* చిన్నారులతో ప్రతి తల్లిదండ్రులు స్నేహితులుగా మెలిగి, వారి మంచిచెడులు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే పిల్లల ఇష్టాయిష్టాలపై దృష్టి పెట్టాలి. అంతేగానీ పెద్దల అభిప్రాయాలను బలవంతంగా వారిమీద రుద్దకూడదు.
* స్కూలు, పాఠాలు, హోంవర్కులతో సతమతమవుతున్న చిన్నారులను... అస్తమానం ఇంట్లో కూడా చదవమంటూ ఒత్తిడి చేస్తూ, వారిపై శక్తికి మించిన భారాన్ని మోపడం సబబు కాదు. సాధ్యమైనంతగా పసివారిపై అదనపు భారాన్ని మోపకుండా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.
* పిల్లల చేత దగ్గరుండి చిన్న చిన్న ఇంటిపనులను చేయించటం మంచిదే. అయితే, ఇలా చేయటం మంచిదే అయినా.. పిల్లల్ని పూర్తిగా దానికే అలవాటుపడేలా చేయకూడదు. ప్రతిరోజూ దగ్గరుండి చేయించటం వల్ల, వారు పూర్తిగా పెద్దలమీదే ఆధారపడేలా తయారవుతారు, సొంతంగా ఏ పనీ చేసేందుకు ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితి వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తెస్తుంది.
* టీచర్లు ఒక వ్యాసం రాయటమో, ఒక కథ చెప్పటమో లాంటి పనులను పిల్లలకు అప్పగించినప్పుడు.. వాటిని పూర్తిగా రాసి, మక్కీకిమక్కీగా అప్పజెప్పే పద్ధతి మంచిది కాదు. ప్రశ్నలైనా, జవాబులైనా పిల్లలు బట్టీ పట్టనివ్వకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. అంతేగాకుండా టీచర్లు చెప్పిన పాఠాలు పిల్లలకు అర్థం కాకపోతే, తల్లిదండ్రులే వారికి మళ్లీ అర్థమయ్యేలా చెప్పి, సొంతంగా వారి మాటల్లోనే జవాబులు చెప్పడం, రాయటం లాంటివి చేసేలాగా వారిని ప్రోత్సహించాలి.