కావలసిన పదార్థాలు : చికెన్.. పావు కేజీ గోధుమపిండి.. వంద గ్రా. మైదా.. పావు కేజీ కొత్తిమీర.. రెండు కట్టలు నూనె.. వంద మి.లీ. కారం.. అర టీ. గుడ్డు.. ఒకటి పచ్చిమిర్చి.. ఆరు ఛాట్ మసాలా.. అర టీ. ఉప్పు.. తగినంత అల్లం వెల్లుల్లి.. పావు టీ.
తయారీ విధానం : గోధుమ, మైదా పిండిలను కలిపి, తగినంత ఉప్పు చేర్చి, నీళ్లుపోసి మెత్తటి చపాతీ పిండిలా కలిపి.. ముద్దలుగా చేయాలి. వీటిని అట్లకాడతో పలుచటి చపాతీల్లా చేసి పక్కనుంచాలి. గిన్నెలో గుడ్డు పగులగొట్టి, దానికి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
ఆపై ఓ గిన్నలో చికెన్ వేసి దాంట్లో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని చేర్చి మెత్తగా ఉడికించి.. ఆ మాంసాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అట్ల పెనంమీద చపాతీలను రెండువైపులా కాల్చి నాలుగు టీస్పూన్ల నూనె పూసి, ఓవైపు గుడ్డు మిశ్రమాన్ని పూసి ఉడికించాలి. పైన చికెన్ ముక్కల్ని, ఛాట్ మసాలాను చల్లి.. చుట్ట చుట్టి వేడిగా ఉండగానే చాకుతో ముక్కలుగా కోసి.. టొమోటో సాస్‌తో సర్వ్ చేయాలి.