ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడంతో పన్నీర్ వర్గంలో తాత్కాలికంగా నిరాశ ఏర్పడగా.. శశికళ వర్గం సంబరాలు చేసుకుంది. ఇక అధికారం తమదేనని, తమిళనాడు తమదేనని నమ్మేసింది. ఆ అనుకూలతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో, బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... ఈ నెల18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. కానీ మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్ ఇచ్చి పన్నీర్ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించడంతో శశివర్గంలో ప్రకంపనలు బయలుదేరాయి.