దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. అయితే, పాజిటివ్ కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మరోసారి నాలుగువేలకుపైగా నమోదయ్యాయి. ఒకే రోజు 4,077 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
మరో వైపు వైరస్ నుంచి బాధితులు భారీగా కోలుకున్నారు. 24 గంటల్లో 3,62,437 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077కు చేరగా.. ఇప్పటివరకు 2,07,95,335 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 2,70,284 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.
ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 18,22,20,164 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలావుండగా, శనివారం ఒకే రోజు 18.32లక్షల కొవిడ్ టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు 31.48 కోట్లు టెస్టులు చేసినట్లు వివరించింది. మరోవైపు, కరోనా వైరస్ సోకి కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ కన్నుమూశారు.