కరోనా విజృంభణ.. ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు

శనివారం, 24 ఏప్రియల్ 2021 (12:14 IST)
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తుంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి రెట్టింపు వేగంతో విస్తరిస్తుండడంతో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 
 
వరుసగా మూడో రోజు శనివారం మూడు లక్షలకుపైగా కేసులు, రెండువేలకుపైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల వరకు కరోనా కేసులు నమోదవగా.. 7వేలకుపైగా జనం ప్రాణాలు వదిలారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 2,624 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.
 
తాజాగా 2,19,838 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,66,10,481కు చేరగా.. ఇప్పటి వరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. మొత్తం 1,89,544 మంది మహమ్మారితో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది.
 
ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో 13,83,79,832 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా టెస్టులు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 17.53లక్షల శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు వరకు 27.61 లక్షల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు