హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన యువకుడికి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో... అతడి కడుపులో నుంచి గర్భసంచి, అండాశయం బయటపడడం చూసి వైద్యులు నివ్వెరపోయారు. విస్మయం గొలిపే ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీప్రియ నర్సింగ్ హోంలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం హోసూరు సమీపంలోని ఇటుకపల్లికి చెందిన అమరేష్(23) కుడి వృషణంలో విపరీతమైన నొప్పి రావడంతో కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.
అతడిని పరీక్షించిన వైద్యులు ఇంగ్యునియల్ హెర్నియాతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. అంతేకాక వృషణం ఉండాల్సిన స్థానం ఖాళీగా ఉన్నట్టు గుర్తించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ కోసం వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు యువకుడి కడుపులో గర్భసంచి, అండాశయం ఉండడాన్ని చూసి ఖంగుతిన్నారు.
అంతేకాదు అతడికి వృషణాలు లేకపోగా, వాటి విధులను ఓవరీస్(అండాశయం) నిర్వహిస్తుండడం చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం సర్జరీ చేసి గర్భాశయాన్ని తొలగించారు. ఈ ఆపరేషన్ తర్వాత అతనికి ఎటువంటి ఇబ్బందులు కలగదని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసులు చాలా అరుదని వైద్య పరిభాషలో దీనిని ''పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్'' అంటారని వైద్యులు పేర్కొన్నారు.