పసిపిల్లలకు తల్లిపాలకు మించిన దివ్యౌషధం మరొకటి లేదని అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకించి మగపిల్లలకు తల్లిపాలను మాత్రమే పట్టిస్తే.. భవిష్యత్తులో వారు మంచి విద్యావంతులవుతారని తాజా పరిశోధనలో వెల్లడైంది.
సాధారణంగా తల్లిపాలు పిల్లల మెదడు పెరుగుదలపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. ఆరు నెలలు లేదా అంతకు పైబడి తల్లిపాలను తాగే పసికందులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మంచి తెలివికలిగిన వారుగా ఎదుగుతారు. డబ్బాపాలు తాగిన పిల్లలకన్నా తల్లిపాలు సేవించిన పిల్లలే పాఠశాల వయస్సు(10 ఏళ్లు)లో మంచి తెలివిగా వ్యవహరిస్తారని తాజా పరిశోధనల్లో తేలింది.
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పరిశోధనలో పరిశోధకులు 2,868 మంది విద్యార్థుల విద్యా ఫలితాలు (అకడెమిక్ స్కోర్) ఆధారంగా ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సదరు విద్యార్థుల తల్లులు తమ పిల్లలకు డబ్బాపాలు పట్టించారా.. లేక తల్లిపాలు పట్టించారా.. అనే అంశాలపై అధ్యయనం చేసి తల్లిపాలకు, విద్యా ఫలితాలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించారు.
కాగా.. వీరి అధ్యయనంలో ఆరు నెలలు లేదా అంతకు మించి తల్లిపాలు సేవించిన విద్యార్థులు అత్యధిక అకడెమిక్ ఫలితాలను సాధించారు. అదే ఆరు నెలల కన్నా తక్కువ, లేదా అస్సలు తల్లిపాలు సేవించని విద్యార్థులు తమ విద్యా ఫలితాలలో చాలా వెనుకబడినట్లు తేలింది.
అయితే ఈ ఫలితాలు అబ్బాయిలు, అమ్మాయిలపై వేర్వేరుగా ఉన్నాయి. తల్లిపాలు తాగిన అబ్బాయిలు చదవడం, రాయడం, పలకడం వంటి వాటిల్లో అత్యున్నత ప్రతిభను కనబరిచారు. కాబట్టి ఈ ఫలితాలు ఎలా ఉన్నా.. పసికందులకు తల్లిపాలే శ్రేష్టం, ఆరోగ్యదాయకమని వైద్యులు చెబుతున్నారు.