రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, సీపీఐ యోధుడు, మాజ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మృతి చెందిన సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహం సినీ రాజకీయ నేతలు, ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ నగరంలోని మఖ్దాం భవన్‌లో ఉంచారు. అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అని అన్నారు. రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. 'విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగటం గర్వకారణం. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన గొప్పనేతల్లో ఆయన ఒకరు.
అధికారం ఉన్నా.. లేకున్నా తన సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదు. సురవరం కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ ప్రభుత్వం గొప్ప నేతల పేర్లను పలు సంస్థలకు పెట్టింది. సురవరం సుధాకర్ రెడ్డి సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తాం' అని రేవంత్ రెడ్డి అన్నారు.