ఇంట్లో వస్తువులు - బుడిబుడి నడకల చిన్నారులు ఏం చేస్తారో తెలుసా?

సోమవారం, 16 డిశెంబరు 2019 (21:30 IST)
అప్పుడే నడక నేర్చుకుని బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరిగే చిన్నారులను చూస్తే ఎంతో ముద్దొస్తుంది. ఐతే వారు అలా తిరుగుతున్నప్పుడు ఓ కంట కనిపెడుతూ వుండాలి. అలా కాకుండా స్వేచ్ఛగా వారు ఇల్లంతా కలియతిరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.
 
1. టీవీ, కంప్యూటర్‌లకు సంబంధించిన వైర్లు, స్విచ్‌లు నేలపై వేలాడనివ్వద్దు. పట్టుకుని లాగితే వస్తువులు కిందపడతాయి. అలా పడిపోయినా ఫర్వాలేదు కానీ కరెంటు వైర్లతో చిన్నారులు ప్రమాదం బారిన పడే అవకాశం వుంటుంది కనుక వాటిని సాధ్యమనంతవరకూ వారికి అందనంత ఎత్తులో వుండేట్లు చూడాలి. అలాగే ఉపయోగించని ఎలక్ట్రానిక్ పరికరాలను పైన భద్రపరచడం మేలు. పనిచేయని స్విచ్‌లు.. ఫ్లగ్ పాయింట్లకు టేప్‌లు అతికించడం చాలా అవసరం.
 
2. మీరు వాడే సౌందర్య సాధనాలు, పరిమళాలు మాత్రమే కాదు.. సాధారణ టాల్కమ్ పౌడర్‌ను సైతం డ్రెస్సింగ్ టేబుల్‌పై లేకుండా చూసుకోంటి. పని పూర్తయిన వెంటనే.. సర్దేయండి. నోట్లో పెట్టుకోవడమే కాదు... ముఖమంతా రాసుకుంటారు. అంతేనా కళ్లల్లో పెట్టుకుంటారు. పౌడర్ వల్ల ఉక్కిరిబిక్కిరి అయితే... కొన్నిరకాల క్రీంలు రాసుకోవడం వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
 
3. చిన్నారులకు సంబంధించిన మందులు, టానిక్‌లు, చిల్లర నాణేలు, చిన్నచిన్న వస్తువులు.. తదితరాలన్నీ అందుబాటులో ఉంచకండి. చేతికి చిక్కాయా! మింగేస్తారు. ఆ తరువాత డాక్టరు దగ్గరకు పరుగెత్తాల్సి వస్తుంది.
 
4. వంటింటి గురించి చెప్పాలంటే.. వండిన వేడి పదార్థాలు, మూతపెట్టి ఎతైన ప్రదేశంలో పెట్టాలి. అలాగే అగ్గి పెట్టెలు, లైటర్లు వంటివి పొడవైన డబ్బాలో ఉంచి స్టౌ పక్కన పెట్టుకోవాలి. ఫోర్కులు, పదునైన కత్తులు, చెంచాల్లాంటివి మరో పెద్ద డబ్బాలో వేసుకొని అందనివ్వకుండా చూసుకోవాలి. పనిపూర్తయిన వెంటనే గ్యాస్ సిలిండర్‌ను కట్టేయడం.. ఫ్రిజ్ తలుపుకి తాళం వేయడం వంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలే.
 
5. గృహాలంకరణలో భాగంగా గాజు, క్రిస్టల్, పింగాణి వంటి విలువైన వస్తువులను అందరికీ కనిపించేలా సర్దుతుంటాం. ఇవే పిల్లలకు అందితే... ఠక్కున లాగేస్తారు. వస్తువులు ముక్కలవడం అటుంచితే గుచ్చుకున్నాయంటే ఎంతో ప్రమాదం. అందుకే అందనంత ఎత్తులో ఉంచాలి. అరలకు పారదర్శక కవరును అతికించడం మరచిపోవద్దు.
 
6. పిల్లలు నడక నేర్చింది మొదలు తమంతట తామే బాత్రూంకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటప్పుడు వాటంతటవే మూతపడే తలుపులుంటే పిల్లలు లోపల చిక్కుకుపోయే ప్రమాదముంటుంది. ఈ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే బాత్రూంలో పని పూర్తయిన వెంటనే తలుపుల్ని బయటనుంచి మూసేయండి.
 
7. పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు.. బకెట్‌లో నిండుగా నీళ్లు పట్టి.. మరోపనిపై వెళ్లడం కూడా సరైన పనికాదు. బక్కెట్లోకి పడిపోయే ఆస్కారం లేకపోలేదు. టబ్‌లో స్నానం చేయిస్తున్నప్పుడు ఫోన్ మోగినా, వారిని వదిలేసి వెళ్లకూడదు.
 
8. బాత్రూంను శుభ్రపరిచే రసాయనాలు, బ్రష్‌లు, సబ్బులు, షాంపుల్లాంటివి పిల్లలకు అందకుండా దాచాలి. బాత్రూంలో సిట్టింగ్ టాయ్‌లెట్ ఉన్నట్లయితే ఎప్పుడూ దానిమూత మూసేసి ఉంచాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ చాలా చిన్నవిగా అనిపించినా వీటితోనే చిన్నారులకు సమస్యలు వస్తాయి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు