కరోనాపై జగన్ రివ్యూ - ఆస్పత్రుల్లో పారాసిటమాల్ మాత్రలు సిద్ధంగా ఉంచండి..

శుక్రవారం, 20 మార్చి 2020 (18:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం జిల్లా అల్లిపురం వాసికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈయన ఇటీవలే మక్కాకు వెళ్లి వచ్చాడు. దీంతో ఆయనకు ఈ వైరస్ సోకింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలని సూచన చేశారు. ముఖ్యంగా ఈ నెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా థియేటర్స్‌ను మూశామని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా... ప్రజల్లో అవగాహన పెంచాలని, వారిలో అపోహలను తొలగించాలని ఆదేశించారు.
 
అలాగే, ప్రజల మధ్య సామాజిక దూరంపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని జగన్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... నిత్యావసరాల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పారు.
 
ప్రధానంగా అన్ని ఆస్పత్రుల్లో పారాసిటమాల్ మాత్రలతో పాటు.. యాంటీ బయోటిక్స్‌ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది మొత్తం ఆసుపత్రుల్లో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. స్వీయ నిర్బంధంపై దృష్టి సారించాలని అధికారులకు ఆయన సూచన చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు