బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ ర్యాంకులు సోమవారం వెలువడనున్నాయి. నాలుగో విడుత పర్సంటైల్‌తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించనుంది. దీంతోపాటు కటాఫ్ మార్కులను కూడా విడుదల చేయనుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో చూడవచ్చు.
ఇదిలావుంటే, సోమవారం మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 19 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చల్లించవచ్చు.