని చూపించి మందులు, పారదర్శకంగా ఉండే నీళ్ల సీసాను తీసుకెళ్లవచ్చు. 50 మిలీ చిన్న హ్యాండ్‌ శానిటైజర్‌ను వెంట ఉంచుకోవచ్చు.
 
అభ్యర్థులు ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవి పోగులు, ముక్కు పిన్‌లు, గొలుసులు, నెక్లెస్‌లు, బ్యాడ్జ్‌లు, హెయిర్‌పిన్లు, హెయిర్‌ బ్యాండ్‌లు, తాయెత్తులు, గాగుల్స్‌, హ్యాండ్‌ బ్యాగులు తదితర ఆభరణాలను ధరించరాదు.
 
 ఏ తరహా కాగితాలు, కాగితపు ముక్కలు, పెన్నులు, పెన్సిళ్లు, పెన్సిల్‌ బాక్సు, పర్సు, కాలిక్యులేటర్‌, స్కేల్‌, పెన్‌ డ్రైవ్‌లు, రబ్బరు, ఎలక్టాన్రిక్‌ పెన్‌, స్కానర్‌, ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్లు, మైక్రోఫోన్‌, పేజర్‌, హెల్త్‌ బ్యాండ్‌, చేతి గడియారం, కెమెరా తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులేవీ వెంట తీసుకెళ్లొద్దు.
 
అభ్యర్థులు సాధారణ చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను ఇస్తారు. పరీక్ష రాసే సమయంలో ఏ కారణంతోనూ గదిని వదిలి వెళ్లడానికి అనుమతించరు. కేటాయించిన సమయం ముగిశాక అభ్యర్థులు బయటకు వెళ్లవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు