పిల్లలకు ఏదో నేర్పాలనే తాపత్రయం పెద్దలది. అవసరమున్నవి లేనివి అన్నీ వాళ్లకు చెప్పాలని ఎంతో తాపత్రయం పడతారు. నిజానికి పిల్లలకు నేర్పడం కాదు చేయాల్సింది. పిల్లల నుండి నేర్చుకోవడం చేయాలి.
పిల్లలు పుట్టగానే హఠాత్తుగా మీలో కొత్త ఆనందం వస్తుంది. హాయిగా నవ్వడం మొదలుపెడతారు. ఏవేవో పాటలు నోటి వెంట వస్తాయి. పిల్లలతోపాటు పాకుతారు... గెంతుతారు. మీ జీవితంలో అంత మార్పు తెచ్చిన ఆ పిల్లలను చూసి మీరు నేర్చుకోవాలేగాని వారికి పాఠాలు చెప్పరాదు.
కాబట్టి పిల్లలను జాగ్రత్తగా పెంచాలనుకోకండి. అసలు సమస్య ఆ పెంపకమే. ఆ పిల్లలకు కావాల్సిన ప్రేమ, ఆనందం అందిస్తూ వారికి మద్దతుగా నిలబడండి. మీ పెరటిలో నాటిన మొక్కను ఎలా పోషిస్తారో అలాగే మీ పిల్లలను చూడండి.
ఇంట్లో తగిన వాతావరణం కల్పించండి. వారికి కోపం అంటే ఏమిటో తెలియనీకండి. కష్టాలు కలుగనీయవద్దు. తిట్టడం, దండించడం చేయవద్దు. నిరాశ, నిస్పృహలను చూపకండి. మీ ఇంట్లో మీ పిల్లల మనసుల్లో ఆనందం తాండవించకపోతే అప్పుడు చెప్పండి. ఇలా చేస్తే మీ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు. మీ ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్తగా పెంచితే మంచి పిల్లలుగా పెరుగుతారు.
మీ బాధ్యత వారి వెంట ఉండటం కాదు, వారికి కావాల్సిన వాతావరణం సృష్టించడం మాత్రమే.